muhammad pravakta
-
వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత: మరిన్ని చిక్కుల్లో నూపుర్ శర్మ
న్యూఢిల్లీ: ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకీ ఆమెను మరిన్ని చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా సస్పెండెడ్ బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతోపాటు నవీన్ జిందాల్ జర్నలిస్ట్ సబా నఖ్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్‌పై కూడా ఎఫ్ఐఆర్ దాఖలైంది. మొత్తం ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. సోషల్ మీడియాలో మత విద్వేశాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించారని పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంబంధిత వార్త: గుజరాత్లో నూపుర్ శర్మ వ్యతిరేక పోస్టర్లు.. అరెస్ట్‌కు డిమాండ్ అసలేం జరిగిందంటే కాగా ఓ టీవీ డిబెట్లో పాల్గొన్న నూపుర్ మహమ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ బీజేపీ మీడియా ఇంచార్జీ నవీన్ కుమార్ జిందాల్ కూడా మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర ట్వీట్లు చేశారు. వీరిద్దరి వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనలు రేపాయి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 1500 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దిద్దుబాటు చర్యగా నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ వెల్లడించింది..అలాగే పార్టీ సస్పెండ్ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నూపుర్ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అయినా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహా జ్వాలలు చల్లారలేదు. దేశంలోనే కాకుండా అరబ్ దేశాల్లోనూ దుమారం రేపాయి. తమ మత విశ్వాసాలను కించపరిచితే ఊరుకునేది లేదని ఇస్లామిక్ దేశాలు మండిపడుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే భారత్ వస్తువులు, సినిమాలు నిషేధించాలంటూ పిలుపునిచ్చే స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు -
ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు
న్యూఢిల్లీ/దుబాయ్: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసింది అధికార బీజేపీకి చెందిన నేతలు కావడంతో పలు ముస్లిం దేశాలు వాటిని కేంద్ర ప్రభుత్వ వైఖరిగా పరిగణిస్తున్నాయి. 57 ముస్లిం దేశాల సమాఖ్య ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ (ఓఐసీ) ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే గాక భారత్‌లో ముస్లిం మైనారిటీల భద్రతపై జోక్యం చేసుకోవాలంటూ ఐరాసకు విజ్ఞప్తి చేసింది! ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన దేశాల జాబితాలో తాజాగా ఇండొనేసియా, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, అఫ్గానిస్తాన్ కూడా చేరాయి. దీనిపై తమ తీవ్ర అభ్యంతరాలను జకార్తాలోని భారత రాయబారికి తెలియపరిచినట్టు ఇండొనేసియా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. యూఏఈతో పాటు మక్కా గ్రాండ్ మాస్క్, మదీనా ప్రాఫెట్స్ మాస్క్ వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ కూడా ఇలాంటి ప్రకటనలే చేశాయి. సౌదీ విదేశాంగ శాఖ ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండిస్తూనే, సదరు నేతలపై బీజేపీ చర్యలను స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. ఖతార్, కువైట్ ఒక అడుగు ముందుకేసి భారత్ క్షమాపణకు కూడా డిమాండ్ చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈలతో కూడిన ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక యూనియన్ అయిన గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. జీసీసీ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ విద్వేష ప్రచారం భారత ఉత్పత్తులను బహిష్కరిస్తామని ఇస్లామిక్ దేశాల్లోని పలు ప్రముఖ సంస్థలు ప్రకటనలు చేస్తుండటం వివాదాన్ని మరింత జటిలంగా మార్చింది. తమ సూపర్ మార్కెట్లలో టీ పొడి తదితర భారత ఉత్పత్తుల విక్రయాలను ఆపేయాలని యోచిస్తున్నట్టు కువైట్‌లోని అల్–అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ వంటివి ఇప్పటికే ప్రకటించాయి. పలు ముస్లిం దేశాల్లో ఇప్పటికే భారత ఉత్పత్తుల బహిష్కరణ మొదలైంది! అరబ్ ప్రపంచమంతా వాటిని నిషేధించాలంటూ ట్విట్టర్ తదితర సోషల్ మాధ్యమాల్లో ట్రెండింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం హుటాహుటిన నష్ట నివారణ చర్యలకు దిగింది. అటు ఓఐసీ వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండిస్తూనే, అవి కొందరు వ్యక్తుల అనాలోచిత వ్యాఖ్యలే తప్ప భారత ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించేవి కానే కావని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీతో పాటు పలు ముస్లిం దేశాల్లోని భారత రాయబారులు స్థానికంగా కూడా ప్రకటనలు చేశారు. బలమైన ఆర్థిక బంధం అరబ్ ప్రపంచం నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలను శాంతింపజేసేందుకు భారత్ హుటాహుటిన రంగంలోకి దిగడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పశ్చిమాసియాలోని ఈ ముస్లిం దేశాలతో మనకున్న బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలు. సౌదీ, కువైట్, ఖతర్, ఒమన్ తదితర దేశాల్లో భారతీయులు చాలా ఎక్కువగా ఉంటారు. యూఏఈ జనాభాలోనైతే 30 శాతం దాకా భారతీయులే. మొత్తమ్మీద ఈ ముస్లిం దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల సంఖ్య ఏకంగా 87 లక్షలని అంచనా. వీరిలో కార్మికులే అత్యధికంగా ఉంటారు. తాజా వివాదం నేపథ్యంలో వారి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే మొత్తాలు (రెమిటెన్సులు) దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయి. 2021లో భారత్‌కు 87 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు అందాయి. అంటే రూ.6.76 లక్షల కోట్ల పై చిలుకే! దేశ జీడీపీలో ఇది ఏకంగా 3.1 శాతం! ఇంతటి కీలకమైన ఈ రెమిటెన్సుల్లో అమెరికా తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఒమన్ దేశాల నుంచే అత్యధికంగా వస్తున్నాయి. దాంతో రెమిటెన్సుల్లో భారత్ ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉంది. కీలక గల్ఫ్ దేశాలతో కూడిన గల్ఫ్ కో ఆపరేటివ్ కౌన్సిల్(జీసీసీ)తో 2020–21లో భారత్ 87 మిలియన్ డాలర్ల మేరకు వాణిజ్యం జరిపింది. మన వర్తక భాగస్వాముల్లో యూఈఏ మూడో, సౌదీ నాలుగో స్థానంలో ఉన్నాయి. యూఏఈతో ఇటీవలే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమూ కుదిరింది. చదవండి: గూగుల్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా కోర్టు గల్ఫ్ దేశాలతో బంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దును స్వాగతించిన తొలి దేశాల్లో యూఏఈ ఉంది. ఇరాక్, సౌదీ, యూఏఈ తదితర గల్ఫ్ దేశాల నుంచి మనం భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నాం. యుద్ధం వల్ల రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతున్నందున గల్ఫ్ దేశాలపై ఆధారపడటం మరింతగా పెరిగేలా కన్పిస్తోంది. మనతో వర్తకం ద్వారా సమకూరే ఆదాయం గల్ఫ్ దేశాలకూ కీలకమే. పైగా వాటి కార్మిక శక్తిలో భారతీయులు కీలకంగా ఉన్నారు. వీటికి తోడు చాలా గల్ఫ్ దేశాల ఆహార అవసరాలను భారతే తీరుస్తోంది. ఈ జాబితాలో బియ్యం, మాంసం, సుగంధద్రవ్యాలు, పళ్లు, కూరగాయలు, చక్కెర వంటివెన్నో ఉన్నాయి. కువైట్ ఏకంగా 90 శాతం ఆహార పదార్థాలను భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది! -
మానవ మనుగడ మొక్కలోనే
చెట్లు (అడవులు) అనంతమైన దైవకారుణ్యానికి, ఆయన మహత్తుకు తిరుగులేని నిదర్శనాలు. మన జీవితాలకు, అడవులకు అవినాభావ సంబంధం ఉంది. మానవ మనుగడ, సమస్త ప్రాణికోటి మనుగడ అడవుల సంరక్షణపైనే ఆధారపడి ఉంది. అడవుల్ని సంరక్షించుకోక పోతే ప్రకృతి అసమతౌల్యానికి గురవుతుంది. అల్లకల్లోలం ప్రారంభమవుతుంది. అతివృష్టి, అనావృష్టి సమస్యలు తలెత్తుతాయి.దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. భవిష్యత్తు అంధకారమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమాదఘంటిక ఇప్పటికే మోగింది. తక్షణంమేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ముహమ్మద్ ప్రవక్త వారు మొక్కల పెంపకం, అడవుల సంరక్షణ దిశగా ప్రజల్ని ఎంతగానో ప్రోత్సహించారు. చెట్లను నరకడం వల్ల జరిగే అనర్ధాలు, నష్టాలను గురించి ప్రజలను రకరకాలుగా హెచ్చరించారు. వాటిని సంరక్షించడంవల్ల ఒనగూడే ప్రయోజనాలను అత్యంత మనోహరంగా వివరించారు. చెట్టునాటడం అత్యుత్తమ దానం(సదఖా)అని ఆయన ప్రవచించారు. మొక్కలు నాటడం వల్ల మానవాళికి అనంతమైన లాభాలు, శుభశ్రేయాలు కలుగుతాయని చెప్పారు. ఆయన స్వయంగా మదీనా లోని హజ్రత్ సల్మాన్ ఫార్శీ (ర) గారి తోటలో మొక్కలు నాటి చెట్ల పెంపకం ప్రాధాన్యతను జనావళికి చాటి చెప్పారు. వృక్షాలు మానవులకు జననం నుంచి, మరణం వరకు తోడూనీడగా ఉంటాయని, వాటిని నాశనం చేయడమంటే, మానవుడు స్వయంగా చేజేతులా వినాశనం కొని తెచ్చుకోవడమేనని ప్రవక్తమహనీయులు బోధించారు. ఎవరైతే ఒక మొక్కను నాటి, అది పెరిగి పెద్దయ్యేవరకు దాన్ని సంరక్షిస్తారో, వారుచేసిన ఈ సత్కార్యానికి ప్రతిఫలంగా అల్లాహ్ స్వర్గంలో వారికోసం ఒక చెట్టును నాటుతాడని కూడా ఆయన సెలవిచ్చారు. స్వర్గంలో అందమైన వనాలు, మధురమైన పళ్ళు, ఫలాలు ఉంటాయన్న వర్ణనలు పవిత్రఖురాన్ లో అనేకంఉన్నాయి. కనుక మానవ మనుగడకు ఇతోథికంగా తోడ్పడుతున్న చెట్లను, వృ క్షసంపదను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా తాత్కాలిక ప్రయోజనాలకోసం వృక్షవిధ్వంసానికి పాల్పడుతూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే భవిష్యత్తు అంధకారమౌతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
హైదరాబాద్ : మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా కూడా ఆయన ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ శాంతి, సంతోషం, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. శాంతి సామరస్యాలతో, సోదర భావంతో మెలగాలని ప్రవక్త సందేశమిచ్చారని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముస్లింలు సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటున్నారు. Milad-un-Nabi greetings to all my brethren. Wishing you, your family and loved ones, peace, happiness and prosperity on this pious occasion — YS Jagan Mohan Reddy (@ysjagan) 12 December 2016