మల్టీ స్పెషాలిటీ ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించండి
హిందూపురం అర్బన్: హిందూపురం ప్రాంతంలో వివిధ పరిశ్రమల్లో పని చేసే 25 వేల మంది కార్మికులకు అనుగుణంగా 30 పడకల మల్టీ స్పెషాలిటీ ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేసి మెరుగైన వైద్యసేవలు అందించాలని బీజేపీ నాయకులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కోరారు. ఈమేరకు శుక్రవారం ఆ పార్టీ హిందూపురం నాయకులు హైదరాబాద్‌లో కేంద్రమంత్రి దత్తాత్రేయను కలిసి వినతిపత్రం అందజేశారు. హిందూపురంలో 24,500 మంది కార్మికులకు ఈఎస్ఐ కార్డులు ఉన్నా వారికి ఇన్‌పేషెంట్ సౌకర్యం లేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న డిస్పెన్సరీలో ప్రతిరోజు 300 మంది వైద్యసేవలు పొందుతున్నా అవసరమైన వైద్యులు కరువయ్యారని తెలిపారు. కొట్నూరు, హిందూపురం డిస్పెన్షరీలు ఒకే అద్దెభవనంలో కొనసాగుతున్నాయని వివరించారు. ఇందుకు మంత్రి దత్తాత్రేయ సానూకులంగా స్పందించి త్వరలోనే హిందూపురం సందర్శించి ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు రమేష్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారధి, జిల్లా కార్యదర్శి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.