అమ్మకానికి ముహమ్మద్ అలీ ఇల్లు
న్యూయార్క్: ఒకప్పటి ప్రపంచ ప్రసిద్ధ బాక్సర్ ముహమ్మద్ అలీకి చెందిన నందన వనం మధ్య నిర్మించిన సుందర సువిశాల భవనం ఆన్లైన్లో అమ్మకానికి వచ్చింది. న్యూజెర్సీ, చెర్రీ హిల్స్‌లో ఒకటిన్నర ఎకరంలో 6,688 చదరపు అడుగుల విస్తీర్ణంలో కళాత్మకంగా నిర్మించిన ఈ భవనాన్ని దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలకు లిస్టింగ్ ఏజెంట్ చెరిల్ డేర్ అమ్మకానికి పెట్టారు.
ఈ భవనంలో ముహమ్మద్ అలీ 1971 నుంచి 74 వరకు ఈ ఇంట్లోనే నివసించారు. ఇక్కడుండగానే ఆయన ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్లో ఓడిపోయారు. మరోసారి విజయం సాధించారు. ఈ భవనంలో ఐదు బెడ్ రూమ్‌లు, ఐదు బాత్రూమ్లు, విశాలమైన హాలుతోపాటు 45 అడుగుల బార్ కూడా ఉంది. సబ్-జీరో రిఫ్రిజరేటర్, రెండు హోవెన్లు, గ్రిల్, ఫ్రయర్, వైన్ కూలర్, జాగ్వర్ లాంటి సౌకర్యాలతో ఆధునిక కిచెన్ కంటికింపుగా ఉంది. డైనింగ్ హాల్లో అందమైన గ్లాస్ శాండిలియర్లు ఉన్నాయి. ముహమ్మద్ అలీ తన కుటుంబ సభ్యులతో ఎక్కువగా డైనింగ్ హాల్లోనే గడిపేవారు.
ఇక భవనం వెలుపల 40 అడుగుల పొడవైన స్విమ్మింగ్ పూల్, అవసరానికి తగ్గట్టుగా వాలిబాల్, షఫిల్బోర్డ్ కోర్టుగా మలుచుకునే అవకాశం ఉన్న టెన్నిస్ కోర్ట్ ఉంది. పచ్చటి చెట్ల మధ్య విశాలమైన ఆట స్థలం కూడా ఉంది. వాస్తవానికి ఈ భవనానికి వెలకట్టలేమని, దీన్ని సొంతం చేసుకోవడమెంటే కొంత చరిత్రను సొంతం చేసుకోవడమేనని, చరిత్రలో భాగమవడమేనని చెరిల్ డేర్ వ్యాఖ్యానించారు.