ఉన్నత విద్యకు గ్రహణం పట్టిస్తారా?!
సందర్భం
అరవైయ్యేళ్లుగా విద్యాసంస్థలన్నిటినీ హైదరాబాద్లోనే స్థాపించి ఇతర ప్రాంతాలకు అన్యాయం చేసిన పాలకులు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే తప్పు చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
పరిశేష ఆంధ్రప్రదేశ్లో ఉన్న త విద్యా సంస్థలను నెలకొల్పు తామని, విద్యారంగం అభివృద్ధికి దోహదపడతామని ఇచ్చిన హామీ ఆచరణలో నిరర్ధక చర్యగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. కొత్త రాష్ట్రంలో మొత్తం 11 జాతీయ విద్యాసంస్థలు స్థాపించాలని విభజన చట్టం నిర్దేశించిం ది. ఇందులో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), ఐఐఎస్ఈ ఆర్(ఇండియ న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), సెంట్రల్ యూనివర్సిటీ లాంటివి ఉన్నాయి. విభజన నిర్ణయమే అనాలోచితంగా చేశారనుకుంటే ఆ విభజన అనంతర నిర్ణయాలు సైతం లోపభూయిష్టంగా ఉండ టం విచారకరం. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్లను తమిళ నాడు సరిహద్దుల్లో తిరుపతి పరిసరాల్లోనూ, సెంట్రల్ వర్సిటీని కర్ణాటక సరిహద్దున ఉన్న అనంతపురంలోనూ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందు వల్ల ప్రధానంగా బాగుపడేది తమిళనాడు, కర్ణాటక విద్యార్థులు మాత్రమే.
నూతన రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు న్నాయి. అరవైయ్యేళ్లుగా విద్యాసంస్థలన్నిటినీ హైదరా బాద్లోనే స్థాపించి ఇతర ప్రాంతాలకు అన్యాయం చేసిన పాలకులు కొత్త రాష్ట్రంలో కూడా అదే తప్పు చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. పొరుగు రాష్ట్రాల సేవలో తరించి రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలకు గండి కొడుతున్నారు. వాస్తవానికి శ్రీకాకుళంలో ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థనూ, విజయనగరంలో గిరిజన విశ్వ విద్యాలయాన్నీ, విశాఖలో ఐఐఎంనూ, ప్రకాశంలో మైన్స్ విశ్వవిద్యాలయాన్నీ, నెల్లూరులో మెరైన్ ఇనిస్టిట్యూట్నూ, కర్నూలులో ట్రిపుల్ ఐటీనీ, తూర్పు గోదావరిలో పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని, పశ్చిమ గోదావరిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ని, గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాల యం, ఎయిమ్స్ స్థాపించాలన్న ఆలోచనతో స్థల సేక రణ, తాత్కాలిక భవనాల ఏర్పాటులాంటివి దాదాపు పూర్తిచేశారు. విశాఖ ఐఐఎం, తిరుపతి పరిసర ప్రాంతా ల్లో నెలకొల్పదలుచుకున్న ఐఐటీ, ఐఐఎస్ఈఆర్లకు కేంద్ర మానవ వనరుల మంత్రి శంకుస్థాపనలు చేశారు.
చెన్నైలో 1959 నుంచీ నడుస్తున్న ఐఐటీ విద్యా ప్రమాణాలపరంగా, సౌకర్యాలపరంగా ఎంతో ప్రతిష్టా త్మకమైనది. దీనికి కూతవేటు దూరంలోని తిరుపతిలో మరో ఐఐటీ స్థాపించడంవల్ల మన విద్యార్థులకన్నా తమిళనాడు విద్యార్థులకే ప్రయోజనం చేకూరుతుంది. దేశంలోని వివిధ ఐఐటీల్లో మన రాష్ట్ర విద్యార్థులే అధిక సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంటున్నారు. ఇప్పటికే పుణ్యక్షేత్రంగా ఉండి నిత్యమూ లక్షలాదిమంది భక్తుల తో కిటకిటలాడే తిరుపతిలో మంచినీరు మొదలుకొని అన్నీ సమస్యలే. ఐఐటీ స్థాపిస్తే ఈ సమస్యలు మరిం తగా పెరుగుతాయి. పైగా అక్కడ వెంకటేశ్వర యూని వర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, సంస్కృత విశ్వ విద్యాలయం, స్విమ్స్లాంటివి ఉన్నాయి. అనుభవజ్ఞు లైన అధ్యాపకులు సకల సౌకర్యాలున్న చెన్నై ఐఐటీలో పనిచేయడానికి మొగ్గుచూపుతారు తప్ప సమస్యలతో సతమతమయ్యే తిరుపతికి రావడానికి ఇష్టపడరు. దీన్ని విజయవాడ-రాజమండ్రిల మధ్య ఎక్కడ స్థాపించినా రాష్ట్ర విద్యార్థులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక సెంట్రల్ యూనివర్సిటీ స్థాపనకు అనంతపురాన్ని ఎంచుకున్నారు. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలకన్నా సెంట్రల్ యూనివర్సిటీల్లోని విద్యార్థులకు సౌకర్యాలు ఎక్కువుంటాయి. పరిశోధక విద్యార్థులకు నెలకు రూ. 8,000 ఇస్తారు. అన్ని రాష్ట్రాల విద్యార్థినీ విద్యార్థులుం డటంవల్ల వివిధ భాషలు, సంస్కృతిపట్ల మంచి అవగా హన కలుగుతుంది. వీటిల్లో భాషా శాస్త్రాలు తప్ప మిగిలి నవన్నీ ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారు. అన్ని రకాల కోర్సులూ తక్కువ ఫీజులతో, ఉపకార వేతనాలతో, ఫెలోషిప్లతో అన్ని వర్గాల విద్యార్థులకూ అందుబాటులో ఉంటాయి.
ఇలాంటి ఉన్నత శ్రేణి విశ్వవిద్యాల యాన్ని పొరుగు రాష్ట్రానికి చేరువలో స్థాపించడం అవివే కం. అనాలోచితం. అనర్థదాయకం. రైలు, రోడ్డు సౌక ర్యాలు పుష్కలంగా ఉండి, ఇంతవరకూ ఎలాంటి యూ నివర్సిటీలేని ఒంగోలులో స్థాపించడం వల్ల దాదాపు అన్ని జిల్లాలవారికీ అనుకూలంగా ఉంటుంది. పైగా ప్రకాశం జిల్లా ఎన్నాళ్లనుంచో నిరాద రణకు గురవుతున్న జిల్లా. అన్నివిధాలా సౌకర్యవంతంగా ఉన్నా మన నేతల దృష్టిపడని జిల్లా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాక కూడా ఇదే వివక్ష కొనసాగడం అన్యాయం. కనీసం సకల సౌకర్యాలున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ యూనివర్సి టీగా మార్చినా విద్యార్థులకు ఉప యుక్తంగా ఉంటుంది. అలాగే మైనింగ్ యూనివర్సిటీ గనులు అధికంగా ఉండే అనంతపురంలో స్థాపించడం అన్నివిధాలా ప్రయోజన కరం. ఇప్పటికే కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూలున్న అనంతపురంలో సెంట్రల్ యూనివ ర్సిటీ స్థాపనను విరమించుకోవాలి.
గుంటూరు, విజయవాడల్లో ఇప్పటికే అనేక వైద్య కళాశాలలు, వైద్య విశ్వవిద్యాలయం, టీబీ శానిటోరి యం ఉన్నాయి. పైగా రాజధాని ఆ ప్రాంతంలోనే ఏర్పాటవుతున్నది. అందువల్ల ఎయిమ్స్ వంటి ఉన్నత శ్రేణి వైద్య శాస్త్రాల సంస్థను ఏలూరు-రాజమండ్రి మధ్య స్థాపిస్తే రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. మన నాయకులు భేషజాలకు పోకుండా తమ నిర్ణయా లను పునః సమీక్షించుకోవాలి. అన్ని ప్రాంతాల ప్రయో జనాలకూ అనుగుణంగా వాటిని ఏర్పాటుచేయాలి. లేన ట్టయితే ఆంధ్ర ప్రాంతంలోని విద్యార్థులు ఎప్పటిలాగే హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీనే ఆశ్రయించ వలసి ఉంటుంది. ఉన్నత విద్యారంగం విస్తృతికి ఇది ఏ రకంగానూ తోడ్పడదని నాయకులు గుర్తించాలి.
వ్యాసకర్త సోషల్ ఎవేర్నెస్ క్యాంపెయిన్ ప్రతినిధి
మొబైల్ : 9441048958