musharraf ali
-
వివాదస్పదమవుతున్న నిర్మల్ జిల్లా కలెక్టర్ తీరు
-
కరెంటిస్తం.. నీళ్లిస్తం..
నిర్మల్/పెంబి: నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామస్తుల కష్టాలపై అధికార యంత్రాంగం స్పందించింది. స్వయంగా కలెక్టర్ ముషారఫ్‌అలీ వారి గోడు వినేందుకు చాకిరేవు కదలివచ్చారు. తమ గ్రామ సమస్యలు తీర్చాలంటూ నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు నుంచి కలెక్టరేట్ వరకూ గ్రామస్తులు 75 కి.మీ. నడిచి మంగళవారం కలెక్టరేట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణి సైతం.. కాళ్లకు చెప్పులు లేకున్నా.. తమ గోడును వినిపించడానికి కాలినడకన జిల్లా కేంద్రం వరకు చేరిన తీరును ‘సాక్షి’ ‘అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేం అంతకన్న హీనమా..’శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అటవీ గ్రామాల గోడు మంత్రులు, అధికారులకు చేరేలా వినిపించింది. ‘సాక్షి’కథనం, గ్రామస్తుల గోస తో కలెక్టర్ ముషారఫ్‌అలీ బుధవారం అన్నిపనులు పక్కనపెట్టి, అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే (స్థానికసంస్థలు), డీఎఫ్ఓ వికాస్‌మీనా, విద్యుత్‌శాఖ ఎస్సీ జేఆర్ చౌ హాన్ తదితర అధికారులను వెంట తీసుకుని చాకిరేవు చేరుకున్నారు. నిర్మల్‌కు వెళ్లకుండా అక్కడే ఉన్న మిగిలిన గ్రామస్తులతో పాటు కూర్చుని వారి సమస్యలను ఆలకించారు. మీరందరూ వచ్చేయండి.. ‘తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎంతదూరంలో ఉంటుంది..’అని కలెక్టర్ ముషారఫ్‌అలీ అడగటంతో ‘ఊరి నుంచి అద్ద కిలోమీటర్ దూరంల ఉన్న చిక్మన్ వాగుల కెళ్లి నీళ్లు తెచ్చుకుంటం సార్. అక్కడ పశువులు తాగే నీళ్లే మేమూ తాగుతున్నం సార్..’ అని చాకిరేవువాసులు చెప్పారు. ‘మీ ఊళ్లో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు.. స్కూల్‌కు ఎక్కడికి వెళ్తున్నారు..’అని మళ్లీ కలెక్టర్ అడగటంతో‘ఊళ్లె 15 మంది దాకా పిల్లలున్నరు సార్. స్కూల్ ఇక్కడికి దగ్గరల లేదు. కిలోమీటరు దూరంల ఉంటది. పిల్లల్ని పంపిద్దమంటే వర్షకాలం వాగుల కొట్టుకపోతరని భయం సార్’అని చెప్పారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ.. ‘మరి.. అందుకే మీరందరూ అక్కడికి (చాకిరేవు సమీపంలోని వస్పల్లికి) వచ్చేయండి. మీ అందరికీ పునరావాసం కల్పిస్తాం. మీ పొలాలు మీకే ఉండని, మీ ఇండ్లు మాత్రమే అక్కడికి షిఫ్ట్ చేద్దాం. డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తం. డెలివరీల సమయంలో ఈ వాగులు దాటుకుంటూ పోవాల్సిన కష్టమూ తప్పుతుంది. అక్కడికొస్తే కరెంటు ఉంటది, నీళ్లు ఉంటాయ్, మీ పిల్లలకు స్కూల్ దొరుకుతది, హాస్పిటల్, టీవీ, మొబైల్.. ఇలా అన్నీ దొరుకుతయ్..ఏమంటారు..!?’అని అడిగారు. ఇందుకు చాకిరేవు గ్రామస్తులు ససేమిరా.. అన్నారు. తాము ఉన్న ఊరిని, తాము అభివృద్ధి చేసుకున్న భూములను వదిలి రాలేమన్నారు. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం.. అంటూ తేల్చిచెప్పారు. ఆరునెలల్లో కరెంటు.. చాకిరేవు వాసులు రానని అనడంతో ఆయ న వెంటనే అన్నిశాఖల అధికారులతో మాట్లాడారు. అటవీ అధికారులతో మాట్లా డి సోలార్ ఆధారిత బోర్ వేసి, ఇంటింటికీ తాగునీటి వసతి కల్పిస్తామని గ్రామస్తులకు చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. అలాగే ఆరునెలల్లో కరెంటు కనెక్షన్లు కూడా ఇప్పిస్తామన్నారు. గ్రామానికి రోడ్డు వేయాలంటే కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు రావాలని, వాటి కోసం కూడా ప్రయత్నిస్తామన్నారు. చాకిరేవుతో పాటు చుట్టూ ఉన్న గూడేల ఇబ్బందులను సైతం పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇంకా టెంట్లోనే.. తమ గ్రామంలో సమస్యలు తీరేదాకా ఇక్కడే ఉంటామంటూ.. చాకిరేవు నుంచి పాదయాత్రగా మంగళవారం నిర్మల్ చేరుకున్న వారంతా కలెక్టరేట్ ఎదుట టెంట్లోనే ఉన్నారు. కలెక్టర్ తమ గ్రామానికి వెళ్లి, హామీలు ఇచ్చినా బుధవారం రాత్రి వరకు అక్కడే ఉన్నారు. టెంట్ వద్దే వండుకుని తిన్నారు. బాధాకరం: మంత్రి సత్యవతి చాకిరేవు గ్రామస్తుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం వారు చేసిన పాదయాత్రపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం స్పందించారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో మాట్లాడారు. చాకిరేవులో వెంటనే తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గ్రామ స్తులు తాగునీరు, ఇతర సదుపాయాల కో సం 75 కి.మీ. దూరంలోని నిర్మల్ కలెక్టరేట్ వరకు నడిచిరావడం బాధాకరమన్నారు. -
కరోనా: మరో 5 పాజిటివ్‌లు
సాక్షి, నిర్మల్ : జిల్లాలో కరోనా కోరలు చాస్తూ పోతోంది. మరో ఐదుగురికి పాజిటివ్ ఉన్నట్లు గురువారం నిర్ధారణ అయింది. జిల్లాలో 24గంటల వ్యవధిలోనే 11మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలటం కలవరపెడుతోంది. ఇందులో ఇదివరకే పాజిటివ్ వచ్చిన వారితో కలసిన ప్రాథమిక సంబంధీకులు కూడా ఉండటం కలకలం రేపుతోంది. కరోనా రెండో దశకు చేరుకోవడం, మొత్తం 15 పాజిటివ్ కేసులు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం మరింత సీరియస్‌గా తీసుకుంది. మళ్లీ ఐదు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ప్రకటించారు. జిల్లాలో గురువారం సాయంత్రం 7గంటల నుంచి ఈ నెల 14వరకు వంద శాతం కర్ఫ్యూ, లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. (ప్రపంచాన్ని వణికించిన 100 రోజులు ) మరో ఐదుగురికి.. జిల్లాలో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. బుధవారమే ఆరుగురికి పాజిటివ్ రాగా, గురువారం మరో ఐదుగురికి కరోనా ఉన్నట్లు తేలడం మరింత కలవరపెడుతోంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ శశిధర్ రాజు వివరాలను వెల్లడించారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో నిర్మల్‌కు చెందిన ఒకరికి, భైంసాలో ఇద్దరికి, నర్సాపూర్(జి) మండలం చాక్పల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలినట్లు ప్రకటించారు. ఇందులో ఒకరు కడెం మండలానికి చెందిన వారు కాగా, ఆయన నర్సాపూర్ మండలం చాక్‌పల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్‌శాఖకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన రక్త నమూనాలను హైదరాబాద్ పంపించామని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో ప్రాథమిక సంబంధం కలిగిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. జిల్లాలో వైరస్ రెండో దశకు చేరుకోవడంతో ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 15 పాజిటివ్ కేసులు ఉన్నాయని, వీరందరిని వైద్యం కోసం హైదరాబాద్ తరలించామని తెలిపారు. వీరితో ప్రాథమిక సంబంధం కలిగి ఉన్న కుటుంబ సభ్యులు మిగతా వారందరిని జిల్లాకేంద్రంలోని మూడు క్వారంటైన్ కేంద్రాలకు తరలించామన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో 11 కంటోన్మెంట్ జోన్లను గుర్తించామని, వాటి చుట్టూ అర కిలోమీటర్ పరిధిలో పూర్తిగా లాక్డౌన్ చేశామన్నారు. జిల్లాలో కరోనా వైరస్ నిర్ధారణ అయిన వారి ఇంటి నుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న 30 వేల గృహాలను గుర్తించి, ఇప్పటివరకు 20 వేల ఇళ్లకు వెళ్లి వైద్య సర్వే చేశామన్నారు. నిర్మల్ పట్టణంలో 105, భైంసా పట్టణంలో 42, గ్రామాల్లో ఐదు వైద్య బృందాలు ఇంటింటా సర్వే చేస్తున్నాయని తెలిపారు. ఈ బృందాలు ప్రతీ ఇంటికి వెళ్లి జ్వరం, దగ్గు, ఫ్లూ లక్షణాలున్న వారిని గుర్తించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని మెడికల్ (ఫార్మసీ)షాపులలో కరోనా లక్షణాలు ఉన్న వారు మందుల కోసం వస్తే వారి పేరు, ఫోన్ నెంబర్ తీసుకొని నివేదిక పంపాలని ఆదేశించామన్నారు. ఐదు రోజులు అన్నీ బంద్.. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు మళ్లీ ఐదు రోజులు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ నెల 14వరకు వందశాతం కర్ఫ్యూ, లాక్డౌన్ అమలులో ఉంటుందన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దన్నారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని కలెక్టర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మనం స్టేజ్–2 లో ఉన్నామని, ప్రతి ఒక్క రూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఐదు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నిర్మల్‌లోని కేజీబీవీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాల, మహిళా ప్రాంగణం క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నామన్నారు. ఐసోలేటెడ్ వార్డులను జిల్లా ఆసుపత్రి, భైంసా ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారిని పంపిస్తున్నాం.. విదేశాల నుంచి వచ్చిన 1100 మందిలో 45 మందిని ప్రభుత్వ క్వారంటైన్లలో ఉంచగా అందులో నలుగురికి పాజిటివ్ రాగా, మిగతా వారిని హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఆదేశించామన్నారు. ఇప్పటివరకు క్వారంటైన్లో ఉన్న 114లో 59 మందిని గురువారం ఇంటికి పంపించగా, మిగతా 55మందిని శుక్రవారం పంపనున్నట్లు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే 1800 4255566 లేదా 100 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని కలెక్టర్ సూచించారు. (మూడే ముళ్లు.. ఏడుగురే అతిథులు ) కఠినంగా అమలు.. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గురువారం రాత్రి నుంచి 14వరకు ఐదు రోజుల పాటు పూర్తి కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్నారు. కర్ఫ్యూ అమలుకు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైద్య అవసరాలకు మినహా బయటకు వస్తే ఎపిడమిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చిన మోటార్ సైకిల్, కార్లు, ఆటోలు సీజ్ చేసి కోర్టుకు సరెండర్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఐదు రోజుల పాటు మెడికల్ షాపులు, ఆసుపత్రులు తప్పా.. ఏవి కూడా తెరిచి ఉంచకూడదన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వెయ్యి వాహనాలను సీజ్ చేశామని ఎస్పీ పేర్కొన్నారు. (అమెరికాలో అడ్మిషన్లపై కరోనా ఎఫెక్ట్ ) ► నిర్మల్ పట్టణం : 04(గాజుల్ పేట్, మొఘల్ పుర, గుల్జార్ మార్కెట్, జోహ్రానగర్) ► భైంసా పట్టణం :02( మదీనా కాలనీ, పాండ్రి గల్లీ) ► గ్రామాలు :05నర్సాపూర్(జి) మండలంలోని చాక్ పెల్లిలక్ష్మణ చంద మండలంలోని కనకాపూర్, రాచాపూర్ మామడ మండలంలోనిన్యూ లింగాపూర్ పెంబి మండలంలోని అంకెన రాయదారి -
హైదరాబాద్ ఆహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం ప్రఖ్యాతిగాంచిన యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌కు అర్హత పొందింది. ‘గ్యాస్ట్రానమీ’ కేటగిరీలో హైదరాబాద్‌కు ఈ గుర్తింపు లభించినట్టు జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. హైదరాబాద్ ఎంపికయ్యేందుకు దరఖాస్తు నుంచి ప్రెజెంటేషన్ దాకా వివిధ వర్గాలు, సంస్థలతో సమావేశాలు నిర్వహించి ముషార్రఫ్ అలీ కీలకభూమిక పోషించారు. శతాబ్దాల ఘనత.. వందల ఏళ్లనుంచి వివిధ రకాల వంటలకు సుప్రసిద్ధమైన హైదరాబాద్ నగరం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని దేశాల వారినీ ఆకట్టుకోవడమేకాక ఇక్కడి వివిధ రకాల వంటకాలు అందరినీ అలరిస్తున్నాయి. తరతరాల సంప్రదాయాలను అందిపుచ్చుకున్న పాకశాస్త్ర ప్రవీణులేగాక ఈ రంగానికి సంబంధించి ఎన్నో సంస్థలు, పరిశోధనశాలలు సైతం నగరంలో ఉన్నాయి. వీధిబండ్ల నుంచి సెవెన్ స్టార్ హోటళ్ల దాకా వివిధ ఆహారాలను అందిస్తుండటం నగరానికి ఈ చోటు దక్కడంలో కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన హలీం వరకు హైదరాబాద్‌కే ప్రత్యేకమైనవి కావడం కూడా ఇందుకు ఉపకరించాయి. కాకతీయుల కాలం నుంచి టర్కీలు, మొఘల్ వంటకాలు హైదరాబాద్ జిహ్వచాపల్యాన్ని పెంచాయి. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ గురించి వేరుగా చెప్పాల్సిన పనిలేదు. కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, అమెరికా, చైనా తదితర దేశాలకు చెందిన రుచికరమైన ఆహారాలను హైదరాబాద్‌కు పరిచయం చేశారు. పరిశ్రమగానూ ఉపాధి నగరంలో రిజిస్టర్ చేసుకున్న రెస్టారెంట్లు 2,200 కాగా, మరో లక్ష కుటుంబాలు ఆహారమే జీవనాధారంగా కలిగి ఉన్నాయి. దాదాపు 3 లక్షలకు పైచిలుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంలో ఉన్నారు. ఆహార వినియోగంలోనూ హైదరాబాద్ తక్కువేం లేదు. నిత్యం 700 టన్నుల చికెన్, (ప్రత్యేక సందర్భాల్లో 2000 టన్నులు), 291 టన్నుల మాంసం వినియోగమవుతున్నాయంటే నగర వాసులకు వంటకాలపై ఎంత మక్కువో అంచనా వేసుకోవచ్చు. అన్ని వర్గాల వారికి తగినట్లుగా ఇరుకుసందులోని టిఫిన్ బండి నుంచి ప్రపంచశ్రేణి తాజ్, నోవాటెల్ వంటి గ్రూప్ హోటళ్లు, వాటి వినియోగదారులు నగరంలో ఉన్నారు. స్వీట్ఫెస్టివల్స్ వంటివి ఇక్కడే నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల వారిని ఒక్కచోట చేరుస్తున్నారు. నగరానికి గర్వకారణం: మేయర్ నాలుగు వందల ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన హైదరాబాద్ దేశవిదేశాలకు చెందిన అన్ని రకాల ఆహారం దొరికే ఏకైక నగరం. మన నగరం యునెస్కో క్రియేటివ్ సిటీల జాబితాలో చేరడం అందరికీ గర్వకారణం. మంత్రి కేటీఆర్ ప్రశంసలు.. హైదరాబాద్ నగరానికి క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం లభించడంపై మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్లు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన జీహెచ్ఎంసీ అధికారులను అభినందించారు. -
సివిల్స్‌లో మెరిసిన మాజీ ఎమ్మెల్యే మనువడు
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: నంద్యాల మాజీ ఎమ్మెల్యే, దివంగత నబీ సాహెబ్ మనువడు ముషఫ్ ్రఅలి ఫారుకి సివిల్స్‌లో 80వ ర్యాంకును సాధించారు. దీంతో నంద్యాలలోని మాజీ ఎమ్మెల్యే నబీ సాహెబ్ ఇంట్లో గురువారం బంధువులు సంబరాలను చేసుకున్నారు. నబీ సాహెబ్ కుమార్తె రహ్మతున్నిసా కుమారుడు ముషఫ్ ్రఅలి. ఈయన తండ్రి ముర్తుజ ఫారుకి హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ హోదాలో పని చేస్తున్నారు. ముషఫ్ ్రఅలి ఫారుకి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. టెన్త్ వరకు హైదరాబాద్ హైస్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య కాలేజిలో, ఇంజినీరింగ్ బంజారా హిల్స్‌లోని ఎంజె.కాలేజిలో చదివారు. తర్వాత ఐఐటీలో సీటు సాధించి చెన్నైలో చదివారు. తర్వాత బెంగుళూరులోని ఇంటెల్ కంపెనీలో కంప్యూటర్ చీఫ్ డిజైనర్‌గా పని చేశారు. ఏడాది తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. దాదాపు ఏడు నెలలు కష్టపడి చదివారు. దీంతో 80వ ర్యాంకును సాధించారు. ఆత్మవిశ్వాసం, ఖచ్చితమైన లక్ష్యం, నిరంతర శ్రమతో తాను సివిల్స్‌లో ర్యాంకు సాధించానని చెప్పారు. రోజుకు 8 గంటలు చదివేవాడినని, తల్లిదండ్రులు, స్నేహితులు ప్రోత్సహించారని చెప్పారు. ఐఏఎస్ చదివి పేద బడుగు, బలహీన వర్గాల వారికి చేయూతనివ్వాలనేది లక్ష్యమని తెలిపారు.