
చార్మినార్ వద్ద ఇరానీ చాయ్ తాగుతున్న సీఎస్ ఎస్‌కే జోషి, మునిసిపల్ పరిపాలన ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం ప్రఖ్యాతిగాంచిన యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌కు అర్హత పొందింది. ‘గ్యాస్ట్రానమీ’ కేటగిరీలో హైదరాబాద్‌కు ఈ గుర్తింపు లభించినట్టు జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. హైదరాబాద్ ఎంపికయ్యేందుకు దరఖాస్తు నుంచి ప్రెజెంటేషన్ దాకా వివిధ వర్గాలు, సంస్థలతో సమావేశాలు నిర్వహించి ముషార్రఫ్ అలీ కీలకభూమిక పోషించారు.
శతాబ్దాల ఘనత..
వందల ఏళ్లనుంచి వివిధ రకాల వంటలకు సుప్రసిద్ధమైన హైదరాబాద్ నగరం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని దేశాల వారినీ ఆకట్టుకోవడమేకాక ఇక్కడి వివిధ రకాల వంటకాలు అందరినీ అలరిస్తున్నాయి. తరతరాల సంప్రదాయాలను అందిపుచ్చుకున్న పాకశాస్త్ర ప్రవీణులేగాక ఈ రంగానికి సంబంధించి ఎన్నో సంస్థలు, పరిశోధనశాలలు సైతం నగరంలో ఉన్నాయి. వీధిబండ్ల నుంచి సెవెన్ స్టార్ హోటళ్ల దాకా వివిధ ఆహారాలను అందిస్తుండటం నగరానికి ఈ చోటు దక్కడంలో కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన హలీం వరకు హైదరాబాద్‌కే ప్రత్యేకమైనవి కావడం కూడా ఇందుకు ఉపకరించాయి. కాకతీయుల కాలం నుంచి టర్కీలు, మొఘల్ వంటకాలు హైదరాబాద్ జిహ్వచాపల్యాన్ని పెంచాయి. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ గురించి వేరుగా చెప్పాల్సిన పనిలేదు. కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, అమెరికా, చైనా తదితర దేశాలకు చెందిన రుచికరమైన ఆహారాలను హైదరాబాద్‌కు పరిచయం చేశారు.
పరిశ్రమగానూ ఉపాధి
నగరంలో రిజిస్టర్ చేసుకున్న రెస్టారెంట్లు 2,200 కాగా, మరో లక్ష కుటుంబాలు ఆహారమే జీవనాధారంగా కలిగి ఉన్నాయి. దాదాపు 3 లక్షలకు పైచిలుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంలో ఉన్నారు. ఆహార వినియోగంలోనూ హైదరాబాద్ తక్కువేం లేదు. నిత్యం 700 టన్నుల చికెన్, (ప్రత్యేక సందర్భాల్లో 2000 టన్నులు), 291 టన్నుల మాంసం వినియోగమవుతున్నాయంటే నగర వాసులకు వంటకాలపై ఎంత మక్కువో అంచనా వేసుకోవచ్చు. అన్ని వర్గాల వారికి తగినట్లుగా ఇరుకుసందులోని టిఫిన్ బండి నుంచి ప్రపంచశ్రేణి తాజ్, నోవాటెల్ వంటి గ్రూప్ హోటళ్లు, వాటి వినియోగదారులు నగరంలో ఉన్నారు. స్వీట్‌ఫెస్టివల్స్ వంటివి ఇక్కడే నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల వారిని ఒక్కచోట చేరుస్తున్నారు.
నగరానికి గర్వకారణం: మేయర్
నాలుగు వందల ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన హైదరాబాద్ దేశవిదేశాలకు చెందిన అన్ని రకాల ఆహారం దొరికే ఏకైక నగరం. మన నగరం యునెస్కో క్రియేటివ్ సిటీల జాబితాలో చేరడం అందరికీ గర్వకారణం.
మంత్రి కేటీఆర్ ప్రశంసలు..
హైదరాబాద్ నగరానికి క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం లభించడంపై మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment