ముల్కలపల్లి టు ఆఫ్రికా
పేదల కడుపు నింపే బియ్యం అక్రమార్గాన విదేశీ బాట పడుతోంది. కిలో రూపాయి బియ్యానికి ‘సన్నని’ మెరుగులు దిద్ది జిల్లా సరిహద్దులు దాటించి విదేశాలకు తరలిస్తున్నారు. ఇందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఓ ముఠానే ఏర్పడడం గమనార్హం. డీలర్లు, ఈ బియ్యం రుచించని లబ్ధిదారుల వద్ద .. ఈ ముఠా కొనుగోలు చేసి ఏకంగా లారీల్లో పాలిషింగ్‌కు నల్లగొండ, వరంగల్ జిల్లాలకు తరలిస్తోంది. ఇక్కడ పాలిషింగ్ చేసి కాకినాడ పోర్టుకు.. అక్కడి నుంచి ఆఫ్రికన్ దేశాలకు అమ్మకం పెడుతున్నారు. రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యూన్ని జిల్లాలోనూ సన్న బియ్యంలో కలిపి అమ్ముతున్నారు.
ఖమ్మం: జిల్లాకు ప్రతినెల రేషన్ బియ్యం 14 వేల టన్నులు సరఫరా అవుతుంది. రేషన్ అర్హత ఉన్న లబ్ధిదారులు, హాస్టళ్లకు వీటిని పంపిణీ చేస్తున్నారు. ప్రతినెల పలు చోట్ల రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తూ అక్రమార్కులు దొరి కిన ఘటనలు కోకొల్లలు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశామని సంబంధిత అధికారులు ఎప్పుడూ చెబుతున్నా రేష న్ బియ్యం మాత్రం పక్కదారి పట్టే పరంపరంకు బ్రేక్ పడ డం లేదు. గతంలో కొంతమంది డీలర్లు ఈ బియ్యాన్ని అమ్మకానికి పెట్టి సస్పెండ్ అయ్యారు. అయినా కొంత మంది ఇదే మార్గం కాసులు కురిపిస్తుండడంతో గుట్టుచప్పుడు కాకుండా అమ్మకానికి పెడుతూనే ఉన్నారు.
ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 19 రేషన్ దుకాణాలపై కేసులు నమోదు చేయడం ఇం దుకు నిదర్శనం. ఈ ఏడాది ప్రారంభం నుంచి మే 15 వరకు జిల్లా వ్యాప్తంగా 139 కేసులు నమోదయ్యాయి. రూ.12.30 లక్షల విలువ చేసే ప్రజా పంపిణీ సరుకులను అధికారుల దాడిలో స్వాధీనం చేసుకున్నారు. ఇంత మొత్తంలో పట్టుబడుతున్నా అధికారులు మాత్రం నామ మత్రపు కేసులు పెడుతుండడంతో ఈ మర్గాన్నే ఎంచుకున్న ఓ ముఠా జిల్లాలో యథేచ్ఛగా ఈ దందాను కొనసాగిస్తోంది.
కోదాడ, డోర్నకల్.. జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం సేకరించడానికి బైక్‌లు, ఆటోలతో కూడిన ఓ ముఠా ఏర్పాటు అయింది. రేషన్ డీలర్ల వద్ద మిగిలిన బియ్యంతో పాటు అమ్మకానికి పెడుతున్న కొంతమంది లబ్ధిదారుల నుంచి ఈ ముఠా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తుంది. కేజీ రూపాయి బియ్యానికి రూ.8 నుంచి రూ.10 వరకు వీరి నుంచి కొనుగోలు చేస్తారు. ఇవన్నీ 25 కేజీలు, 50 కేజీల బ్యాగులుగా చేసి ఆటోలు, లారీల్లో రీసైక్లిం గ్‌కు తరలిస్తారు. జిల్లాలోని ముల్కలపల్లి కేంద్రంగా ఎక్కువగా ఇలా బియ్యం రీసైక్లింగ్ అవుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఉంది. అలాగే జిల్లా సరిహద్దున ఉన్న నల్లగొండ జిల్లా కోదాడ, వరంగల్ జిల్లా డోర్నకల్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగయ్యపేటకు వీటిని తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లు రీసైక్లింగ్ చేసి ఏకంగా సన్నం బియ్యంలో మిక్స్ చేసి రూ.35 నుంచి రూ.40 వరకు అమ్ముతూ అక్రమ దందాకు తెరలేపారు.
నిఘా లేకపోవడంతోనే..
జిల్లాలో రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యం విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నారంటే.. ప్రజా పంపిణీ వ్యవస్థ నిఘా కొరవడడమేనన్న ఆరోపణలున్నాయి. జిల్లా నుంచి ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ ఎస్పీ పేర్కొనడం గమనార్హం. అధికారుల కన్నుగప్పి భారీ ఎత్తున రేషన్ బియ్యం ఇలా సరిహద్దులు దాటి పోతుందనే ఆరోపణలున్నాయి.
అంతేకాకుండా కొంతమంది మిల్లర్లు కూడా ఈ బియ్యా న్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి లేవీ పెడుతున్నట్లు సమాచారం. జిల్లా సరిహద్దులో నిఘా పటిష్టంగా లేకపోవడంతో ఓ ముఠా రేషన్ బియ్యం దందాను జోరుగా కొనసాగిస్తోంది. సరిహద్దులో వ్యవసాయ శాఖ చెక్‌పోస్టులు ఉన్నా నామ మాత్రంగా తనిఖీల వల్ల రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతోంది. ప్రధానంగా టాస్క్ఫోర్స బృందం లేకపోవడం రేషన్ అక్రమార్గం పట్టడానికి కారణమవుతోంది. డీలర్లు ఎంత బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశారు..? మిగిలినది ఎంత..? మిల్లర్లు లేవీకి ఏ బియ్యం పెడుతున్నారు..? తదితర కోణాల్లో అధికారుల పర్యవేక్షణ చేయకపోవడంతోనే బియ్యం పక్కదారి పడుతోందంటున్నారు.
నామ మాత్రంగా కేసులు..
రేషన్ పట్టుబడిన విషయంలో అధికారులు ఇప్పటి వరకు నామ మాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో కొన్నాళ్లకే బెయిల్ తెచ్చుకొని నిందితులు మళ్లీ రేషన్ బియ్యం దందా చేస్తున్నారు.కాగా గురువారం ఖమ్మంలో .. కొణిజర్ల నుంచి కోదాడ తరలిస్తున్న 120 క్వింటాళ్ల బియ్యాన్ని సివిల్ సప్లయ్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇలా తరలిస్తున్న ముఠా సభ్యులపై గతంలో పల్లుమార్లు రేషన్ బియ్యం అక్రమార్గం పట్టించడంపై కేసులు నమోదయ్యాయి. అయితే రేషన్ బియ్యం పట్టుబడిన విషయంలో తొలిసారిగా అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈసీ యాక్టు 1955 సెక్షన్ 7,8 కింద వీరిపై కేసులు పెట్టారు. క్రిమినల్ కేసులతో కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్నా ప్రజా పంపిణీ వ్యవస్థలో నిఘాను పటిష్టం చేయాల్సి ఉంది.