చల్తా హై.. చెల్లదు
ప్రేరణ
మీరు ఒక ఊరికి వెళ్లొద్దామని అనుకుంటున్నారు.
కానీ, అక్కడికి వెళ్లడానికి దారి తెలియదు. ఏం చేస్తారు?
కంప్యూటర్ ఆన్ చేసి, వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి. చాలా మ్యాప్‌లు కనిపిస్తాయి. వీటి ద్వారా ఆ ఊరికి ఎలా వెళ్లాలో దారి తెలుసుకొని, ప్రయాణం ప్రారంభించొచ్చు. జీవితంలో మాత్రం కోరుకున్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఈ వెసులుబాటు లేదు. టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు రోడ్‌మ్యాప్ అందజేసే వెబ్సైట్లు మనకు అందుబాటులో లేవు.
దగ్గరి దారులొద్దు
నేటి ఆధునిక సమాజంలో యువతకు చాలా లక్ష్యాలున్నాయి. స్థిర, చరాస్తులు సమకూర్చుకోవాలి. డబ్బు, పేరు, మంచి హోదా రావాలి. కుటుంబంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. ఇలాంటి లక్ష్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. లక్ష్యం దిశగా ప్రయాణం ప్రారంభించినప్పుడు ఎదురుగా రెండు మార్గాలు కనిపిస్తాయి. ఒకటేమో.. సులభమైన దగ్గరి దారి. గతుకుల్లేని చక్కటి దారి. మరొకటి.. కఠినమైన దూర మార్గం. ఆ దారిలో చాలా ఎత్తుపల్లాలు, అడ్డంకులు ఉంటాయి. మనం దేన్ని ఎంచుకుంటాం? కచ్చితంగా దగ్గరి దారినే.
అసలైన అంతర్గత శక్తిని వెలికితీయాలి
దగ్గరి దారుల్లోనే ప్రయాణించడం ఇప్పుడు మనకు ఒక అలవాటుగా మారిపోయింది. షార్ట్‌కట్స్ కోసం వెతుక్కుంటున్నాం. రాజీ పడిపోతున్నాం. విజయం సాధించేందుకు మనల్ని మనం కష్టపెట్టుకోలేకపోతున్నాం. శ్రమకు వెనుకాడుతున్నాం. సక్సెస్ రాకున్నా ఫర్వాలేదు.. ఫెయిల్యూర్ మాత్రం రాకూడదు అనే దృక్పథం మనుషుల్లో పెరిగిపోయింది. విజయం కోసం కృషి చేయడం లేదు. కానీ, పరాజయం రావొద్దని అనుకుంటున్నాం. ఫలానా సబ్జెక్టులో మూడు చాప్టర్లు చదువుకుంటే చాలు 35 మార్కులు వస్తాయి. పరీక్షల్లో గట్టెక్కుతాం. వారానికి నాలుగుసార్లు క్లాస్‌కు వెళ్తే చాలు బ్లాక్‌లిస్టులో మన పేరు ఉండదు.. ఇలాంటి టిప్స్ పాటించేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటివి మన జీవితాల్లో భాగంగా మారుతున్నాయి. నిజానికి మనలోని శక్తిసామర్థ్యాలతో ఎంతో సాధించొచ్చు. కానీ, సాధించలేకపోతున్నాం. కారణం.. షార్ట్‌కట్స్‌ను, టిప్స్‌ను నమ్ముకోవడమే. మనలోని అసలైన శక్తిని వెలికితీయడం లేదు. ‘చల్తా హై..’ అనేది ఆలోచనా విధానంగా మారింది. అది చెల్లదని తెలుసుకోవాలి.
కచ్చితత్వం.. లోపలి నుంచి వస్తుంది
ఓ చిన్నపట్టణంలో గొప్ప శిల్పకారుడు ఉండేవాడు. స్థానికంగా ఉన్న ఆలయంలో ప్రతిష్టించేందుకు దేవత విగ్రహాన్ని చెక్కడం ప్రారంభించాడు. ఓ రోజు ఓ యువకుడు అటువైపు వచ్చాడు. శిల్పి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయాడు. శిల్పి చెక్కుతున్న విగ్రహం పక్కనే అలాంటిదే మరొకటి పడి ఉండడం గమనించాడు. ఆలయానికి రెండు విగ్రహాలు అవసరమా? అని ప్రశ్నించాడు. కాదు ఒకటేనని శిల్పి బదులిచ్చాడు. మరి రెండు ఎందుకు చెక్కుతున్నారని సందేహం వ్యక్తం చేయగా.. ఆ విగ్రహం చెక్కుతుండగా చిన్న పొరపాటు వల్ల దెబ్బతిన్నదని అందుకే మరొకటి చెక్కుతున్నానని వివరించాడు.
కిందపడి ఉన్న విగ్రహాన్ని యువకుడు నిశితంగా పరిశీలించాడు. అంతా సక్రమంగానే ఉంది, ఎక్కడా దెబ్బతిన్నట్లు కనిపించలేదు. విగ్రహం బాగుందని, ఎలాంటి లోపం కనిపించడం లేదని అన్నాడు. జాగ్రత్తగా చూడు, ఎడమ కంటి కింద చిన్న పగులు ఉంది అని శిల్పి చెప్పాడు. విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్టిస్తారని యువకుడు అడగ్గా.. ఆలయం లోపల ఎత్తయిన వేదికపై ప్రతిష్టిస్తామని శిల్పి వివరించాడు.
అంత ఎత్తులో ఉండే విగ్రహంలో సూక్ష్మమైన పగులు ఎవరికి కనిపిస్తుందని యువకుడు ప్రశ్నించాడు. నాకు కనిపిస్తుంది అంటూ.. ఆ శిల్పి చిరునవ్వుతో బదులిచ్చాడు. పనిలో పరిపూర్ణత సాధించడం అంటే ఇదే. కచ్చితత్వం అనేది బయటినుంచి రాదు, మనిషి లోపలి నుంచే వస్తుంది. పనిలో పరిపూర్ణత కోసం సాధన చేయాలి. కచ్చితత్వాన్ని అలవర్చుకోవాలి.
శీల నిర్ణయం ఇలా
శ్రమించే విషయంలో రాజీపడొద్దు. శరీరంలోని 100 శాతం శక్తిని వెలికితీసి, ఆచరణలో పెట్టాలి. చేసే పని ఏదైనా 100 శాతం పరిపూర్ణంగా, ఉత్తమంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలి. ఎవరో ఆదేశించారని ఇష్టం లేని పనులు బలవంతంగా చేయొద్దు. దానివల్ల పరిపూర్ణత రాదు. మీరు ప్రేమించే, కోరుకొనే పనులను ఇష్టంతో చేయండి. వాటిలో పరిపూర్ణత సాధించండి. చేసే పనులను ఎల్లప్పుడూ సరైన విధంగానే చేయాలి. దగ్గరి దారులు, అడ్డ దారులు, దొంగ దారుల ద్వారా వెళ్లొద్దు.
కష్టమైనా సరే సరైన మార్గంలోనే పయనించాలి. నన్ను ఎవరూ చూడటం లేదు కదా! నేను చేస్తుందే కరెక్టు.. అని భావిస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మీరు చేస్తున్న పనులను ఎవరూ చూడటం లేదని అనుకోవద్దు. ఒకరు మాత్రం కచ్చితంగా చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అదెవరో కాదు.. మీరే. ఇతరులు చూస్తున్నప్పుడు మీరెలా ప్రవర్తిస్తున్నారు అని కాకుండా.. ఎవరూ చూడనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టే మీ శీలాన్ని (క్యారెక్టర్) నిర్ణయించవచ్చు. ఎవరూ కనిపెట్టలేరు లే! అనే ఆలోచనతో విగ్రహాన్ని చెక్కుతుంటే.. అందులో చాలా తప్పులు దొర్లుతాయి.
ఆ పనిలో లోపాలుంటాయి. చివరకు వాటిని సరిచేసేందుకు ఎక్కువ సమయం, శ్రమను వెచ్చించాల్సి వస్తుంది. మంచి శిల్పకారుడిగా మారాల్సిన మీరు కేవలం ప్యాచ్-అప్ ఆర్టిస్టుగా మిగిలిపోతారు. ఆశించిన ఎదుగుదల లేక జీవితం నిస్సారంగా మారిపోతుంది. మనిషి ప్రగతికి అతడిలోని స్కిల్ కాదు, ఆలోచనా దృక్పథమే ప్రధానం. శిల్పకారుడి దృక్పథాన్ని అలవర్చుకోవాలి. పనిలో పరిపూర్ణత సాధించాలి. లైఫ్‌ను ఒక మాస్టర్‌పీస్‌గా మార్చుకోవాలి.
-‘కెరీర్స్ 360’ సౌజన్యంతో...