చాకిరేవులో గ్రామస్తులతో మాట్లాడుతున్న కలెక్టర్
నిర్మల్/పెంబి: నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామస్తుల కష్టాలపై అధికార యంత్రాంగం స్పందించింది. స్వయంగా కలెక్టర్ ముషారఫ్‌అలీ వారి గోడు వినేందుకు చాకిరేవు కదలివచ్చారు. తమ గ్రామ సమస్యలు తీర్చాలంటూ నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు నుంచి కలెక్టరేట్ వరకూ గ్రామస్తులు 75 కి.మీ. నడిచి మంగళవారం కలెక్టరేట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
పిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణి సైతం.. కాళ్లకు చెప్పులు లేకున్నా.. తమ గోడును వినిపించడానికి కాలినడకన జిల్లా కేంద్రం వరకు చేరిన తీరును ‘సాక్షి’ ‘అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేం అంతకన్న హీనమా..’శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అటవీ గ్రామాల గోడు మంత్రులు, అధికారులకు చేరేలా వినిపించింది. ‘సాక్షి’కథనం, గ్రామస్తుల గోస తో కలెక్టర్ ముషారఫ్‌అలీ బుధవారం అన్నిపనులు పక్కనపెట్టి, అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే (స్థానికసంస్థలు), డీఎఫ్‌ఓ వికాస్‌మీనా, విద్యుత్‌శాఖ ఎస్‌సీ జేఆర్ చౌ హాన్ తదితర అధికారులను వెంట తీసుకుని చాకిరేవు చేరుకున్నారు. నిర్మల్‌కు వెళ్లకుండా అక్కడే ఉన్న మిగిలిన గ్రామస్తులతో పాటు కూర్చుని వారి సమస్యలను ఆలకించారు.
మీరందరూ వచ్చేయండి..
‘తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎంతదూరంలో ఉంటుంది..’అని కలెక్టర్ ముషారఫ్‌అలీ అడగటంతో ‘ఊరి నుంచి అద్ద కిలోమీటర్ దూరంల ఉన్న చిక్‌మన్ వాగుల కెళ్లి నీళ్లు తెచ్చుకుంటం సార్. అక్కడ పశువులు తాగే నీళ్లే మేమూ తాగుతున్నం సార్..’ అని చాకిరేవువాసులు చెప్పారు. ‘మీ ఊళ్లో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు.. స్కూల్‌కు ఎక్కడికి వెళ్తున్నారు..’అని మళ్లీ కలెక్టర్ అడగటంతో‘ఊళ్లె 15 మంది దాకా పిల్లలున్నరు సార్.
స్కూల్ ఇక్కడికి దగ్గరల లేదు. కిలోమీటరు దూరంల ఉంటది. పిల్లల్ని పంపిద్దమంటే వర్షకాలం వాగుల కొట్టుకపోతరని భయం సార్’అని చెప్పారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ.. ‘మరి.. అందుకే మీరందరూ అక్కడికి (చాకిరేవు సమీపంలోని వస్‌పల్లికి) వచ్చేయండి. మీ అందరికీ పునరావాసం కల్పిస్తాం. మీ పొలాలు మీకే ఉండని, మీ ఇండ్లు మాత్రమే అక్కడికి షిఫ్ట్ చేద్దాం.
డబుల్‌బెడ్రూం ఇండ్లు ఇస్తం. డెలివరీల సమయంలో ఈ వాగులు దాటుకుంటూ పోవాల్సిన కష్టమూ తప్పుతుంది. అక్కడికొస్తే కరెంటు ఉంటది, నీళ్లు ఉంటాయ్, మీ పిల్లలకు స్కూల్ దొరుకుతది, హాస్పిటల్, టీవీ, మొబైల్.. ఇలా అన్నీ దొరుకుతయ్..ఏమంటారు..!?’అని అడిగారు. ఇందుకు చాకిరేవు గ్రామస్తులు ససేమిరా.. అన్నారు. తాము ఉన్న ఊరిని, తాము అభివృద్ధి చేసుకున్న భూములను వదిలి రాలేమన్నారు. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం.. అంటూ తేల్చిచెప్పారు.
ఆరునెలల్లో కరెంటు..
చాకిరేవు వాసులు రానని అనడంతో ఆయ న వెంటనే అన్నిశాఖల అధికారులతో మాట్లాడారు. అటవీ అధికారులతో మాట్లా డి సోలార్ ఆధారిత బోర్ వేసి, ఇంటింటికీ తాగునీటి వసతి కల్పిస్తామని గ్రామస్తులకు చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. అలాగే ఆరునెలల్లో కరెంటు కనెక్షన్లు కూడా ఇప్పిస్తామన్నారు. గ్రామానికి రోడ్డు వేయాలంటే కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు రావాలని, వాటి కోసం కూడా ప్రయత్నిస్తామన్నారు. చాకిరేవుతో పాటు చుట్టూ ఉన్న గూడేల ఇబ్బందులను సైతం పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఇంకా టెంట్‌లోనే..
తమ గ్రామంలో సమస్యలు తీరేదాకా ఇక్కడే ఉంటామంటూ.. చాకిరేవు నుంచి పాదయాత్రగా మంగళవారం నిర్మల్ చేరుకున్న వారంతా కలెక్టరేట్ ఎదుట టెంట్‌లోనే ఉన్నారు. కలెక్టర్ తమ గ్రామానికి వెళ్లి, హామీలు ఇచ్చినా బుధవారం రాత్రి వరకు అక్కడే ఉన్నారు. టెంట్ వద్దే వండుకుని తిన్నారు.
బాధాకరం: మంత్రి సత్యవతి
చాకిరేవు గ్రామస్తుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం వారు చేసిన పాదయాత్రపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం స్పందించారు.
వెంటనే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో మాట్లాడారు. చాకిరేవులో వెంటనే తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గ్రామ స్తులు తాగునీరు, ఇతర సదుపాయాల కో సం 75 కి.మీ. దూరంలోని నిర్మల్ కలెక్టరేట్ వరకు నడిచిరావడం బాధాకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment