‘మోటార్‌స్పోర్ట్’కు హైదరాబాద్ నుంచి ఏడుగురు
సాక్షి, హైదరాబాద్: అత్యంత ధైర్యసాహసాలతో మిళితమైన క్రీడ మోటార్‌స్పోర్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ‘ఆర్ఎఫ్సీ ఇండియా–2018 అంతర్జాతీయ ఆఫ్‌రోడ్ మోటార్‌స్పోర్ట్’లో భాగ్యనగరానికి చెందిన ఏడు జట్లు పాల్గొననున్నాయి. ఈ పోటీల్లో నగరానికి చెందిన ఎన్. అభినవ్ రెడ్డి, చల్లా చైతన్య, వంగల క్రాంతి కుమార్, రాజశేఖర ప్రభు, వెంకట్ దేవినేని, టి. సంతోష్‌గౌడ్, వి. సుఖేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
గోవా వేదికగా ఈనెల 21 నుంచి 28 వరకు జరిగే ఈ పోటీల్లో 41 జట్లు తలపడుతున్నాయి. ఈ రేసులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 26 స్టేజ్‌లను అందరికన్నా ముందుగా పూర్తిచేసిన వారికి ప్రైజ్‌మనీగా 10వేల అమెరికా డాలర్లు (రూ. 68.54 లక్షలు) అందుతాయి. దీనితో పాటు ఈ ఏడాది చివర్లో మలేసియాలో జరిగే ఆర్ఎఫ్సీ మోటార్ ఈవెంట్‌కు అర్హత సాధిస్తారు.