చీమ శ్రమైక జీవనంలో.. విలువైన పాఠాలెన్నో!
మనం జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవసరమైన పాఠాలను వివిధ వ్యక్తుల నుంచి నేర్చుకుంటాం. వీరే కాకుండా మన చుట్టూ ఉండే చిరుప్రాణులు సైతం ఎంతో విలువైన విషయాలను మనకు నేర్పుతాయి. మనలో తెలివితేటలు, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కానీ.. చిన్న జీవుల నుంచే పెద్ద పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు.. సుఖవంతమైన జీవనం గడపాలంటే.. ఏం చేయాలో చీమలను చూసి నేర్చుకోవచ్చంటే మీరు నమ్ముతారా? నమ్మితే నాలుగు విలువైన పాఠాలేంటో చూద్దాం..
పట్టిన పట్టు విడవొద్దు
తాము వెళ్తున్న దారిలో ఏదైనా అడ్డంకి ఎదురైతే చీమలు ఏం చేస్తాయో తెలుసా? చీమల మార్గంలో మీ వేలును అడ్డంగా పెట్టండి. ఏం జరుగుతుందో నిశ్శబ్దంగా గమనించండి. ఊహించని అవాంతరం ఎదురైందని చీమలు వెనక్కి వెళ్లవు. వేలు పక్కనుంచే కొత్తదారిని ఏర్పరచుకుంటాయి. అవసరమైతే వేలుపైకి ఎగబాకి ముందుకు కదులుతాయి. దారి దొరికేదాకా ప్రయత్నిస్తూనే ఉంటాయి. నిరాశ చెంది ప్రయత్నం నుంచి విరమించుకోవు. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం ఉంది. మన జీవితంలోనూ ఎన్నో ఊహించని అడ్డంకులు, నివారించలేని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. అంతమాత్రాన లక్ష్యాన్ని వదిలేసి వెనక్కి పారిపోవాల్సిన అవసరం లేదు. గమ్యం చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉండాలి. పట్టిన పట్టు విడవొద్దు(నెవర్ గివ్ అప్).. అంటూ బ్రిటీష్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ నుంచి వెలువడిన గొప్ప సూక్తికి స్ఫూర్తినిచ్చింది.. ఓ చిన్న చీమే.
మంచి కాలం శాశ్వతం కాదు
చీమల ఆహార సేకరణకు అత్యంత అనువైన కాలం.. వేసవి. వర్షాకాలం, శీతాకాలంలో భూఉపరితలంపై స్వేచ్ఛగా తిరగడం వీటికి వీలుకాదు. కాబట్టి సంవత్సరం మొత్తానికి సరిపడా ఆహారాన్ని వేసవిలోనే సేకరించుకొని, భద్రపరుచుకుంటాయి. ఈ కాలంలో ఆహార సేకరణలో తీరిక లేకుండా ఉంటాయి. మంచి కాలం(వేసవి) శాశ్వతం కాదని, శీతాకాలం రాక తప్పదని చీమలకు బాగా తెలుసు. అందుకే అవసరమైన తిండిని ఇప్పుడే సంపాదించుకుంటాయి. ప్రతికూల కాలంలో హాయిగా కడుపు నింపుకుంటాయి. మనం అప్రమత్తంగా ఉండాల్సింది ఇక్కడే. మన టైమ్ బాగున్నప్పుడు అదే మత్తులో ఏమరుపాటుగా ఉండొద్దు. ఎప్పుడూ మనకు మంచే జరుగుతుందనుకోవడం తెలివైన లక్షణం కాదు. విపత్కర పరిస్థితులు ఎదురుకాబోవని భావిస్తూ ధీమాగా తిరగడం సరికాదు. మీ చుట్టూ ఉండేవారితో మంచి సంబంధాలు ఏర్పరచుకోండి. వారితో మంచిగా ఉండండి. మంచి స్నేహితులను సంపాదించుకోండి. మంచి కాలం ఎప్పటికీ ఉండకపోవచ్చు. కానీ, మంచి మనుషులు మనతోనే ఉంటారు.
చెడు కాలమూ ఇలాగే ఉండదు
శీతాకాలంలో భరించలేనంత చలితో ఇబ్బందిపడే చీమలకు వెచ్చటి వేసవికాలందగ్గర్లోనే ఉందని తెలుసు. వేసవిలో తొలి సూర్యకిరణాలు భూమిపై ప్రసరించగానే.. చీమలు తమ నెలవుల్లోంచి వెలుపలికి వస్తాయి. కార్యాచరణను యథావిధిగా ప్రారంభిస్తాయి. ఆహారాన్వేషణకు బయలుదేరుతాయి. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు.. మనుషులు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతారు. తమ బతుకింతే అని చింతిస్తూ కూర్చుంటారు. ఇలాంటి సమయాల్లో చీమల సిద్ధాంతాన్ని గుర్తుకు తెచ్చుకోవడం మంచిది. పరిస్థితులెప్పటికీ ఇలాగే ఉండబోవని, మనదైన మంచికాలం దగ్గర్లోనే ఉందని తెలుసుకోవాలి. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం చాలా అవసరం. అంతా మంచే జరగబోతోందనే ఆశావాదాన్ని మనసులో నింపుకోవాలి. చెడు కాలం శాశ్వతం కాదన్న సత్యాన్ని స్మరించుకోవాలి.
శక్తివంచన లేకుండా శ్రమించాలి
చీమ తనకు చేతనైనంత తిండిని సేకరించుకుంటుంది. తన సాటి చీమ ఎంత తిండిని సంపాదించుకుంటోందనే విషయాన్ని మరో చీమ పట్టించుకోదు. తన కంటే ఎక్కువ సంపాదించుకున్న చీమలను చూసి అసూయ చెందదు. వాటిపై ద్వేషాన్ని పెంచుకోదు. ఒకవేళ తన దగ్గర వాటి కంటే తక్కువ ఆహారం ఉంటే చింతిస్తూ కూర్చొదు. తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. శక్తివంచన లేకుండా శ్రమించి, తనకు చేతనైనంత తిండిని సమకూర్చుకుంటుంది. ఇదొక గొప్ప పాఠం. మీరు చేయగలిగేంత శ్రమను 100 శాతం చేస్తే.. మీకు విజయం, సంతోషం బహుమతులుగా లభిస్తాయి. ఇక్కడితో అంతా ముగిసిపోలేదు.. చీమల నుంచి నేర్చుకోవాల్సిన మరో పాఠం మిగిలే ఉంది. ఒక చీమ తన బరువు కంటే 20 రెట్ల ఎక్కువ బరువును సులువుగా మోస్తుంది. ఈ విషయంలో చీమ శక్తి కంటే మన శక్తి తక్కువేం కాదు. మనం ఊహించుకొని భయపడుతున్న వాటి కంటే ఎన్నో రెట్ల ఎక్కువ బరువు బాధ్యతలను మన భుజాలపై తేలిగ్గా మోయవచ్చు. ఈసారి మోయలేనంత బరువులు మీ భుజాలపైకి చేరినప్పుడు.. కుంగిపోకండి. చిన్న చీమను గుర్తుకుతెచ్చుకోండి! ఆ బరువుబాధ్యతలు మిమ్మ ల్ని బాధించవు!!
-కెరీర్స్ 360 సౌజన్యంతో