జెడ్పీలో ‘కమీషన్’ దందా! | fraud in the ZP office | Sakshi
Sakshi News home page

జెడ్పీలో ‘కమీషన్’ దందా!

Published Fri, May 23 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

జెడ్పీలో ‘కమీషన్’ దందా!

జెడ్పీలో ‘కమీషన్’ దందా!

‘మీరేదైనా చేసుకోండి.. ఎలాగైనా బిల్లులు పెట్టండి.. మేం చూసుకుంటాం.. మాకు మాత్రం మీ మండలం నుంచి 30 వేల రూపాయలివ్వాల్సిందే..’- ఇదీ జెడ్పీకి చెందిన ఇద్దరు కీలక అధికారులు మండల అభివృద్ధి అధికారులకు జారీ చేసిన హుకుం.

 శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ‘మీరేదైనా చేసుకోండి.. ఎలాగైనా బిల్లులు పెట్టండి.. మేం చూసుకుంటాం.. మాకు మాత్రం మీ మండలం నుంచి 30 వేల రూపాయలివ్వాల్సిందే..’- ఇదీ జెడ్పీకి చెందిన ఇద్దరు కీలక అధికారులు మండల అభివృద్ధి అధికారులకు జారీ చేసిన హుకుం. దాదాపు 15 రోజుల నుంచి జెడ్పీ వేదికగా ఈ కమీషన్ దందా నడుస్తోంది. ఇద్దరు అధికారుల తీరుపై ఎంపీడీవోలు మండిపడుతున్నారు. కానీ ఏమీ చేయలేక లబోదిబోమంటున్నారు.
 
జిల్లాలోని 38 మండలాల్లో 649 ఎంపీటీసీలు, 37 జెడ్పీటీసీ స్థానాలకు గత నెల 6, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణ ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం మండలాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిం ది. వీటిని జిల్లా పరిషత్ అధికారులు మండలాలు, పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించారు. ఈ నిధులను ఎంపీడీవోలు, సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సంయుక్తంగా డ్రా చేసి వినియోగించాల్సి ఉంటుంది. అయితే చాలా మండలాల్లో వీటి వినియోగంపై తేడాలు వచ్చాయి.
 
కొన్నిచోట్ల వివాదాలు కూడా తలెత్తాయి. కాగా నిధుల వినియోగ బిల్లులను ఆమోదింపజేయించుకోవాల్సిన బాధ్యత మాత్రం ఎంపీడీవోలదే. నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలిటీ సర్టిఫికెట్లు, బిల్లులు సమర్పిస్తే జిల్లా పరిషత్ అధికారులు పరిశీలించి నిధులు విడుదల చేస్తారు. ఈ పరిస్థితిని సాకుగా తీసుకుని జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు రంగంలోకి దిగారు. కమీషన్ దందాకు తెర తీశారు. మండలానికి 30 వేల రూపాయల చొప్పున ఇస్తేనే బిల్లులన్నీ పాసవుతాయని, లేదంటే ఇబ్బందులు తప్పవని ఎంపీడీవోలకు స్పష్టం చేశారు. ‘బిగ్‌బాస్’గా ఉన్న అధికారి అండదండలు ఉండడంతో వీరు బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. దీంతో ఎంపీడీవోలు తలపట్టుకుంటున్నారు.
 
వాస్తవానికి ఎన్నికల నిర్వహణకు కేటాయించిన నిధుల కన్నా ఇంకా ఎక్కువే ఖర్చయిందని, దీనిని ఎలా సర్దుబాటు చేసుకోవాలా? అని తాము యోచిస్తుంటే కొత్తగా ఈ సమస్య వచ్చిందని ఎంపీడీవోలు వాపోతున్నారు. ఇద్దరు అధికారుల హెచ్చరికతో భయపడిన కొందరు ఎంపీడీవోలు ఇప్పటికే సొమ్ము చదివించుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయిస్తే అసలు విషయం బయటపడుతుందని మండల పరిషత్‌ల సిబ్బంది అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement