Mumbai photojournalist
-
ముంబై గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు మైనర్?
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నడిబొడ్డున ఓ మీడియా ప్రతినిధిపై జరిగిన సామూహిక హత్యాచారం కేసులో నిందితులుగా పేర్కొన్న ఐదుగురిలో ప్రధాన నిందితుడు మైనర్ అనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాన్ని నిందితుడి కుటుంబసభ్యులు మీడియా ముందు వెల్లడించారు. నిందితుడు `చాంద్ బాబు సత్తార్ షేక్ అలియాస్ మహ్మద్ అబ్దుల్` అమ్మమ్మ సర్నాబాయ్ అతడిని మైనర్ గా పేర్కొంటూ జనన ధృవీకరణ పత్రాన్ని మీడియాకు సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే జనన ధృవీకరణ పత్రంలో అతని వయసు 1997 ఫిబ్రవరి 26గా నమోదైంది. కానీ పోలీసులు మాత్రం చాంద్ వయసు 19 ఏళ్లుగా చెబుతున్నారు. కేవలం నిందితుడిని రక్షించడానికి కుటుంబసభ్యులు తప్పుడు ధృవపత్రం సమర్పించారని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఆమె తమ మనవుడు మంచివాడని, అతనికి 16ఏళ్లే ఉంటాయని చెబుతోంది. దీనికి సంబంధించి తాను ఈ ధృవీకరణ పత్రాన్ని కోర్టులోచూపిస్తానంటోంది. జనన ధృవీకరణ పత్రాన్ని దిద్దారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ముంబైలో ఓ ఇంగ్లిష్ మేగజైన్‌కు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై మహాలక్ష్మి, లోయర్పరెల్ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న శక్తిమిల్లు కాంపౌండ్‌లో ఐదుగురు యువకులు గురువారం సాయంత్రం సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు చాంద్ మేజర్ అత్యాచారం చేసినట్టు రుజువైతే ఏడేళ్ళ నుంచి యావజ్జీవ శిక్ష వరకు పడవచ్చు. -
ఫోటో జర్నలిస్టు అత్యాచారం కేసులో మరోకరు అరెస్ట్
దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో గురువారం ఫోటో జర్నలిస్టు(20) పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ శనివారం ఇక్కడ వెల్లడించారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయవలసి ఉందని తెలిపారు. వారి కోసం ముమ్మరం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందుకోసం పోలీసులు, క్రైం బ్రాంచ్‌కు చెందిన 20 బృందాలు సంయుక్తంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం మహాలక్ష్మీ పరిసర ప్రాంతంలో శక్తి మిల్ ప్రాంగణంలో విధి నిర్వహణలో భాగంగా ఆమె స్నేహితుడితో కలసి ఫోటో తీసుకుంటున్న మహిళ జర్నలిస్టును స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో మహిళ జర్నలిస్టు అసిస్టెంట్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అతడిని కట్టిపడేశారు. అనంతరం ఆ ఐదుగురు యువకులు ఆ మహిళ ఫోటో జర్నలిస్ట్ పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ మహిళ ప్రస్తుతం జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గతరాత్రి జస్లోక్ ఆసుపత్రిలో ఫోటో జర్నలిస్టును పరామర్శించారు. అనంతరం ఆయన ఆమె అరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోనే ఉన్న ఫోటో జర్నలిస్టు కుటుంబసభ్యులను కూడా సీఎం పరామర్శించారు.