అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
తిరుపతి, న్యూస్‌లైన్: తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఈస్ట్ సీఐ గిరిధర్‌రావు నేతృత్వంలో ఎస్ఐలు అబ్బన్న, కృష్ణయ్య క్రైం పార్టీ పోలీసు సిబ్బంది శుక్రవారం ఆదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4 లక్షల విలువ చేసే 150 గ్రాముల బంగారు నగలు, రూ.17 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను హాజరుపరిచారు. సీఐ గిరిధర్‌రావు చెప్పిన వివరాల మేరకు..
మధ్యప్రదేశ్ రాష్ట్రం గిరిధర్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీనా, మున్నాసింగ్ బంధువులు. మీనా ఆగ్రా ప్రాంతంలో, మున్నాసింగ్ మధ్యప్రదేశ్‌లో ఉంటూ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతుండేవాడు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడడమేగాక ఆర్టీసి బస్టాండ్, బస్సుల్లో ప్రయాణికులకు చెందిన బ్యాగులను కత్తిరించుకుని తీసుకెళ్లేవారు.
ఈస్ట్ పీఎస్ పరిధిలో 9 చోరీలకు పాల్పడ్డారు. వారిద్దరూ రామానుజ సర్కిల్లో తచ్చాడుతుండగా ఆ మార్గంలో వెళుతున్న సీఐ గిరిధర్‌రావు, ఎస్ఐలు అబ్బన్న, కృష్ణయ్య, క్రైం పార్టీ సిబ్బంది శేఖర్, ప్రకాష్, శీను, రషీద్, దేవా, చిన్నా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో చోరీల విషయం బయటపడింది. వారు కాజేసిన బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
సిబ్బందిని అభినందించిన ఎస్పీ
అంతర్రాష్ట్ర నిందితులైన మీనా, మున్నాసింగ్‌ను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సీఐ గిరిధర్‌రావు, ఎస్ఐలు, క్రైం పార్టీ పోలీసులను అర్బన్ ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు అభినందించారు. ఈస్ట్ పరిధిలో నేరాల అదుపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.