దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో గురువారం ఫోటో జర్నలిస్టు(20) పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ శనివారం ఇక్కడ వెల్లడించారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయవలసి ఉందని తెలిపారు. వారి కోసం ముమ్మరం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందుకోసం పోలీసులు, క్రైం బ్రాంచ్కు చెందిన 20 బృందాలు సంయుక్తంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
గురువారం సాయంత్రం మహాలక్ష్మీ పరిసర ప్రాంతంలో శక్తి మిల్ ప్రాంగణంలో విధి నిర్వహణలో భాగంగా ఆమె స్నేహితుడితో కలసి ఫోటో తీసుకుంటున్న మహిళ జర్నలిస్టును స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో మహిళ జర్నలిస్టు అసిస్టెంట్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అతడిని కట్టిపడేశారు. అనంతరం ఆ ఐదుగురు యువకులు ఆ మహిళ ఫోటో జర్నలిస్ట్ పై సామూహిక అత్యాచారం చేశారు.
ఆ మహిళ ప్రస్తుతం జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గతరాత్రి జస్లోక్ ఆసుపత్రిలో ఫోటో జర్నలిస్టును పరామర్శించారు. అనంతరం ఆయన ఆమె అరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోనే ఉన్న ఫోటో జర్నలిస్టు కుటుంబసభ్యులను కూడా సీఎం పరామర్శించారు.