
సాక్షి, హైదరాబాద్: విలక్షణమైన సిటీగా పేరొందిన హైదరాబాద్.. ప్రపంచంలోని సృజనాత్మక నగరాల (క్రియేటీవ్ సిటీస్) జాబితాలో స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా యునెస్కో ఎంపిక చేసిన క్రియేటీవ్ సిటీస్ నెట్‌వర్క్‌లో 66 నగరాలను ఎంపిక చేయగా.. అందులో మన హైదరాబాద్ సిటీ ఉంది. భారత్ తరపున ముంబై మహా నగరాన్ని సినిమా, హైదరాబాద్ నగరాన్ని ఆహారం, తినుబండారాల (గాస్ట్రోనమీ) విభాగం నుంచి ఎంపికచేశారు.
భారతదేశం నుంచి మొత్తం 18నగరాలు ఈ నెట్‌వర్క్‌లో స్థానం కోసం పోటీపడగా.. ఎనిమిది నగరాలు మాత్రమే తమ దరఖాస్తులను యునెస్కోకు పంపాయి. అందులో కేవలం నాలుగు నగరాలు మాత్రమే (హైదరాబాద్, ముంబాయి, శ్రీనగర్, లక్నో) ఎంపికయ్యాయి. హైదరాబాద్ క్రియేటీవ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం పొందడం పట్ల రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.