భద్రాచలం ఈఓ బదిలీ
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం దేవాలయం కార్యనిర్వహణాధికారి రఘునాథ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. స్వామివారిని రామనారాయణుడు అంటూ అర్చకులు సంబోధించటం చినికిచినికి తీవ్ర వివాదంగా మారి ఆలయ ఈఓ ఎం.రఘునాథ్‌కు సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. దాదాపు పక్షం రోజులుగా ఆలయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈఓ తమను వేధిస్తున్నాడని, ఆయనను వెంటనే బదిలీ చేయాలంటూ అర్చకులు, సిబ్బంది ధర్నాలకు దిగారు. మరోవైపు స్వామివారిని రామనారాయణుడు అనటాన్ని అంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు స్వామీజీలు, భక్తులు తప్పుపడుతూ ఆలయ అర్చకులతో గొడవకు దిగారు. తుదకు ఆ వివాదం పోలీసు స్టేషన్‌కు చేరింది. స్వామివారి ఉచ్ఛారణ విషయంలో అభిప్రాయం తేల్చేందుకు దేవాదాయ శాఖ ఇప్పటికే ఓ ధార్మిక కమిటీని కూడా నియమించింది. తనను దేవాలయం బాధ్యతల నుంచి తప్పించాలని మరోవైపు ఈఓ కూడా దేవాదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో వివాదం మరింత ముదరకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈఓ రఘునాథ్‌ను బదిలీ చేసి వరంగల్ డిప్యూటీ కమిషనర్ రమేశ్‌బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వు జారీ చేసింది.