mptc votes
-
206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన పోలింగ్ జరిగిన నాటి నుంచి గత ఐదున్నర నెలలుగా బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచిన చోట కౌంటింగ్ నిర్వహించేందుకు కలెక్టర్ల నేతృత్వంలో అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఒక్కొక్క కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థులందరికీ కౌంటింగ్ కేంద్రాల వివరాలతో రిటర్నింగ్ అధికారులు శుక్రవారం సమాచారం అందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెద్ద ఎత్తున బ్యాలెట్ పత్రాలను లెక్కించాల్సి రావడం, రాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నందున జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్లోకి బ్యాలెట్ బాక్సులను తరలించే సమయంలో సీసీటీవీ కవరేజ్ చేయనున్నారు. ఏకకాలంలో రెండింటి లెక్కింపు.. ఒక్కో మండలానికి సంబంధించి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరిగే చోటే జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. ఏకకాలంలో రెండింటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సగం టేబుళ్లలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, మరో సగం టేబుళ్లలో జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. ఎంపీటీసీ పరిధిలోని ఓట్లన్నింటినీ ఒక డ్రమ్‌లో, మండలంలోని మొత్తం జడ్పీటీసీ ఓట్లన్నింటినీ మరో డ్రమ్‌లో వేసి కలగలపి తర్వాత 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. ఆ తర్వాత జడ్పీటీసీ ఓట్లను వెయ్యి చొప్పున ఒక్కో టేబుల్‌కు పంపిణీ చేసి లెక్కిస్తారు. ఎంపీటీసీ స్థానాల వారీగా అక్కడి ఓట్లన్నింటినీ ఒకే టేబుల్‌పై ఒకేవిడతలో లెక్కిస్తారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక్కో ఏజెంట్ చొప్పున నియమించుకునేందుకు అభ్యర్థులను అనుమతించారు. లెక్కింపులో 42,360 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో మొత్తం 42,360 మంది సిబ్బంది పాల్గొంటారు. 11,227 మంది కౌంటింగ్ సూపర్వైజర్లుగా, 31,133 మంది కౌంటింగ్ అసిస్టెంట్లుగా వ్యవహరిస్తారు. వీరు కాకుండా 89 మందిని అదనపు అబ్జర్వర్లుగా ఆయా జిల్లా కలెక్టర్లు నియమించారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి తరువాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు చేపడతారు. బ్యాలెట్ పేపరు రంగు ఆధారంగా రెండు రకాల ఓట్లను వర్గీకరిస్తారు. కౌంటింగ్ సమయంలో సిబ్బంది సందేహాల నివృత్తి కోసం కమాండ్ కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యంతరాలు వ్యక్తమయ్యే చోట ఒక్కసారి మాత్రమే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారు. మరోవైపు కౌంటింగ్ పర్యవేక్షణ కోసం జిల్లాకో ఐఏఎస్ అధికారిని పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి: సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తయ్యేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా టీకాలు తీసుకుని ఉండాలని స్పష్టం చేశారు. ఆయా కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించి గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 24 గంటలు కంట్రోల్ రూం: ద్వివేది కౌంటింగ్ అధికారుల సందేహాలను నివృత్తి చేసేందుకు 24 గంటలూ పని చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని శాంతి భద్రతల అదనపు డీజీపీ రవిశంకర్ చెప్పారు. కేంద్రాల వద్ద శానిటేషన్ చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్లకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా నిర్వహించాలి.
ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 13న నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా, రీకౌంటింగ్‌కు తావు లేకుండా నిర్వహించాలని మండలాల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జడ్పీ రిటర్నింగ్ అధికారి, డీపీఓ సురేశ్‌బాబు సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్వో,ఏఆర్వోలకు ఓట్ల లెక్కిం పుపై ప్రొజెక్టర్ ద్వారా శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ... మొత్తం 36 జడ్పీటీసీ , 583 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాలలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ డివిజన్లో ధర్మారం(బి) శివారులోని తిరుమల ఇనిస్టిట్యూట్, బోధన్ డివిజన్లో రాకాసిపేట్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కామారెడ్డి డివిజన్లో సదాశివనగర్ మండలం మర్కల్ విలేజ్‌లోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బ్యాలెట్ బాక్సులు భద్ర పరిచిన దగ్గరి ప్రాంతాల్లోనే కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటర్లు వేరు వేరుగా ఏర్పాటు చేసి ప్రతి కౌంటింగ్ రూంలో బల్లలు సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం ఒక అభ్యర్థి ఒకే ఏజెంట్‌ను నియమించుకోవాలని, ఒక టేబుల్‌పై ఒక్క ఏజెంట్‌ను మాత్రమే నియమించాలన్నారు. ఎలాంటి సమస్యలకు తావులేకుండా సమయానికి ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభం కావాలన్నారు. అలాగే ప్రతి కౌంటర్‌కు ఒక సూపర్వైజర్, ముగ్గురు అసిస్టెంట్లను నియమిస్తున్నామన్నారు. అధికంగా ఓట్లు ఉంటే అదనంగా మరో ఇద్దరు అసిస్టెంట్లను కూడా ఇస్తామన్నారు. అయితే ప్రతి ఒక్క ఓటును క్షుణ్ణంగా లెక్కించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా రౌండ్ల వారీగా వివరాలను మీకిచ్చిన షీట్లలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి వరకు కౌంటింగ్ చేయకూడదని, రీ కౌంటింగ్ కాకుండా అన్నీ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సెల్ఫోన్లకు అనుమతిలేదు ఏజెంట్‌గా వ్యవహరించే వారు ఒక్క సారి కౌటింగ్ కేంద్రంలోకి వస్తే మళ్లీ బయటకు వెళ్లాలంటే ఆర్వో అనుమతి తీసుకోవాలన్నారు. ఒక్క ఆర్వోకు తప్ప కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు, ఎవరిని కూడా సెల్ ఫోన్లతో లోనికి అనుమతిబోమని స్పష్టం చేశారు. నీళ్లు, చాయ్ లాంటివి కూడా లోనికి అనుమ తి ఉండదనే విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. గెలిచిన అభ్యర్థుల వివరాలు, వారు ఎన్ని ఓట్లతో గెలుపొందిన వివరాలు కూడా కచ్చితంగా నోట్ చేసుకొని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. ఇక్కడి శిక్షణలో విన్న సూచనలు, నిబంధనలను బుధవారం అభ్యర్థులతో మండల కార్యాలయాల్లో సమావేశం ఏర్పాటుచేసి, తెలియజేయాలని ఆర్వో, ఏఆర్వోలకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రాజారాం, డ్వామా పీడీ శివలింగయ్య పాల్గొన్నారు.