MPTC-ZPTC elections
-
మూడు లక్షలు మింగేసిన ఎంపీడీవో!
ఎంపీటీసీ అభ్యర్థుల డిపాజిట్టు, సిబ్బందికి ఇవ్వాల్సిన నగదు స్వాహా కార్యాలయంలోని టీవీ మాయం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రస్తుతం ఎంపీడీవో పలమనేరు: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ఎంపీడీవో మూడు లక్షలు మింగేసిన సంగతి సోమవారం వెలుగులోకొచ్చింది. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఎంపీడీవో జయసింహ ఎన్నికల విధుల కోసం పలమనేరు ఎంపీడీవోగా మార్చి 4వ తేది ఇక్కడికొచ్చారు. అప్పట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఈయన ఆధ్వర్యంలో మొదలైంది. అనంతరం ఎన్నికలు పూర్తయ్యాక బదిలీల్లో భాగంగా మే 28న తిరిగి సొంత జిల్లాకు వెళ్లారు. ఆయన విధులు నిర్వహించిన సందర్భంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆయన తర్వాత బాధ్యతలు నిర్వహించిన ఎంపీడీవో మంజుల గుర్తించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ రుసుం సుమారు రూ.60వేలను ఆయన తస్కరించినట్లు బయటపడింది. ఎంపీడీవో గదిలోని రూ.10వేలకు పైగా విలువజేసే ఓ టీవీ మాయమైంది. ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి అందాల్సిన రూ.2.60 లక్షల డబ్బును కూడా తీసుకెళ్లినట్లు గుర్తించారు. మొత్తం మీద రూ.3 లక్షలకు పైగా ఈయన స్వాహా చేసినట్లు తేలింది. ఆమేరకు ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ఎంపీడీవోగా ఉన్న విద్యాసాగర్‌ను విచారణకు ఆదేశించారు. ఆమేరకు విద్యాసాగర్ పూర్తిస్థాయి నివేదికను జిల్లా కలెక్టర్‌తో పాటు జెడ్పీ సీఈవోలకు ఈ మధ్యనే అందజేసినట్లు తెలిసింది. ఈ విషయమై ప్రస్తుత ఎంపీడీవో విద్యాసాగర్‌ను వివరణ కోరగా ఎన్నికల విధులకు ఇక్కడికొచ్చిన జయసింహ అక్రమాలకు పాల్పడిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై తాము ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామన్నారు. -
జెడ్పీలో ‘కమీషన్’ దందా!
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ‘మీరేదైనా చేసుకోండి.. ఎలాగైనా బిల్లులు పెట్టండి.. మేం చూసుకుంటాం.. మాకు మాత్రం మీ మండలం నుంచి 30 వేల రూపాయలివ్వాల్సిందే..’- ఇదీ జెడ్పీకి చెందిన ఇద్దరు కీలక అధికారులు మండల అభివృద్ధి అధికారులకు జారీ చేసిన హుకుం. దాదాపు 15 రోజుల నుంచి జెడ్పీ వేదికగా ఈ కమీషన్ దందా నడుస్తోంది. ఇద్దరు అధికారుల తీరుపై ఎంపీడీవోలు మండిపడుతున్నారు. కానీ ఏమీ చేయలేక లబోదిబోమంటున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో 649 ఎంపీటీసీలు, 37 జెడ్పీటీసీ స్థానాలకు గత నెల 6, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణ ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం మండలాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిం ది. వీటిని జిల్లా పరిషత్ అధికారులు మండలాలు, పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించారు. ఈ నిధులను ఎంపీడీవోలు, సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సంయుక్తంగా డ్రా చేసి వినియోగించాల్సి ఉంటుంది. అయితే చాలా మండలాల్లో వీటి వినియోగంపై తేడాలు వచ్చాయి. కొన్నిచోట్ల వివాదాలు కూడా తలెత్తాయి. కాగా నిధుల వినియోగ బిల్లులను ఆమోదింపజేయించుకోవాల్సిన బాధ్యత మాత్రం ఎంపీడీవోలదే. నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలిటీ సర్టిఫికెట్లు, బిల్లులు సమర్పిస్తే జిల్లా పరిషత్ అధికారులు పరిశీలించి నిధులు విడుదల చేస్తారు. ఈ పరిస్థితిని సాకుగా తీసుకుని జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు రంగంలోకి దిగారు. కమీషన్ దందాకు తెర తీశారు. మండలానికి 30 వేల రూపాయల చొప్పున ఇస్తేనే బిల్లులన్నీ పాసవుతాయని, లేదంటే ఇబ్బందులు తప్పవని ఎంపీడీవోలకు స్పష్టం చేశారు. ‘బిగ్‌బాస్’గా ఉన్న అధికారి అండదండలు ఉండడంతో వీరు బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. దీంతో ఎంపీడీవోలు తలపట్టుకుంటున్నారు. వాస్తవానికి ఎన్నికల నిర్వహణకు కేటాయించిన నిధుల కన్నా ఇంకా ఎక్కువే ఖర్చయిందని, దీనిని ఎలా సర్దుబాటు చేసుకోవాలా? అని తాము యోచిస్తుంటే కొత్తగా ఈ సమస్య వచ్చిందని ఎంపీడీవోలు వాపోతున్నారు. ఇద్దరు అధికారుల హెచ్చరికతో భయపడిన కొందరు ఎంపీడీవోలు ఇప్పటికే సొమ్ము చదివించుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయిస్తే అసలు విషయం బయటపడుతుందని మండల పరిషత్‌ల సిబ్బంది అంటున్నారు. -
త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
హైదరాబాద్: త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని మంత్రి జానారెడ్డి తెలిపారు. ఏకగ్రీవమైన చిన్న పంచాయతీలకు రూ. ఏడు లక్షల ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే మేజర్ పంచాయతీలకు రూ.20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన జానారెడ్డి .. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గురించి గళం విప్పారు. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని పంచాయతీలు వినియోగించుకోవాలని జానా అన్నారు. కేసీఆర్‌పై హత్యాయత్నం చేస్తున్నారనే సమాచారం ఏదీ తనకు అందలేదని తెలిపారు. రాష్ర్ట విభజనకు సంబంధించి గతంలోనే ఆయన స్పందించిన విషయం తెలిసిందే. అభివృద్ధి కుంటుపడకముందే, పరిస్థితి చేయిజారకముందే, అవాంఛనీయ పరిణామాలు తలెత్తకముందే అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు ఆయన తెలిపారు. సమస్యను సామరస్యంగా పరిష్కారించుకుందామని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. రెండు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు.