ఇది సూడాన్ గోకులం..
దక్షిణ సూడాన్.. నైలు నదీతీరం.. తెలవారింది.. ముండరీ తెగ నిద్రలేచింది.. పళ్లు తోముకున్నారు..తర్వాత గోమూత్రాన్ని నెత్తిన పోసుకున్నారు!! యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయనే కాదు. ఆవు అమ్మలాంటిది, తమను ఎలాంటి ఆపదనుంచైనా రక్షిస్తుందన్నది వారి నమ్మకం. నేరుగా పొదుగు నుంచి పాలు తాగారు.. ఢంకా మోగించారు.. పశువులను మేతకు తీసుకెళ్లే సమయమైంది అనడానికి సంకేతంగా.. ఇది సూడాన్ గోకులం..
ఆవుతోనే వీరికి రోజు మొదలవుతుంది. ఆవుతోనే ముగుస్తుంది. గోవులు.. ముండరీ తెగ బలం, గర్వం, ఆస్తి, ఆత్మాభిమానం. పశువులను వీరు తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. గోమూత్రంతో స్నానం చేస్తారు. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంతోపాటు వారి జుత్తు కూడా ఎర్రగా మారి ఎంతో అందంగా ఉంటుందట. అంతేకాదు పిడకలను కాల్చి, పొడి చేసి, టాల్కం పౌడర్లా ఒళ్లంతా రాసుకుంటారు. పశువులకూ రాస్తారు. యాంటీసెప్టిక్‌గా ఉండటంతోపాటు దోమల కాటు నుంచీ రక్షణ కల్పిస్తుందట. అటు ఎండల నుంచి కూడా కాపాడుతుందట.
ముండరీ తెగ ప్రజల జీవితాలు శతాబ్దాలుగా పశువులతో పెనవేసుకుపోయాయి. ఇక్కడి పశువులు ఎంతో బలంగా ఉంటాయి. వీటిని దొంగిలించుకుపోవడానికి దాడులూ జరుగుతుంటాయి. వీటిని కాపాడుకోవడానికి వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా పశువులను అమ్మరు. ఎందుకంటే.. వీరికి ఆవు అమ్మ.. ఆవే అన్నీనూ..