ఆగమేఘాల మీద మా కుటుంబాలను రోడ్డున పడేసిన చంద్రబాబు ప్రభుత్వం
22 ఏళ్లు సేవలు అందించామన్న కనికరం కూడా చూపలేదు
ప్రత్యామ్నాయం కూడా చూపకుండా నిర్దయగా ఉద్యోగాల నుంచి తొలగించారు
తీర్పు అమలుకు మూడు నెలలు సమయం ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
అయినా వారంలోనే 982 మంది ఎంపీహెచ్‌ఏలను తొలగించిన ఏపీ ప్రభుత్వం
తెలంగాణలో ఇప్పటి వరకు ఆ తీర్పు అమలుపై దృష్టిపెట్టని ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ఎంపీహెచ్‌ఏలు
సాక్షి, అమరావతి: ‘మేం 22 ఏళ్లుగా పనిచేస్తున్నాం. దాదాపు రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నాం. కోర్టు తీర్పు అమలుకు గడువు ఉన్నా కనీసం ప్రత్యామ్నాయం చూపకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా మమ్మల్ని ఆగమేఘాల మీద రోడ్డుపాలు చేసింది. ఈ వయసులో ఎక్కడికి వెళ్లగలం... కుటుంబాలను ఎలా పోషించుకోగలం... ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యం...’ అంటూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (ఎంపీహెచ్‌ఏ) మేల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీహెచ్‌ఏ నియామకాల్లో విద్యార్హతల వివాదంపై తెలంగాణ హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా 982 మందిని ప్రభుత్వం ఇటీవల విధుల నుంచి తొలగించింది. తీర్పు అమలుకు మూడు నెలలు సమయం ఉన్నా వారం రోజుల వ్యవధిలోనే తమను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీహెచ్‌ఏలు మండిపడుతున్నారు. హైకోర్టు తీర్పు పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని, అయితే అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కానీ, రెండు దశాబ్దాలకు పైగా ప్రజలకు సేవలు అందించామన్న సానుభూతి చూపించకుండా కూటమి ప్రభుత్వం తొలగించిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రెండేళ్లలో రిటైర్ కావాల్సి ఉంది
నా వయసు 58 ఏళ్లు. రెండేళ్లలో రిటైర్ అవ్వాలి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం నుంచి అక్రమంగా తొలగించారు. నాపై ఆధారపడి పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులున్నారు. ఈ వయసులో మమ్మల్ని రోడ్డున పడేస్తే మేం ఏం చేయాలి. నాలాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. లేదంటే మా అందరికీ ఆత్మహత్యలే శరణ్యం. – జీవీవీ ప్రసాద్, రాష్ట్ర కన్వీనర్, ఏపీ పారా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్
జీవితం తలకిందులైంది
నా వయసు 48 ఏళ్లు. మా అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు. ఉన్నపళంగా రోడ్డునపడేశారు. జీవితం అగమ్యగోచరంగా మారింది. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు. వచ్చే అరకొర వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ నా కుమారుడిని చదివించుకుంటూ నెట్టుకొస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం నుంచి తొలగించడంతో జీవితం తలకిందులైంది. ఈ వయసులో మేం బయట ఏ ఉద్యోగాలకు వెళ్లగలం. ప్రభుత్వం తీరు బాధాకరం. – బి.వెంకటరత్నం, ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లా
కోర్టు ఆదేశాల మేరకే: ఎంటీ కృష్ణబాబు
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకే ఎంపీహెచ్‌ఏ (మేల్)లను విధుల నుంచి తొలగించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఒరిజినల్ నోటిఫికేషన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,378 ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అయితే జీవో నంబర్ 1,207, కోర్టు ఆదేశాల పేరిట 1,832 మంది అదనంగా విధుల్లో చేరారని తెలిపారు. ఈ నియామకాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని కోర్టు స్పష్టం చేసిందన్నారు. అంతేకాకుండా ఎస్‌ఎస్‌సీ విద్యార్హతతో మెరిట్ ఆధారంగా నోటిఫై చేసిన పోస్టులను భర్తీ చేయాలని తీర్పులో పేర్కొన్నారని వివరించారు.
ఈ నియామకాలకు సంబంధించి ఇప్పటికే 299 రిట్ పిటిషన్లు, కోర్టుధిక్కరణ కేసులు నమోదు కాగా, ఒక డీఎంహెచ్‌వోకు జైలు శిక్ష విధించడంతోపాటు ఐఏఎస్ అధికారులకు జరిమానాలను కూడా కోర్టు విధించిందని తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటికీ రోజూ కోర్టులో కేసులు పడుతున్న క్రమంలో వివాదానికి పుల్‌స్టాప్ పెట్టడం కోసం తెలంగాణ హైకోర్టు తీర్పును అమలు చేస్తూ 982 మంది ఎంపీహెచ్‌ఏలను తొలగించామని చెప్పారు. తెలంగాణలో కోర్టు కేసుల బెడద లేదని, అందుకే అక్కడ వేగంగా కోర్టు తీర్పు అమలు చేయలేదన్నారు. ఈ అంశంపై భవిష్యత్‌లో సుప్రింకోర్టు తుది తీర్పును ఇస్తే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment