పేదలకు అందని ద్రాక్షగా ప్రభుత్వ విద్య
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల బిడ్డలకు ప్రభుత్వ విద్యను అందకుండా చేస్తోందని ప్రొఫెసర్ రామకృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని చైతన్య ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ చేస్తున్నారని విమర్శించారు. పేదోడికి ఒక విద్య, ధనికుడికి మరో విద్య అందుతుందన్నారు. శాస్త్రీయమైన విద్య, దేశవ్యాప్తంగా కామన్ విద్యా విధానం అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఎన్నికల ముందు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి ఏ ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. బంగారు తెలంగాణ అని చెప్తున్న కేసీఆర్ బాధల తెలంగాణగా మారుస్తున్నారన్నారు. విద్యను వ్యాపారం చేస్తూ అంగడి సరుకుగా మారుస్తున్న విద్యాలయాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్, సైదులు, నాయకులు ఆది, కృష్ణ, నర్సింహా, మహేష్, కురుమూర్తి, ఎల్లయ్య, అంజి, కవిత, సుజాత పాల్గొన్నారు.