హమాలీ పోస్టులకు 984 మంది గ్రాడ్యుయేట్లు!
ముంబై: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎమ్ పీఎస్సీ) తాజా విడుదల చేసిన హమాలీ పోస్టులకు 984 మంది గ్రాడ్యుయేట్లు, ఐదుగురు ఎంఫిల్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు సోమవారం ఓ అధికారి తెలిపారు. మొత్తం ఐదు హమాలీ పోస్టులకు గత ఏడాది డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థుల కనీస విద్యార్హత నాల్గవ తరగతిగా పేర్కొన్నట్లు వివరించారు.
మొత్తం 2,424 మంది అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో 5 గురు ఎం.ఫిల్ డిగ్రీ, 253మంది పీజీ, 109 మంది డిప్లొమా, 9 మంది పీజీ డిప్లొమా, 984 మంది డిగ్రీ, 605 మంది ఇంటర్, 282 మంది టెన్త్, 177 మంది టెన్త్ కు దిగువ తరగతులను తమ విద్యార్హతగా పేర్కొన్నట్లు తెలిపారు. వీరందరికి వచ్చే ఆగష్టులో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షలో అభ్యర్థులకు భాషపై పట్టు, బేసిక్ మ్యాథమెటిక్ స్కిల్ పై ప్రశ్నలుంటాయని తెలిపారు.