త్వరలో ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు
అమరావతి: హంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టు కింద చేపట్టిన ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను త్వరలో ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ స్కీంకు రెండు పంపులు ఏర్పాటు చేస్తున్నామని, అనంతపురంజిల్లా గొల్లపల్లి వరకు నీటిని తీసుకెళ్తామని, భవిష్యత్తులో చిత్తూరుజిల్లా కుప్పం వరకు సాగునీటిని తీసుకెళ్ళే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో రైతులకు రూ.614 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరైందని, ఇందులో కర్నూలు జిల్లా రైతులకు రూ.181 కోట్లు అందిస్తామని, తన నియోజకవర్గమైన పత్తికొండకు రూ.66 కోట్లు మంజూరైనట్లు కేఈ వివరించారు. జనవరిలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా ఇన్పుట్ సబ్సిడీ చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. నోట్ల రద్దు ప్రభావంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. పెంచిన భూ మార్కెట్ విలువను తగ్గించలేమని, స్థిరీకరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే కృష్ణాజిల్లా నూజివీడులో భూమి మార్కెట్ విలువ రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు అమాంతంగా పెరిగిందని, కారణాలు అన్వేషిస్తున్నట్లు ఆయన చెప్పారు.