దర్శకదిగ్గజం మృణాల్‌ సేన్‌ ఇకలేరు | Bengali filmmaker Mrinal Sen dies at 95 | Sakshi
Sakshi News home page

దర్శకదిగ్గజం మృణాల్‌ సేన్‌ ఇకలేరు

Published Mon, Dec 31 2018 2:35 AM | Last Updated on Mon, Dec 31 2018 12:42 PM

Bengali filmmaker Mrinal Sen dies at 95 - Sakshi

మృణాల్‌ సేన్‌

ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్‌ సేన్‌ (95) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం కోల్‌కతాలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1923 మే 14న బంగ్లాదేశ్‌లోని ఫరిద్‌పూర్‌లో జన్మించిన మృణాల్‌ సేన్‌ బంగ్లాదేశ్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. అనంతరం కోల్‌కతాలో స్కాటిష్‌ చర్చి కాలేజీలో చదివారు. కోల్‌కతా యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ తీసుకున్నారు.

ఆ తర్వాత సినిమా పట్ల ఆసక్తి ఏర్పడినప్పటికీ పరిస్థితులు ఆయన్ను ‘మెడికల్‌ రిప్రజంటేటివ్‌’ జాబ్‌ను అంగీకరించేలా చేశాయి. అయితే ఆ వృత్తిలో ఎన్నాళ్లో కొనసాగలేని మృణాల్‌ సేన్‌ మళ్లీ కోల్‌కతాలో అడుగుపెట్టారు. అక్కడి ఓ స్టూడియోలో ‘ఆడియో టెక్నీషియన్‌గా’ చేరడంతో సేన్‌ సినిమా కెరీర్‌ మొదలైంది. 1955లో ‘రాత్‌ భోరే’ చిత్రం ద్వారా దర్శకునిగా ప్రయాణం మొదలుపెట్టారు. తర్వాతి రోజుల్లో బెంగాలీ సినిమాలో ‘మహానాయక్‌’ అనిపించుకున్న నటుడు ఉత్తమ్‌కుమార్‌ ఈ చిత్రంలో నటించారు.  ఆ తర్వాత మృణాల్‌ సేన్‌ తీసిన ‘నీల్‌ అకాషర్‌ నీచే’ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది.

అయితే, ఆ సినిమా రాజకీయ వివాదాలకు కారణమవడంతో ప్రభుత్వం రెండు నెలల పాటు ఆ చిత్రాన్ని నిషేధించింది. స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ నిషేధానికి గురైన మొదటి సినిమా ఇదే. మృణాల్‌ సేన్‌ మూడో సినిమా ‘బైషే ష్రవన్‌’ ఆయనకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది. లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది కూడా. ఇక ‘భువన్‌ షోమే’(1969) సినిమా సేన్‌ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసింది. కొత్త తరహా చిత్రాలకు ఇది నాంది అయింది.

మధ్య తరగతి నేపథ్యంలో సామాజిక, రాజకీయ అంశాలపై ఎక్కువ సినిమాలు తీశారు సేన్‌. సినిమాను అందంగా, అత్యున్నత, వినూత్న సాంకేతిక విలువలతో తీయడంలో సేన్‌కు సాటి ఎవరూ లేరని విమర్శకులు కొనియాడతారు. కథ చెప్పడంలో ఆయనది ప్రత్యేక శైలి. తన సినిమాల్లో నిశ్శబ్దానికి కూడా ప్రాధాన్యమిచ్చేవారు. మెజారిటీ ప్రేక్షకులను కాకుండా అసలైన వీక్షకులను దృష్టిలో ఉంచుకునే సినిమాలు తీశారు. వాణిజ్య అంశాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలనే అందించారు సేన్‌.

సేన్‌ శైలి వినూత్నం
భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అతి కొద్దిమంది దర్శకుల్లో మృణాళ్‌సేన్‌ ముఖ్యులు. 1950–60 దశకాల్లో భారతీయ సినిమా రంగాన్ని ‘స్వర్ణయుగం’గా మలిచిన దర్శక శిల్పుల్లో ఆయన కూడా ఒకరు. రెండు దశాబ్దాల పాటు భారతీయ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన బెంగాలీ దర్శకత్రయంలో ఒకరైన మృణాల్‌ సేన్‌ (మిగతా ఇద్దరు సత్యజిత్‌ రే, రిత్విక్‌ ఘటక్‌) చిత్రీకరణలో, సాంకేతిక విలువల్లో తనదైన ముద్ర వేశారు. మధ్య తరగతి ప్రజలపై, వారి మనస్తత్వాలపై పూర్తి అవగాహన ఉందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన మృణాల్‌ ఆ వర్గం ఎదుర్కొనే సామాజిక, వ్యక్తిగత సంఘర్షణలకు తన సినిమాల్లో అద్దం పట్టారు. అప్పటి వరకు వస్తున్న మూస విధానాలను వదిలి కథనంలో, చిత్రీకరణలో సాంకేతిక పద్ధతుల్లో వినూత్న పంథాను అనుసరించి తన శైలిని నిరూపించుకున్నారు. కోల్‌కతాను ఓ పాత్రలా, ఆదర్శవంతంగా తన చిత్రాల్లో చూపించారు.


‘భువన్‌ షోమే’లో..

మృణాల్‌పై డాక్యుమెంటరీ
దాదాపు యాభై దశాబ్దాల పాటు (1956–2002) బెంగాలీ చిత్రరంగాన్ని ఏలిన సేన్‌ 27 సినిమాలు, 14 షార్ట్‌ఫిల్మ్‌లు, 4 డాక్యుమెంటరీలు తీశారు. ‘భువన్‌షోమే, ఏక్‌ దిన్‌ ప్రతి దిన్, అకలేర్‌ సంధానే, ఖాంధార్‌’ సినిమాలు ఆయనకు జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డులను తెచ్చిపెట్టాయి. ‘భువన్‌షోమే, కోరస్, మృగయా, అకలేర్‌’ సినిమాలు జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారాలు పొందాయి. ‘మృగయా’ చిత్రంతో మిథున్‌ చక్రవర్తిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు మృణాళ్‌ సేన్‌. వెనిస్, కాన్స్, బెర్లిన్‌ వంటి పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో సేన్‌ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వామపక్ష భావాలున్న ఆయన బెంగాలీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు తీసి విమర్శకుల మెప్పు పొందారు.  పలు విజయవంతమైన సినిమాలు తీసి దిగ్గజ దర్శకుడిగా పేరొందడంతో పాటు పలు జాతీయ అవార్డులు అందుకున్నారు. 1983లో పద్మభూషణ్‌ అవార్డు, 2005లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు సేన్‌. భారతీయ సినిమాను ప్రపంచ సినిమా స్థాయికి తీసుకెళ్లారనే పేరు గడించారాయన.

జర్మనీకి చెందిన సినీ దర్శకుడు రెయిన్‌ హార్డ్‌హఫ్‌ 1984లో మృణాల్‌పై ‘టెన్‌డేస్‌ ఇన్‌ కోల్‌కత్తా’ పేరుతో డాక్యుమెంటరీ తీయడం విశేషం. 1997–2003 మధ్య సేన్‌ రాజ్యసభ సభ్యుడిగానూ  ఉన్నారు. సినిమా చరిత్రపుటల్లో మృణాల్‌ సేన్‌ది ఓ ప్రత్యేక పేజీ. ఆయన మృతికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోది, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ కేశరినాథ్‌ త్రిపాఠి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ, సీపీఎం జనరల్‌ సెక్రటరీ సీతారాం ఏచూరి, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
తెలుగులోనూ...
1977లో ‘ఒక ఊరి కథ’ పేరుతో మృణాల్‌ సేన్‌ తెలుగులోనూ సినిమా తీశారు. మున్షి ప్రేమ్‌చంద్‌ రాసిన కథ ఆధారంగా తీసిన ఈ సినిమా 4వ హాంకాంగ్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భారతదేశం తరఫున ఎంపికైంది. ఈ చిత్రానికి కార్లోవి వారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోను, కార్తేజ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోను  ప్రత్యేక అవార్డులు లభించాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా (1977) జాతీయ పురస్కారం అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డు కూడా లభించింది. భారతదేశంలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా
‘ఒక ఊరి కథ’ ని ప్రదర్శించడం విశేషం.

‘ఒక ఊరి కథ’లో...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement