ఓబుళేసుకు ‘అనంత’ నివాళి
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్, ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడిలో అసువులు బాసిన వజ్రకరూరు మండలం, కొనకొండ్ల గ్రామానికి చెందిన, అనంతపురం నివాసి సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ ముంతా ఓబుళేసు(48)కు ‘అనంత’ ఘన నివాళులర్పించింది. ఆదివారం ఆయన భౌతికకాయాన్ని అధికారులు స్థానిక అశోక్‌నగర్‌లోని మూడో క్రాస్‌లో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. డీఐజీ స్థాయి అధికారి శ్రీవాత్సవ సారథ్యంలో ప్రత్యేక భద్రత నడుమ ఛత్తీస్‌ఘడ్ నుంచి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో సీఆర్ఫీఎఫ్ అధికారులు ‘అనంత’కు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా అక్కడి చేరుకున్న బంధువులు, ఆత్మీయులు కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్సార్సీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే బీ.గురునాథరెడ్డి, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్, అదనపు ఎస్పీ రాంప్రసాద్‌రావు, నగర డీఎస్పీ నాగరాజు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, పలువురు సీఐలు ఓబుళేసు భౌతిక కాయాన్ని సందర్శించారు. మృతదేహంపై పుష్ప గుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు ‘ఓబుళేసు అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు. మావోయిస్టులు పేల్చిన క్లైమోర్మైన్ ఘటనలో ఓబుళేసు మృతి చెందారని కలెక్టర్, ఎస్పీ చెప్పారు. ఛత్తీస్‌ఘడ్‌లోని కామనూర్ నుంచి దర్గాకు వెళుతుండగా గుర్తించిన మావోలు దాడికి తెగబడ్డారన్నారు. ప్రజల మాన, ప్రాణ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన ఓబుళేసు అమరుడన్నారు.
తెలుగు తల్లి రుణం తీర్చుకున్న ముద్దుబిడ్డ అని అభివర్ణించారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. స్థానిక క్రైస్తవ శ్మశాన వాటికలో ఓబుళేసు భౌతికకాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పుర ప్రముఖులు, జిల్లా అధికారులు, బంధువులు, ఆత్మీయులు అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. భర్త మృతిని జీర్ణించుకోలేని నాగమణి, తన కుమార్తె శిరోమణిని గుండెలకు హత్తుకుని గుండెలవిసేలా రోదించిన తీరు కదిలించింది.
ప్రజా సేవకుడిని పొట్టన పెట్టుకున్నారు: ప్రజా సేవకుడిని మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్ అన్నారు.సంఘం సభ్యులతో కలసి ఓబుళేసు భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఓబుళేసు 1991లో సీఆర్ఫీఎఫ్ 80వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి, హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారన్నారు. విధుల్లో అంకితభావంతో మెలుగుతూ ఉన్నతాధికారుల వద్ద మంచి గుర్తింపు పొందారన్నారు.