2.20 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు లక్ష్యం
ఏలూరు (మెట్రో): జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే ఏడాది మార్చినాటికి 2.2 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంపీడీవోలు కష్టపడి పనిచేయాలని కలెక్టర్ కె.భాస్కర్ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ఎంపీడీవోల సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యక్రమాల ప్రగతి తీరుపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఉపాధి కూలీలకు ఇస్తున్న సొమ్ముల కంటే సిబ్బందికి ఇచ్చే వేతనాలు పదిరెట్లకు పైగా ఉంటున్నాయని, అలాంటి స్థితిలో అక్కడ ఉపాధి హామీ యూనిట్లు ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు.
ఆత్మవిమర్శ చేసుకోండి
ఈనెల 13న ఆకివీడు మండలంలో ఐదుగురు కూలీలకు కల్పిస్తే ఆచంటలో 21, గణపవరంలో 28, కొయ్యలగూడెంలో 12, జీలుగుమిల్లిలో 43, చాగల్లులో 90, తణుకులో 82, ఉండి, భీమవరంలో ఒక్కరికీ పని కల్పించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయా మండలాల్లో ఉపాధి హామీ పథకం యూనిట్లు రద్దు చేసి పనికావాలని వచ్చే కార్మికులకు రూ.100 చొప్పున ఇవ్వడమే మేలని అభిప్రాయపడ్డారు. జిల్లాలో 2.20 కోట్ల పనిదినాలు కల్పించాలని నిర్దేశించామనీ దీనివల్ల మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా అత్యధిక నిధులు జిల్లాకు రాబట్టగలుగుతామన్నారు. ప్రతి ఉద్యోగి ఆత్మ విమర్శ చేసుకుని పనిచేయాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. డ్వామా పీడీ వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరాజు పాల్గొన్నారు.
ఐదు అంశాల్లో ఎందుకు వెనుకబాటు
155 అంశాలతో రాష్ట్రానికే ఆదర్శంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఐదు అంశాల్లో మాత్రమే ఎందుకు వెనుకబాటులో ఉందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మంగళవారం ఆయన విజయవాడ నుంచి కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో 160 అంశాల ప్రగతి తీరుపై రేటింగ్ ఇస్తున్నామని, పశ్చిమగోదావరి జిల్లా భూగర్భజలాలు, ఫామ్ పాండ్స్, అంగన్వాడీ భవనాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, ఉపాధి హామీ కార్మికులకు వేతనాల చెల్లింపు అంశాల్లో 12, 13 స్థానాల్లో ఉందని చెప్పారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేయని సిబ్బంది, అధికారులను గుర్తించి వారిలో మార్పునకు ప్రయత్నిస్తున్నామని, ఈ నెల నుంచి పనితీరు ఆధారంగా ఉద్యోగులకు రేటింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఐదు అంశాల్లో పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రగతి తీరులో ప్రతిభ చూపని వారిపై చర్యలు తీసుకుని అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో ఉండేలా చేస్తామన్నారు.