ఆర్మీ చీఫ్‌కు మద్దతుగా 'రాజకీయ' పోస్టర్లు
కరాచి: సైనిక తిరుబాట్లు సహజంగా చోటుచేసుకునే పాకిస్థాన్ లో చరిత్ర రిపీట్ అవుతుందా? ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ తిరుగుబాటుకు నేతృత్వం వహించి దేశపాలనను చేతుల్లోకి తీసుకుంటారా? అనే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం చెప్పలేం కానీ అక్కడి పరిస్థితులు ఈ ఊహగానాలను సమర్థించేలా ఉన్నాయి.
మరో ఏడాదిలో ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ కాబోతున్న రహీల్ ను పొగుడుతూ 'మూవ్ ఆన్ పాకిస్థాన్' పార్టీ దేశంలోని పలు నగరాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటుచేసింది. రహీల్ ఫొటోలతోపాటు 'ఇతరులు వద్దు.. స్వచ్ఛమైన పాకిస్థానీయే కావాలి' అని ఉర్దూలో రాసి ఉన్న పోస్టర్లు కరాచి తోపాటు పలు నగరాల్లో దర్శనమిచ్చాయి. సోమవారం అక్కడి వార్తా సంస్థలన్నీ దీనిపై వార్తలు రాశాయి. గతంలోనూ ఇలాంటి పోస్టర్లు ఏర్పాటుచేసినప్పుడు 'మూవ్ ఆన్ పాకిస్థాన్' పార్టీ అధ్యక్షుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు కూడా ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశంఉంది. అయితే ప్రోద్బలంతోనే ఆ పార్టీ ఇలాంటి చర్చలకు పాల్పడుతుందని సమాచారం.
మరో సైనిక తిరుగుబాటు!
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం లక్షిత దాడుల(సర్జికల్ స్ట్రైక్స్) అనంతరం ఏదోఒక ప్రతీకార చర్యకు పాల్పడాలని అక్కడి రాజకీయ నాయకత్వం లోలోపల ఆశిస్తోంది. అయితే సైన్యాధ్యక్షుడు జనరల్ రహీల్ మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా(భారత్ కు నష్టం చేసే దిశగా) ఎలాంటి తొందరపాటును ప్రదర్శించలేదు. భారత్ తో నిత్యం జగడాలాడేకంటే స్వదేశాన్ని నాశనం చేస్తోన్న తాలిబన్ ఉగ్రవాదులను అణిచివేయడానికే పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ ప్రాధాన్యం ఇచ్చారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఆర్మీకి శిక్షణ ఇప్పించారు. జవాన్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు విస్తృతంగా పర్యటించారు. తద్వారా సైనికుల అభిమానాన్ని చురగొన్నారు.
ఇండియన్ ఆర్మీ సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ లో ఉద్రిక్తతలు పెరగకుండా.. లష్కరే తాయిబా, జైష్ ఎ మొహమ్మద్ లాంటి ఉగ్రసంస్థల అధినేతలను సున్నితంగా కట్టడిచేయగలిగారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ సైన్యం రక్షణ కల్పిస్తోందని ప్రపంచదేశాలు అంటున్నా.. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కనీసం ఆ ఉగ్రనాయకులను కొన్నాళ్లు మాట్లాడనీయకుండా ఉంచడగలడంలో రహీల్ చాకచక్యంగా వ్యవహరించారని కొందరి వాదన. ఒకవేళ సైనిక తిరుగుబాటు జరిగి రహీల్ పరిపాలన పగ్గాలు చేపడితే బలూచీలు కూడా ఆయనకు మద్దతు పలికే అవకాశం ఉంది. రహీల్ జన్మస్థలం కూడా బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాయే కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇటు సైన్యం మద్దతు, అటు ప్రజల మద్దతు ఉన్న ఆయనకు రాజకీయ పక్షాలు కూడా సహకరిస్తాయని కొందరి అభిప్రాయం.