ఆటపట్టించబోయి.. హతమయ్యి..
* వీడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్హత్య మిస్టరీ
* పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
హైదరాబాద్: సికింద్రాబాద్ ఎస్డీ రోడ్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసు మిస్టరీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. సరదాగా చేసిన టీజింగ్ అతడి ప్రాణాలపైకి తెచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివి... పార్శీగుట్టకు చెందిన సురేందర్ కుమారుడు సంజయ్ జుంగే(25) తన స్నేహితులైన సిద్ధాంత్, కుశాల్కర్‌తో కలసి ఈ నెల 3న తెల్లవారుజాము వరకు మద్యం సేవించారు. అనంతరం ముగ్గురూ పంజాగుట్ట పీవీఆర్ మాల్ వద్దకు వచ్చారు.
అక్కడి నుంచి తాను వెళతానని చెప్పడంతో సంజయ్‌ని వదిలి మిగిలినవారు వెళ్లిపోయారు. పంజాగుట్టలో ఏపీ14ఏక్యూ 8055 నంబర్ స్విఫ్ట్ కారును లిప్టు అడిగి సంజయ్ ఎక్కాడు. ఆ కారులో పాతబస్తీకి చెందిన ముభాషీన్, సల్మాన్, శ్రీధర్, బాబులు ఉన్నారు. బాబు డ్రైవింగ్ చేస్తున్నాడు. కారులో ముభాషీన్ ఫోన్లో ఓ మహిళతో మాట్లాడుతున్నాడు. పక్కనే కూర్చున్న సంజయ్ అతడిని ఆట పట్టించే యత్నం చేశాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. బేగంపేట్ వద్దకు రాగానే కారు ఆపి సంజయ్‌ను దిగిపోమని వారు బలవంతం చేశారు.
అయితే తన స్నేహితుడు పరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్నాడని, అక్కడ దించాలని సంజయ్ కోరాడు. తాము ఎస్డీ రోడ్లో వెళతామని చెప్పగా ప్యాట్నీ సెంటర్లో మా నాన్న షాపు ఉందని అక్కడ దిగుతానని చెప్పాడు. పరేడ్ గ్రౌండ్ వద్ద వేచి చూస్తున్న తన స్నేహితుడు భాస్కర్‌కు ఫోన్ చేసి ప్యాట్నీ సెంటర్‌కు రమ్మన్నాడు. కానీ, సంజయ్‌ను వారు స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద దించేశారు. దీంతో సంజయ్ వారిని దూషించడంతో అతడిపై దాడి చేశారు. ముభాషీన్ తన దగ్గరున్న కత్తి తీసి సంజయ్ గుండెల్లో రెండు పోట్లు పొడిచి పరారయ్యారు. కాగా, ముభాషీన్ రౌడీషీటర్. ఒక హత్య కేసులో నిందితుడు. మిగతా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిసింది.