ప్రాణ స్నేహితులు బలయ్యారు
ముంబయి: వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరికి 21, మరొకరికి 22 సంవత్సరాల వయసు. ఇద్దరూ కూడా బాంద్రాలోని రిజ్వీ కాలేజీలో చదువుతున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కాండ్విలి వద్ద ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇంకా చెప్పాలంటే, ఆ ప్రమాదంకంటే దాని బారిన పడిన వారిని ఎవరూ గుర్తించని కారణంగా ప్రాణాలుకోల్పోయారు. మానవత్వం వారి దరిదాపులకు వెళ్లని కారణంగా మృత్యువాతపడ్డారు. ప్రమాదం సమయంలో ఏ ఒక్కరు స్పందించినా బహుశా ఆ ఇద్దరు ప్రాణాలతో బతికుండేవారు. ఈ విషయం స్వయంగా పోలీసులే చెప్పారు.
ఆ రోడ్డుపై నడుస్తూ వెళ్లే వారుగానీ బైక్‌లపై, కారుపై వెళ్లేవారుగానీ కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. తమపై ఆ ఘటనకు బాధ్యత పడుతుందేమోనన్న భయంతో ఎవరూ ముందుకురాకపోవడంతో ఆ ఇద్దరు ప్రాణాలుకోల్పోవాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. నిత్యం బిజీగా ఉండే రోడ్డులో సోమవారం సమతానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బీట్ మార్షల్స్ కాండ్విలి వైపు వెళుతుండగా ప్రమాదానికి గురై పడి ఉన్న సాద్ తీరందాజ్, బిలాల్ అన్సారీ అనే ఇద్దరిని గుర్తించారు.
వీరిది మీరా రోడ్డులోని కనాకియా రెసిడెన్సీ ప్రాంతంలో బిలాల్ రిజ్వీ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తుండగా.. సాద్ అదే కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇస్తూ రోడ్డు ప్రమాదం, ఎప్పుడు ఎలా జరిగిందో తెలియడం లేదని, ఏ ఒక్కరూ దానికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదని, సాద్ అక్కడికక్కడే చనిపోగా బిలాల్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని అన్నారు. తాము సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.