Mrinal Sen
-
సేన్, రేల మధ్య వైరుధ్య బంధం
సాక్షి, న్యూఢిల్లీ : ‘కళాత్మక చిత్రాలు తీస్తామని చెప్పుకునే వారందరికి విదేశాల్లో జరిగే చలన చిత్రోత్సవాల్లో పొల్గొనాలనే ధ్యాస తప్పించి, భారత ప్రేక్షకులను ఆకర్షించాలనే దృష్టి లేదు. కథ ఎలా చెప్పాలో తెల్సిన మృణాల్ సేన్ కూడా వారిలో ఒకరే’ అని ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శక నిర్మాత సత్యజిత్ రాయ్ రాసిన ఓ లేఖలోని వ్యాఖ్యలివి. మృణాల్ సేన్ తీసిన దాదాపు అన్ని సినిమాల గురించి విమర్శనాత్మక దృక్పథంతోనే మాట్లాడిన సత్యజిత్ రే ఆయన్ని విమర్శిస్తూ ప్రముఖ సినీ విమర్శకుడు చిదానంత గుప్తాకు (1991, జూన్‌లో) రాసిన ఆఖరి లేఖలోనిది ఈ వ్యాఖ్య. ఈ లేఖ ప్రతిని ఓ జాతీయ పత్రిక 1991, అక్టోబర్‌లో వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వ్యాఖ్యలను చూసిన మృణాల్ సేన్ బాగా నొచ్చుకున్నారు. అప్పటికే సత్యజిత్ రే ఆస్పత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్నారు. సినీ పాత్రికేయ లోకం మృణాల్ సేన్‌ను చుట్టుముట్టి, సత్యజిత్ రే చేసిన విమర్శలపై స్పందించాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారు. ‘సత్యజిత్ రే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మానసికంగా ఆయన ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన వేలకు మందులు తీసుకొని త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. అందుకని కళాత్మక విలువల గురించి. సినీ కళ గురించి నేనిప్పుడు చర్చించ దల్చుకోలేదు’ అని సేన్ వ్యాఖ్యానించారు. ఆయన ఆశించినట్లు సత్యజిత్ రే కోలుకోకుండా 1992, ఏప్రిల్ 23వ తేదీన కన్నుమూశారు. రే ఆస్పత్రిలో చేరిన దగ్గరి నుంచి ఆయన దహన సంస్కారాల వరకు మృణాల్ సేన్, రే కుటుంబం వెన్నంటే ఉన్నారు. అయితే అన్ని రోజులూ ఆయన కళ్లలో వెలుగు కోల్పోయిన ఛాయలే కనిపించాయి. సత్యజిత్ రే విమర్శలకు మృణాల్ సేన్ నొచ్చుకోవడం అదే మొదటి సారి కాదు. 1965లో ఆయన తీసిన ‘ఆకాశ్ కుసమ్’ నుంచి 1969లో హిందీలో తీసిన తొలి చిత్రం ‘భువన్ షోమ్’ (కరీర్లో 9వ చిత్రం) మొదలుకొని దాదాపు అన్ని చిత్రాలపై సత్యజిత్ విమర్శలు చేశారు. తెలుగులో తీసిన ‘ఒక ఊరి కథ’తోపాటు ఒకటి రెండు హిందీ చిత్రాలను మెచ్చుకున్నారు. కేవలం రెండు లక్షల రూపాయలను మాత్రమే వెచ్చించి తీసిన హిందీ చిత్రం ‘భువన్ షోమ్’ సినీ విమర్శకులనే కాకుండా కమర్షియల్‌గా కూడా ఎంతో హిట్టయింది. కొత్త తరంగ చిత్రంగా సినీ విమర్శకులు దాన్ని కొనియాడగా, ఆ అందులో ఏముందీ, ప్రేక్షకులకు ఆకట్టుకునే కొన్ని పాపులర్ టెక్నిక్‌లు తప్ప అని సత్యజిత్ రే విమర్శించారు. ‘ఏ బిగ్ బ్యాడ్ బ్యూరోక్రట్ రిఫామ్డ్ బై రస్టిక్ బెల్లి’ అంటూ వ్యాఖ్యానించారు. ఫ్రాంకోయా ట్రూఫాట్ చిత్రాల స్ఫూర్తితో మృణాల్ సేన్, సౌమిత్ర ఛటర్జీ, అపర్ణా సేన్ జంటగా ‘ఆకాశ్ కుసమ్’ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రంతోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలయింది. నాడు ‘స్టేట్స్‌మేన్’ పత్రిక ఈ సినిమాపై బహిరంగ చర్చను నిర్వహించింది. సినీ విమర్శకులు కొందరు సేన్ వైపు నిలువగా, మరికొందరు రే వైపు వ్యాఖ్యానాలు చేశారు. ఈ విషయం చినికి చినికి గాలివానగా మారడంతో 1965, సెప్టెంబర్ 13వ తేదీన చర్చను నిలిపివేస్తున్నట్లు స్టేట్స్‌మేన్ పత్రిక ప్రకటించింది. రే చేసిన దాదాపు అన్ని విమర్శలకు సేన్ సమాధానం ఇచ్చినా రే అంత ఘాటుగా ఎప్పుడు స్పందించలేదు. రే తీసిన ‘పథేర్ పాంచాలి’, అపరాజిత సిరీస్ చిత్రాలను ప్రశంసించిన మృణాల్ సేన్ ‘పరాస్ పత్తర్’ చిత్రాన్ని తీవ్రంగానే విమర్శించారు. ఈ ఇరువురు మహా దర్శకులు వర్తమాన జీవన వైరుధ్యాలపై తమదైన దృక్పథంతో సినిమాలు తీసి సామాజిక ప్రయోజనానికి దోహదపడ్డారు. వీరిద్దరు తీసిన ‘పునస్క–మహానగర్, ప్రతివాండీ–ఇంటర్వ్యూ, బైషే శ్రావణ–ఆశని సంకేత్, కోరస్–హీరక్ రాజర్ దిశే’ చిత్రాల్లో కథాంశం దాదాపు ఒకటే అయినా భిన్న కోణాలు కల్పిస్తాయి. ఒకప్పుడు మంచి మిత్రులే ఒడ్డూ, పొడువు, ఛామన ఛాయలో ఒకే తీరుగా కనిపించే మృణాల్ సేన్, సత్జిత్ రేలు చర్చా వేదికలపై ఒకరినొకరు విమర్శించుకుంటూ గంభీరంగానే కనిపించేవారు. అంతకుముందు వారు చాలా సన్నిహిత మిత్రలు. చాప్లిన్ మీద మృణాల్ సేన్ రాసిన పుస్తకం కవర్ పేజీని సత్యజిత్ రే స్వయంగా డిజైన్ చేశారు. లేక్ టెంపుల్ రోడ్డులోని సత్యజిత్ రే ఫ్లాట్‌కు సేన్ తరచూ వెళ్లి గంటల తరబడి సినిమా ముచ్చట్లు పెట్టేవారు. భిన్నత్వంలో ఏకత్వంలా వైరుధ్యంలో ఏకత్వంగా వారి మధ్య మిత్రత్వం ఉండేది. రే జ్ఙాపకాలతో మృణాల్ సేన్ నిన్న, అంటే ఆదివారం లోకం విడిచి వెళ్లి పోయిన విషయం తెల్సిందే. -
దర్శకదిగ్గజం మృణాల్ సేన్ ఇకలేరు
ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ (95) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం కోల్‌కతాలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1923 మే 14న బంగ్లాదేశ్‌లోని ఫరిద్‌పూర్‌లో జన్మించిన మృణాల్ సేన్ బంగ్లాదేశ్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. అనంతరం కోల్‌కతాలో స్కాటిష్ చర్చి కాలేజీలో చదివారు. కోల్‌కతా యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత సినిమా పట్ల ఆసక్తి ఏర్పడినప్పటికీ పరిస్థితులు ఆయన్ను ‘మెడికల్ రిప్రజంటేటివ్’ జాబ్‌ను అంగీకరించేలా చేశాయి. అయితే ఆ వృత్తిలో ఎన్నాళ్లో కొనసాగలేని మృణాల్ సేన్ మళ్లీ కోల్‌కతాలో అడుగుపెట్టారు. అక్కడి ఓ స్టూడియోలో ‘ఆడియో టెక్నీషియన్‌గా’ చేరడంతో సేన్ సినిమా కెరీర్ మొదలైంది. 1955లో ‘రాత్ భోరే’ చిత్రం ద్వారా దర్శకునిగా ప్రయాణం మొదలుపెట్టారు. తర్వాతి రోజుల్లో బెంగాలీ సినిమాలో ‘మహానాయక్’ అనిపించుకున్న నటుడు ఉత్తమ్‌కుమార్ ఈ చిత్రంలో నటించారు. ఆ తర్వాత మృణాల్ సేన్ తీసిన ‘నీల్ అకాషర్ నీచే’ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. అయితే, ఆ సినిమా రాజకీయ వివాదాలకు కారణమవడంతో ప్రభుత్వం రెండు నెలల పాటు ఆ చిత్రాన్ని నిషేధించింది. స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ నిషేధానికి గురైన మొదటి సినిమా ఇదే. మృణాల్ సేన్ మూడో సినిమా ‘బైషే ష్రవన్’ ఆయనకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది కూడా. ఇక ‘భువన్ షోమే’(1969) సినిమా సేన్ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసింది. కొత్త తరహా చిత్రాలకు ఇది నాంది అయింది. మధ్య తరగతి నేపథ్యంలో సామాజిక, రాజకీయ అంశాలపై ఎక్కువ సినిమాలు తీశారు సేన్. సినిమాను అందంగా, అత్యున్నత, వినూత్న సాంకేతిక విలువలతో తీయడంలో సేన్‌కు సాటి ఎవరూ లేరని విమర్శకులు కొనియాడతారు. కథ చెప్పడంలో ఆయనది ప్రత్యేక శైలి. తన సినిమాల్లో నిశ్శబ్దానికి కూడా ప్రాధాన్యమిచ్చేవారు. మెజారిటీ ప్రేక్షకులను కాకుండా అసలైన వీక్షకులను దృష్టిలో ఉంచుకునే సినిమాలు తీశారు. వాణిజ్య అంశాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలనే అందించారు సేన్. సేన్ శైలి వినూత్నం భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అతి కొద్దిమంది దర్శకుల్లో మృణాళ్‌సేన్ ముఖ్యులు. 1950–60 దశకాల్లో భారతీయ సినిమా రంగాన్ని ‘స్వర్ణయుగం’గా మలిచిన దర్శక శిల్పుల్లో ఆయన కూడా ఒకరు. రెండు దశాబ్దాల పాటు భారతీయ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన బెంగాలీ దర్శకత్రయంలో ఒకరైన మృణాల్ సేన్ (మిగతా ఇద్దరు సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్) చిత్రీకరణలో, సాంకేతిక విలువల్లో తనదైన ముద్ర వేశారు. మధ్య తరగతి ప్రజలపై, వారి మనస్తత్వాలపై పూర్తి అవగాహన ఉందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన మృణాల్ ఆ వర్గం ఎదుర్కొనే సామాజిక, వ్యక్తిగత సంఘర్షణలకు తన సినిమాల్లో అద్దం పట్టారు. అప్పటి వరకు వస్తున్న మూస విధానాలను వదిలి కథనంలో, చిత్రీకరణలో సాంకేతిక పద్ధతుల్లో వినూత్న పంథాను అనుసరించి తన శైలిని నిరూపించుకున్నారు. కోల్‌కతాను ఓ పాత్రలా, ఆదర్శవంతంగా తన చిత్రాల్లో చూపించారు. ‘భువన్ షోమే’లో.. మృణాల్‌పై డాక్యుమెంటరీ దాదాపు యాభై దశాబ్దాల పాటు (1956–2002) బెంగాలీ చిత్రరంగాన్ని ఏలిన సేన్ 27 సినిమాలు, 14 షార్ట్‌ఫిల్మ్‌లు, 4 డాక్యుమెంటరీలు తీశారు. ‘భువన్‌షోమే, ఏక్ దిన్ ప్రతి దిన్, అకలేర్ సంధానే, ఖాంధార్’ సినిమాలు ఆయనకు జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డులను తెచ్చిపెట్టాయి. ‘భువన్‌షోమే, కోరస్, మృగయా, అకలేర్’ సినిమాలు జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారాలు పొందాయి. ‘మృగయా’ చిత్రంతో మిథున్ చక్రవర్తిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు మృణాళ్ సేన్. వెనిస్, కాన్స్, బెర్లిన్ వంటి పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో సేన్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వామపక్ష భావాలున్న ఆయన బెంగాలీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు తీసి విమర్శకుల మెప్పు పొందారు. పలు విజయవంతమైన సినిమాలు తీసి దిగ్గజ దర్శకుడిగా పేరొందడంతో పాటు పలు జాతీయ అవార్డులు అందుకున్నారు. 1983లో పద్మభూషణ్ అవార్డు, 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు సేన్. భారతీయ సినిమాను ప్రపంచ సినిమా స్థాయికి తీసుకెళ్లారనే పేరు గడించారాయన. జర్మనీకి చెందిన సినీ దర్శకుడు రెయిన్ హార్డ్హఫ్ 1984లో మృణాల్‌పై ‘టెన్‌డేస్ ఇన్ కోల్కత్తా’ పేరుతో డాక్యుమెంటరీ తీయడం విశేషం. 1997–2003 మధ్య సేన్ రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. సినిమా చరిత్రపుటల్లో మృణాల్ సేన్‌ది ఓ ప్రత్యేక పేజీ. ఆయన మృతికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోది, పశ్చిమబెంగాల్ గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగులోనూ... 1977లో ‘ఒక ఊరి కథ’ పేరుతో మృణాల్ సేన్ తెలుగులోనూ సినిమా తీశారు. మున్షి ప్రేమ్‌చంద్ రాసిన కథ ఆధారంగా తీసిన ఈ సినిమా 4వ హాంకాంగ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భారతదేశం తరఫున ఎంపికైంది. ఈ చిత్రానికి కార్లోవి వారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోను, కార్తేజ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోను ప్రత్యేక అవార్డులు లభించాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా (1977) జాతీయ పురస్కారం అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు కూడా లభించింది. భారతదేశంలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా ‘ఒక ఊరి కథ’ ని ప్రదర్శించడం విశేషం. ‘ఒక ఊరి కథ’లో... -
బతికుండగానే ఆ దర్శక దిగ్గజాన్ని చంపేశారు!
ప్రముఖులు చనిపోయారంటూ వందతులు వ్యాప్తి చేయడం ట్విట్టర్లో సర్వసాధారణంగా మారింది. మొన్నటికి మొన్న ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్, తమిళ హాస్యనటుడు సెంథిల్ (గౌడమణి) కూడా బతికుండానే చనిపోయినట్టు దుర్మార్గంగా ప్రచారం చేశారు. తాజాగా విఖ్యాత దర్శకుడు, వయోవృద్ధుడు మృణాల్‌సేన్ బతికుండానే చనిపోయారంటూ ట్విట్టర్లో వదంతులు షికారు చేశాయి. ఈ వదంతులు ఏ స్థాయికి వ్యాపించాయంటే బెంగాల్ సినీ ప్రముఖులైన అమితావ్ ఘోష్, కేతన్ సేథ్ వంటి పలువురు ఆయన మృతికి సంతాపం కూడా తెలిపారు. చిన్నాచితక వెబ్సైట్లలో ఆయన సేవలపై సంస్మరణ కథనాలు వెలువడ్డాయి. దీంతో కలత చెందిన మృణాల్ సేన్ కుటుంబం ఆదివారం వివరణ ఇచ్చింది. 93 ఏళ్ల మృణాల్ సేన్ నిక్షేపంగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన ఈ ఉదయం ‘చాయ్’ కూడా తాగారని, ఆయనకు ఏమీ కాలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన మృతిపై వస్తున్న కథనాలను వెంటనే ఆపేయాలని కోరింది. ట్విట్టర్లో వందతులు చూసి వెంటనే సంతాపాలు తెలిపిన ప్రముఖులు, నెటిజన్లు కూడా ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు. ట్విట్టర్లో, ఆన్లైన్లో వెల్లువెత్తే వందతుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఇది చాటుతోందని నిపుణులు చెప్తున్నారు. సమాంతర సినిమాలతో భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శక త్రయంలో మృణాల్ సేన్ ఒకరు. తన సమాకాలీనులైన సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘటాక్లకు దీటుగా సినిమాలు తెరకెక్కించిన ఆయన దర్శక దిగ్గజంగా పేరు పొందారు. భువన్ షోమ్, ఖర్జీ, మృగయ వంటి సినిమాలతో భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు. -
మే 14న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మృణాల్ సేన్ (ఫిల్మ్ మేకర్), మధురిమ (నటి) ఈ రోజు పుట్టిన వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 9. విద్యాసంబంధ విషయాలలో పురోభివృద్ధి సాధిస్తారు. ఆగిపోయిన రిసెర్చి వర్క్ చకచకా ముందుకెళుతుంది. డిగ్రీలు, పీజీలు పూర్తి చేస్తారు. పోలీసులు, మిలిటరీ వాళ్లు తదితర యూనిఫాం ధరించే ఉద్యోగుల కృషిని ప్రభుత్వం గుర్తించి, అవార్డులు, రివార్డులు, ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉంది. భూములు, భవనాలు కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. ఆస్తులను బాగా అభివృద్ధి చేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు ఈ సంవత్సరం పరిష్కారమవుతాయి. కుజుడి ప్రభావం వల్ల రకరకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు, ఆయుధాలు ఉపయోగించేటప్పుడు అప్రమత్తత అవసరం. లక్కీ నంబర్స్: 1,5,6,9, లక్కీ కలర్స్: గ్రీన్, రెడ్, ఆరెంజ్, వైట్; లక్కీ డేస్: మంగళ, బుధ, శుక్రవారాలు. సుదర్శన హోమం చేయించుకోవటం, తోబుట్టువులకు సాయం చేయటం, రక్తదానం చేయటం మంచిది. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
హఠాత్తుగా ఒక రోజు... ఏక్ దిన్ అచానక్....
బడబడమని కురుస్తున్న వర్షం. దడదడమని మెరుపులు. అర్ధరాత్రి అవుతోంది. ఆ ఇంట్లోని తల్లి, పెద్ద కూతురు, కొడుకు, చిన్న కూతురు అందరూ కారిడార్‌లో నిలబడి వీధి వైపు చూస్తూ ఉన్నారు. కాని వాళ్లు ఎదురు చూస్తున్న ఆ ఇంటి పెద్ద రాలేదు. సాయంత్రం వెళ్లాడు- ఇప్పుడే వస్తానని. కాని రాలేదు. ఎక్కడ వెతికినా లేడు. ఎవరిని అడిగినా తెలియదు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. పత్తా లేడు. అతనేం పిచ్చివాడా? రిటైర్డ్ ప్రొఫెసర్. ఇల్లు ఉంది. వాకిలి ఉంది. భార్య... పిల్లలు... కాని వెళ్లిపోయాడు. ముసలి వయసులో. ఎందుకు వెళ్లిపోయి ఉంటాడు? అతనికి బాధ్యత లేదు అని కొడుకు అన్నాడు. అతడికి ఇల్లు పట్టలేదు అని భార్య అంది. అతడు ఒక మామూలు మనిషి... కాని మనం ఒక మేధావి అనుకున్నాం అని పెద్ద కూతురు అంది. అతడొక అహంకారి అని చిన్న కూతురు భావించింది. రోజులు గడిచాయి. మళ్లీ వానాకాలం వచ్చింది. తండ్రి ఆచూకీ లేదు. అతడు ఉండగా బాధ్యతగానే ఉండేవాడు అని కొడుక్కి అనిపించింది. అతడు ఉండగా ఇంటిని పట్టించుకునేవాడు అని భార్యకు అనిపించింది. అతడు మేధావి అని పెద్ద కూతురికి అనిపించింది. అతడు నిగర్వి అని చిన్న కూతురికి అనిపించింది. కాని అతడు ఏమిటి? ఏమో ఇవన్నీ కావచ్చు. అసలేమీ కాకపోవచ్చు. మరి అతడు ఎందుకు వెళ్లిపోయాడు? మనందరి జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది. ఒక మీడియోక్రసీ ఉంటుంది. అసలైనదేదో చేయకుండా ఒక నాటకంలో పాత్రధారిలాగా మారిపోతూ ఉంటాం. కాని ఏం చేయగలం? మనకుండేది ఒకే జీవితం. ఒకలాంటి జీవితం. ఇంకోలా జీవించాలంటే వీలుండదు. ఆ సంగతి తెలిసి ఇంకోలాంటి జీవితాన్ని వెతుక్కుంటూ అతడు వెళ్లిపోయాడా? మళ్లీ రానున్నాడా? ‘ఏక్ దిన్ అచానక్’ మృణాల్‌సేన్ తీసిన గొప్ప సినిమాల్లో ఒకటి. ఊపిరి బిగపట్టి చూసేలా కేవలం ఒక ఇంటిలో నలుగురు పాత్రల మధ్య అతడు ఈ సినిమా (1989లో) తీశాడంటే అద్భుతం. శ్రీరామ్ లాగూ, షబానా ఆజ్మీ... వీళ్లను చూస్తుంటే మనుషులు పాత్రలుగా మారడం... స్టన్నింగ్. ఇది బెంగాలీలో రామపాద చౌదురి రాసిన ‘బీజ్’ అనే నవల. హిందీలో ఒక మరపురాని సినిమా. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయ్. Ek Din Achanak అని కొట్టి చూడండి.