mrc building construction
-
నిధులున్నాయ్.. నిర్మాణాలే సాగవు
సాక్షి, హైదరాబాద్: మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ) నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. భవనాలకు స్థలాలు, నిధులు విడుదల చేసినప్పటికీ వాటిని నిర్మించడంలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో నాలుగేళ్లుగా వాటి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సర్వశిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 96 మండలాలకు ఎంఆర్సీ భవనాలు మంజూరు చేసింది. ఒక్కో భవనాన్ని రూ.30 లక్షల వ్యయంతో నిర్మించాలని ఆదేశించింది. మండల వనరుల కేంద్రాల్లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మండల స్థాయి సమావేశాలు, విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో విద్యాశాఖకు కీలకంగా ఉపయోగపడనున్నాయని భావించిన ప్రభుత్వం 96 ఎంఆర్‌సీలను మంజూరు చేసింది. ఇందుకు రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలో టెండర్లు పిలిచిన అధికారులు కాంట్రాక్టర్లను ఎంపిక చేసి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇవి మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు పునాదులు దాటలేదు. ఎంఆర్సీ నిర్మాణాలను గరిష్టంగా ఏడాది లోపు నిర్మించాలి. ఈమేరకు కాంట్రాక్టర్లకు నిబంధనలు విధించాయి. కానీ కాంట్రాక్టర్లు నిర్మాణ బాధ్యతలు తీసుకుని ఏడాది దాటినా వాటిని పూర్తి చేయలేదు. నిబంధనలు పాటించని క్రమంలో కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. కొత్తవి జాడేలేదు... సర్వశిక్షా అభియాన్ స్థానంలో కొత్తగా సమగ్ర శిక్షా అభియాన్ ఏర్పాటైంది. ఈక్రమంలో గత రికార్డులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, వాటి పురోగతి ఆధారంగా కొత్త నిర్మాణాలను ఆమోదిస్తోంది. ఈక్రమంలో నాలుగేళ్లనాటి పనులే పూర్తికాకపోవడంతో రాష్ట్రానికి కొత్తగా ఎంఆర్‌సీలను మంజూరు చేయలేదు. వాస్తవానికి కొత్త మండలాలతో కలుపుకుని రాష్ట్రంలో దాదాపు 2వందల ఎంఆర్సీలు అవసరముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కొత్తవాటికి ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయలేదు. దీంతో ఇప్పటికే మంజూరైన వాటిని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించిన అధికారులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. -
నిబంధనలు బేఖతర్!
గుట్టుచప్పుడు కాకుండా ఎంఆర్సీ భవన నిర్మాణం అడ్డుకున్న జెడ్పీ ఫ్లోర్‌లీడర్, ఎంపీపీ నక్కపల్లి (పాయకరావుపేట): పాయకరావుపేట మండల పరిషత్‌కు చెందిన స్థలంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఎంఆర్సీ భవన నిర్మాణాన్ని జెడ్పీటీసీ, ఎంపీపీ నిలుపు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున భవన శ్లాబ్ వేసే ప్రయత్నాలను జెడ్పీటీసీ చిక్కాల రామారావు, ఎంపీపీ శివ అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ భవన నిర్మాణాన్ని అడ్డుకోవాలని సోమవారం జెడ్పీ ఫ్లోర్‌లీడర్, ఎంపీపీ అల్లాడ శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కాంట్రాక్టర్ ఏకపక్షంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. బుధవారం ఉగాది సందర్భంగా అధికారులు ఎవరూ లేని సమయాన్ని చూసి శ్లాబ్ వేసేందుకు చేసిన ప్రయత్నాలను జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు, ఎంపీ పీ శివకుమార్ అడ్డుకున్నారు. ఎంఆర్సీ భవనం నిర్మిస్తున్న స్థలం మండల పరిషత్‌కు చెందినదని, ఇక్కడ ఏదైనా భవనం నిర్మించాలంటే పాలకవర్గం అనుమతి తీసుకోవాల ని, ఎంఈవో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడంతో సర్వశిక్ష అభియాన్ వారు కాంట్రాక్టర్ ద్వారా పనులు చేపడుతున్నారని వీరు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు తక్షణమే నిలిపివేయాలన్నది పాలకవర్గ సభ్యుల డిమాండ్. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. బిల్లులు నిలుపు చేయాలని కోర్టును కోరడంతోపాటు, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడం, చెల్లించిన బిల్లులు రికవరీ చేయాలని కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.