బతికుండగానే ఆ దర్శక దిగ్గజాన్ని చంపేశారు!
ప్రముఖులు చనిపోయారంటూ వందతులు వ్యాప్తి చేయడం ట్విట్టర్‌లో సర్వసాధారణంగా మారింది. మొన్నటికి మొన్న ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్, తమిళ హాస్యనటుడు సెంథిల్ (గౌడమణి) కూడా బతికుండానే చనిపోయినట్టు దుర్మార్గంగా ప్రచారం చేశారు. తాజాగా విఖ్యాత దర్శకుడు, వయోవృద్ధుడు మృణాల్‌సేన్ బతికుండానే చనిపోయారంటూ ట్విట్టర్‌లో వదంతులు షికారు చేశాయి. ఈ వదంతులు ఏ స్థాయికి వ్యాపించాయంటే బెంగాల్ సినీ ప్రముఖులైన అమితావ్ ఘోష్, కేతన్ సేథ్ వంటి పలువురు ఆయన మృతికి సంతాపం కూడా తెలిపారు. చిన్నాచితక వెబ్‌సైట్లలో ఆయన సేవలపై సంస్మరణ కథనాలు వెలువడ్డాయి.
దీంతో కలత చెందిన మృణాల్ సేన్ కుటుంబం ఆదివారం వివరణ ఇచ్చింది. 93 ఏళ్ల మృణాల్ సేన్ నిక్షేపంగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన ఈ ఉదయం ‘చాయ్’ కూడా తాగారని, ఆయనకు ఏమీ కాలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన మృతిపై వస్తున్న కథనాలను వెంటనే ఆపేయాలని కోరింది.
ట్విట్టర్‌లో వందతులు చూసి వెంటనే సంతాపాలు తెలిపిన ప్రముఖులు, నెటిజన్లు కూడా ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు. ట్విట్టర్‌లో, ఆన్‌లైన్‌లో వెల్లువెత్తే వందతుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఇది చాటుతోందని నిపుణులు చెప్తున్నారు.
సమాంతర సినిమాలతో భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శక త్రయంలో మృణాల్ సేన్ ఒకరు. తన సమాకాలీనులైన సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘటాక్‌లకు దీటుగా సినిమాలు తెరకెక్కించిన ఆయన దర్శక దిగ్గజంగా పేరు పొందారు. భువన్ షోమ్, ఖర్జీ, మృగయ వంటి సినిమాలతో భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు.