Multipurpose Health Assistants
-
ఆత్మహత్యలే శరణ్యం
సాక్షి, అమరావతి: ‘మేం 22 ఏళ్లుగా పనిచేస్తున్నాం. దాదాపు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాం. కోర్టు తీర్పు అమలుకు గడువు ఉన్నా కనీసం ప్రత్యామ్నాయం చూపకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా మమ్మల్ని ఆగమేఘాల మీద రోడ్డుపాలు చేసింది. ఈ వయసులో ఎక్కడికి వెళ్లగలం... కుటుంబాలను ఎలా పోషించుకోగలం... ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యం...’ అంటూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (ఎంపీహెచ్ఏ) మేల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎంపీహెచ్ఏ నియామకాల్లో విద్యార్హతల వివాదంపై తెలంగాణ హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా 982 మందిని ప్రభుత్వం ఇటీవల విధుల నుంచి తొలగించింది. తీర్పు అమలుకు మూడు నెలలు సమయం ఉన్నా వారం రోజుల వ్యవధిలోనే తమను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీహెచ్ఏలు మండిపడుతున్నారు. హైకోర్టు తీర్పు పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని, అయితే అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కానీ, రెండు దశాబ్దాలకు పైగా ప్రజలకు సేవలు అందించామన్న సానుభూతి చూపించకుండా కూటమి ప్రభుత్వం తొలగించిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.రెండేళ్లలో రిటైర్ కావాల్సి ఉందినా వయసు 58 ఏళ్లు. రెండేళ్లలో రిటైర్ అవ్వాలి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం నుంచి అక్రమంగా తొలగించారు. నాపై ఆధారపడి పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులున్నారు. ఈ వయసులో మమ్మల్ని రోడ్డున పడేస్తే మేం ఏం చేయాలి. నాలాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. లేదంటే మా అందరికీ ఆత్మహత్యలే శరణ్యం. – జీవీవీ ప్రసాద్, రాష్ట్ర కన్వీనర్, ఏపీ పారా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్జీవితం తలకిందులైందినా వయసు 48 ఏళ్లు. మా అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు. ఉన్నపళంగా రోడ్డునపడేశారు. జీవితం అగమ్యగోచరంగా మారింది. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు. వచ్చే అరకొర వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ నా కుమారుడిని చదివించుకుంటూ నెట్టుకొస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం నుంచి తొలగించడంతో జీవితం తలకిందులైంది. ఈ వయసులో మేం బయట ఏ ఉద్యోగాలకు వెళ్లగలం. ప్రభుత్వం తీరు బాధాకరం. – బి.వెంకటరత్నం, ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లాకోర్టు ఆదేశాల మేరకే: ఎంటీ కృష్ణబాబుతెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకే ఎంపీహెచ్ఏ (మేల్)లను విధుల నుంచి తొలగించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఒరిజినల్ నోటిఫికేషన్లో రాష్ట్రవ్యాప్తంగా 1,378 ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అయితే జీవో నంబర్ 1,207, కోర్టు ఆదేశాల పేరిట 1,832 మంది అదనంగా విధుల్లో చేరారని తెలిపారు. ఈ నియామకాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని కోర్టు స్పష్టం చేసిందన్నారు. అంతేకాకుండా ఎస్ఎస్సీ విద్యార్హతతో మెరిట్ ఆధారంగా నోటిఫై చేసిన పోస్టులను భర్తీ చేయాలని తీర్పులో పేర్కొన్నారని వివరించారు.ఈ నియామకాలకు సంబంధించి ఇప్పటికే 299 రిట్ పిటిషన్లు, కోర్టుధిక్కరణ కేసులు నమోదు కాగా, ఒక డీఎంహెచ్‌వోకు జైలు శిక్ష విధించడంతోపాటు ఐఏఎస్ అధికారులకు జరిమానాలను కూడా కోర్టు విధించిందని తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటికీ రోజూ కోర్టులో కేసులు పడుతున్న క్రమంలో వివాదానికి పుల్‌స్టాప్ పెట్టడం కోసం తెలంగాణ హైకోర్టు తీర్పును అమలు చేస్తూ 982 మంది ఎంపీహెచ్ఏలను తొలగించామని చెప్పారు. తెలంగాణలో కోర్టు కేసుల బెడద లేదని, అందుకే అక్కడ వేగంగా కోర్టు తీర్పు అమలు చేయలేదన్నారు. ఈ అంశంపై భవిష్యత్‌లో సుప్రింకోర్టు తుది తీర్పును ఇస్తే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. -
రచ్చ..రచ్చేనా!
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల పోస్టింగ్ ఆర్డర్లు రద్దు నేడు డీఎంహెచ్ఓ కార్యాలయంలో రీ పోస్టింగ్‌కు కౌన్సెలింగ్ ఆందోళనకు సిద్ధమైన తొలగించిన అభ్యర్థులు అనంతపురం మెడికల్ : వైద్య, ఆరోగ్యశాఖలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు.. నియామకాల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోందా? ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా 24 మందిని తొలగించి.. వారి స్థానంలో కొత్తగా 24 మందిని విధుల్లోకి తీసుకున్న క్రమంలో కొన్నాళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడనుందా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అయితే ‘రచ్చ’ మాత్రం తప్పదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 156 ఎంపీహెచ్ఏ పోస్టుల నియామకాలకు 2003లో నోటిఫికేషన్ ఇచ్చారు. 152 పోస్టులు భర్తీ చేశారు. పదో తరగతి అర్హత ఉన్న 44 మందిని అప్పట్లోనే తొలగించి ఇంటర్ విద్యార్హతతో తీసుకున్నారు. అదే సమయంలో తొలగించిన 44 మందిని మళ్లీ తీసుకున్నారు. అప్పట్లో రూపొందించిన మెరిట్ లిస్ట్‌లో తమకు అన్యాయం జరిగిందని కొందరు కోర్టుకెళ్లగా.. గత ఏడాది సానుకూల తీర్పు వచ్చింది. అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను ఇక్కడి అధికారులు బేఖాతర్ చేశారు. పద్నాలుగేళ్లుగా పని చేస్తున్న 24 మందిని తొలగించి గత ఏడాది డిసెంబర్ 13ఽన కొత్తగా 24 మందికి రాత్రికి రాత్రే పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేశారు. కనీసం కౌన్సెలింగ్ కూడా చేయలేదు. ఈ క్రమంలో మెరిట్ ఉన్నా కొందరికి అన్యాయం జరిగింది. బీసీ–ఈ కేటగిరీ కింద ఇద్దరికి చోటు కల్పించడం వివాదాస్పదమైంది. కార్యాలయంలో పని చేసే ముగ్గురు అధికారులు ‘చేతివాటం’ చూపి పోస్టింగ్‌లలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో కలెక్టర్ కోన శశిధర్ స్పందించారు. నియామకాలకు సంబంధించిన ఫైల్‌ను రీరైట్ చేసి తీసుకురావాలని ఆదేశించడంతో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఈ ప్రక్రియను ముగించారు. ఈ నెల 8న కలెక్టర్‌కు నోట్‌ఫైల్ పెట్టారు. ఈ నేపథ్యంలో కొత్తగా విధుల్లో చేరిన 24 మంది పోస్టింగ్ ఆర్డర్లు రద్దు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై సోమవారం ఈ–మెయిల్ ద్వారా సదరు అభ్యర్థులు పని చేస్తున్న పీహెచ్‌సీలకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ నెల 10న (నేడు) డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని పేర్కొన్నారు. ఎంపీహెచ్ఏలను రిలీవ్ చేయాలని ఆదేశాలు రావడంతో మెడికల్ ఆఫీసర్లు అందరినీ రిలీవ్ చేశారు. ‘బీసీ–ఈ’పై తెగని పంచాయితీ 2003లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేపట్టాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. 2003 నాటికి బీసీ–ఈ రిజర్వేషన్ లేకపోయినా ఇప్పుడు పోస్టులు దక్కించుకున్న వారిలో ఇద్దరు ఆ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. తాజాగా రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని చెబుతుండడంతో ఈ జాబితాలో బీసీ–ఈలను తొలగిస్తారా, లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు సిద్ధం! రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో విధుల నుంచి తొలగించబడిన 24 మంది అభ్యర్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సోమవారం విజయవాడలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అరుణకుమారిని కలిసిన అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని కోరారు. రీ పోస్టింగ్ ఇస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో ‘కొత్త వ్యూహం’ తెరపైకి వస్తోంది. ప్రస్తుతం ‘పోస్టింగ్ ఆర్డర్లు’ రద్దయిన దృష్ట్యా కౌన్సెలింగ్‌ను అడ్డుకుని తిరిగి విధుల్లో చేరేలా ప్రణాళిక రచిస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన వారు మళ్లీ విధుల్లో చేరిపోతే.. కొత్తగా చేరి పోస్టింగ్ ఆర్డర్లు రద్దయిన వాళ్ల గురించి మళ్లీ ఆలోచించవచ్చన్న ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు రానున్నట్లు తెలిసింది.