అప్పుడలా ఇప్పుడిలా...
హరితం మాయం.. పెరుగుతున్న వేసవి తాపం కాంక్రీట్ మహారణ్యంలా నగరం...కనిపించని చల్లదనం ఒకప్పుడు ఎటు చూసినా పచ్చదనం... నీటితో కళకళలాడే తటాకాలు... మన ‘భాగ్’ (తోటల) నగరం సొంతం. భానుడు ఉగ్రరూపం దాల్చకుండా... మొక్కలు... చెట్లు అడ్డుకునేవి. మనకు ఆసరానిచ్చేవి. మనసుకు హాయినిచ్చేవి. కాలక్రమంలో హరితవనాలు మాయమైపోయాయి. బహుళ అంతస్తుల భవనాలు... ఫ్యాక్టరీలు.. వాహనాల కాలుష్యం... వేల చేతులతో నగరాన్ని బంధించాయి. వేసవి వస్తే మంటలు సృష్టిస్తున్నాయి. సూర్యుడికే చెమటలు పుట్టిస్తున్నాయి.
సిటీబ్యూరో: దక్కన్ నేలపై అన్ని కాలాల్లోనూ ఆహ్లాదం కలిగించే సమశీతోష్ణ వాతావరణం... విశిష్ట భౌగోళిక పరిస్థితులు.. వరదలు, భూ కంపాలు, సునామీ వంటి విపత్తులకు అవకాశం లేని ‘భాగ్య’నగరం మనది. నాటి కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీ నవాబులు మొదలు.. అమెరికా అధ్యక్షులు.. విఖ్యాత కంపెనీల సీఈఓల మనసు దోచుకుందీ సిటీ. శతాబ్దాలుగా భాగ్ (తోటల) నగరంగా విలసిల్లిన భాగ్యనగర ఆహ్లాదకర వాతావరణానికి ఎందరో జేజేలు పలికారు. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో హరిత వాతావరణం లేకపోవడంతో ప్రస్తుత వేసవిలో ఎండ వేడిమికి నగర వాసులు అల్లాడుతున్నారు. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులతో నగరం కాంక్రీట్ మహారణ్యంలా మారింది. హరితం కనుమరుగైనగరం త్వరగా వేడెక్కుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ (హరిత వాతావరణం) ఉండాలి. కానీ 8 శాతమే ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు సొమ్మసిల్లేలా చేస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమశీతోష్ణ స్థితికి కారణాలివే...
దక్కన్ పీఠభూమి సముద్ర మట్టానికి సుమారు 536 అడుగుల ఎత్తులో ఉండడంతో ఇక్కడి భౌగోళిక అనుకూలతలు విదేశీ కంపెనీలు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వేసవిలో ఉదయం, సాయంత్రం పొడి వాతావరణం.. మధ్యాహ్నం ఎండ వేడిమి తీవ్రంగా బాధించినా.. రాత్రి వేళ చల్లటి నిర్మలమైన వాతావరణం హైదరాబాద్ ప్రత్యేకత. గాలిలో ఆర్థ్రత (తేమ అధికంగాలేని) లేని ఆహ్లాద వాతావరణం ఉబ్బసం వ్యాధిగ్రస్తులకూ ఉపశమనం కలిగిస్తుందన్న నానుడి ఉంది. అక్టోబరు-ఫిబ్రవరి నెలల్లో సిటీలో 30 నుంచి 36 డిగ్రీల లోపునే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 39 నుంచి 43 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
అధికంగా చలి, వేడి, వర్షం లేని సమశీతోష్ణ వాతావరణం ఈ నగరసొంతం. దీంతో ఏ కాలంలో సందర్శించినా ఇక్కడి వాతావరణం పర్యాటకులను కట్టి పడేస్తోంది. కానీ ఇలాంటి వాతావరణాన్ని మనమే చేజేతులా దూరం చేసుకుంటున్నాం. శరవేగంగా రహదారుల విస్తరణ, బహుళ అంతస్తుల భవంతులు, వాణిజ్య సముదాయాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా.. హరిత తోరణం(గ్రీన్‌బెల్ట్) అదే స్థాయిలో పెరగకపోవడం శాపంగా పరిణమిస్తోంది. మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల ఉద్గారాలు పెరిగి సిటీలో వేసవి తాపం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఈ ప్రాంతాల్లో హరిత వనాలు
నగరంలో సుమారు 1200 ఎకరాల్లో విస్తరించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం.. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం... గచ్చిబౌలిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం... కేబీఆర్ పార్క్... బొటానికల్ గార్డెన్, జూ పార్క్, వనస్థలిపురం డీర్‌పార్క్ తదితర ప్రాంతాల్లో హరిత తోరణం ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో వేసవితాపం అంతగా పెరగకపోవడం విశేషం.
ఏప్రిల్, మే నెలల్లో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదైనప్పటికీ ఆప్రాంతాల్లో నాలుగు డిగ్రీలు తక్కువగా.. అంటే 36 డిగ్రీల మేర మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం. అక్కడ నివసించే వారు వేసవి తాపానికి అంతగా గురికారని... దీనికిహరిత తోరణమే కారణమని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. చెట్లు ఉష్ణోగ్రతలను నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేర తగ్గిస్తాయని చెబుతున్నారు.
పచ్చదనం కనుమరుగు
డెబ్భయ్యవ దశకం వరకు పెద్ద చెట్లు, తోటలతో అలరారిన భాగ్యనగరంలో రహదారుల విస్తరణ, మెట్రో పనులు, బహుళ అంతస్తుల భవంతులు, నూతన కాలనీల ఏర్పాటుకు భారీగా చెట్లను నరికి వేస్తుండడంతో హరితం కనుమరుగవుతోంది. నగర విస్తీర్ణంలో 30 శాతం హరిత వాతావరణం ఉంటేనే వాయు కాలుష్యం, వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రొఫెసర్ జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త
పరిష్కారాలివే..
నగరంలో మిగిలి ఉన్న చెరువుల చుట్టూ పెద్ద మొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్న వారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని... ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. నూతన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.
పర్యావరణ పరిరక్షణలో మనం సైతం..
నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించేందుకు సిటీజన్లుగా మనం పాటించాల్సిన కొన్ని చిట్కాలు.. చెట్ల ఆకులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. చెట్లు ఎయిర్ ఫిల్టర్లుగా పని చేస్తాయని అందరూ గ్రహించాలి. చెట్లు చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా విద్యుత్ వంటి ఇంధనాన్ని ఆదా చేస్తాయి. కాలుష్య ఉద్గారాలను బాగా తగ్గిస్తాయి. ఇళ్లపై సోలార్‌పవర్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లఆవరణలో విధిగా మొక్కలు నాటాలి.వాహనాల్లో ఉదయం, సాయంత్ర వేళల్లోనే పెట్రోలు లేదా డీజిల్ నింపాలి. ఇంధనం ఆవిరి కాకుండా చూడాలి. వాహనాలను నీడలోనే పార్క్ చే ద్దాం.
మస్కిటో రిపెల్లెంట్ల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి. {sాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలను ఆఫ్ చేసి ఇంధనాన్ని ఆదా చేద్దాం. బయటికి వెళ్లేటపుడు మాస్క్ ధరించి ధూళి కాలుష్యం నుంచి విముక్తి పొందండి. ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేసేవారు కార్‌పూలింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేసుకొని ఒకే కారులో ప్రయాణించండి. ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ గృహోపకరణాలనే కొనుగోలు చేయండి. తక్కువ కాలుష్యం వెదజల్లే మోటారు వాహనాలనే కొనుగోలు చేయండి. 15 ఏళ్లకు పైబడిన వాహనాలను వినియోగించవద్దు. ప్లాస్టిక్ వాడకాన్ని బాగా తగ్గించండి. పేపరు బ్యాగులను వినియోగించండి. రీచార్జబుల్ బ్యాటరీలనే వినియోగించండి.