music lyrics
-
అదే అమ్మవారి దర్శనం
‘‘హిమాద్రిసుతే పాహి మాం వరదే పరదేవతే/సుమేరు మధ్య వాసినీ అంబ శ్రీకామాక్షి.....’’ అన్న కీర్తనలో శ్యామశాస్త్రి గారు ‘సుమేరు మధ్య వాసినీ’ అనడంలో అమ్మవారు నివాసం ఉండే స్థానాన్ని ప్రస్తావిస్తూ గొప్ప రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. అమ్మ ఎప్పుడూ ఎక్కడుంటుంది ? ఆమె పరమశివుని ఎడమ తొడమీద కూర్చుని ఉంటుంది. అమ్మా! శివకామేశ్వరాంకస్థవమయిన నువ్వుండే గృహమెక్కడో తెలుసా? అంటున్నారు ఆయన. అంటే– మేరు పర్వతానికున్న నాలుగు శిఖరాలలో మధ్యన ఒక శిఖరం ఉంటుంది. అదే శ్రీచక్రంలో బిందు స్థానం. ఆ త్రికోణం కింద చూస్తే తూర్పుకు ఒక శిఖరం, నైరుతికి ఒకటి, వాయవ్యానికి ఒకటి ఉన్నాయి. ఈ మూడు శిఖరాలమీద ముగ్గురు దేవతలున్నారు. వాళ్ళే సృష్టి, స్థితి, లయలు చేసే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ ముగ్గురికీ కావలసిన శక్తి స్వరూపాలయిన సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే మూడు శక్తులను ముగ్గురు మూర్తులకు ఇచ్చిన మూల పుటమ్మవై ఈవేళ ఆ మధ్యలో ఉండే శిఖరంమీద కూర్చుని ఉన్నావమ్మా..’– ఇది బాహ్యంలో అర్థం. అంతరంలో!!! అందుకే ఆయన కీర్తనల్ని కదళీఫలంతో పోల్చారు. మేరు అంటే–మనకు వెన్నెముక ఉంటుంది. అలాగే భూమండలానికి, పాలపుంతకు, బ్రహ్మాండానికీ మేరువుంటుంది. ఆ మేరుకు మధ్యలో అమ్మవారు ఉండడం అంటే....ఆ మేరు అన్న మాటను విడదీయండి. అం+ఆ+ఇ+ఉ+రు. ఇందులో మొదటి రెండు, చివరి రెండు అక్షరాలు పర–పశ్యంత–మధ్యమ–వైఖరి అనే నాలుగు వాక్కులు. మధ్యలో ఉన్న ‘ఇ’కారం ‘ఈమ్’ అమ్మవారి బీజాక్షరం. ఆ ‘ఇ’కారం అమ్మవారి నాద స్వరూపం. సృష్టి ఆరంభం శూన్యం. ఆకారమొక్కటే ఉంటుంది. భూతములన్నీ ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. అందులోంచి మొట్టమొదట వాయువు వస్తుంది. ఆకాశం శబ్దగుణకం కాబట్టి శబ్దం వస్తుంది. అదే ప్రణవం..‘ఓంకారం’ అంటాం.అలాగే మనిషిలోంచి కూడా శబ్దం బయటికొచ్చేముందు– లోపల ఒక నాదం ఉంటుంది. ఆ నాదమే అమ్మవారు. నాదాన్ని ఉపాసన చేయడమే అమ్మవారి దర్శనం చేయడం. అది పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యం కోసం. అంతే తప్ప, దాన్ని అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించుకోవడానికి కాదు. ఆ నాదోపాసనకు సంబంధించిన ‘ఇ’ అక్షరానికి అటు ఉన్న పర–పశ్యంతి, ఇటు ఉన్న మధ్యమ, వైఖరి..అంటే ఒక వాక్కు నోట్లోంచి బయటకు రావాలనుకోండి...అమ్మవారిని ‘హిమాద్రిసుతే’ అనాలనిపించడానికి ముందు సంకల్పం కలుగుతుంది. సహస్రార చక్రంలో..అలా కలిగితే దాన్ని ‘పర’ అంటారు. ‘హిమాద్రిసుతే’ అనడానికి అనాహత చక్రం దగ్గర వాయువు కదులుతుంది. అలా కదిలితే దానిని ‘పశ్యంతి’ అంటారు. కంఠం దగ్గరకు రాగానే అక్కడ ‘విశుద్ధ చక్రం’ దగ్గర ‘ర్’ అనే రేఫం తో కలిసి అగ్ని చేత సంస్కరింపబడి పరిశుద్ధమై అది నాలుకకు, పెదవులకు తగులుతుంది. లోపల ఉన్న వాయువు సొట్టలు పడి–అక్షరాలై, పదాలై, చరణాలై లోపల సహస్రారంలో కదలిన మాట ‘వైఖరి’ రూపుగా లోపల ఉన్న నాదం ఉపాసన చేస్తున్న స్వరూపంగా బయటికి రావాలి. అలా రావాలంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. సహస్రారంలో కలిగిన సంకల్పం..ౖ వెఖరీ వాక్కయి బయటికొచ్చి ఆకాశంలో ప్రయాణించి నీ చెవిలోకి వెడితే.. అక్కడ సహస్రారంలో కలిగిన భావన ఇక్కడ సహస్రారానికి అందుతుంది. అలా అందించగలిగిన నాదస్వరూపిణి అయిన అమ్మవారు ‘ఇ’కారం. ఆవిడే ‘సుమేరు మధ్య వాసిని’. -
అగ్నికి పుటం పెట్టినట్టే...
త్యాగరాజుగారి కుమార్తె సీతామహాలక్ష్మికి కుప్పుసామయ్యతో వివాహం అయింది. విందు తరువాత ఆ సాయంత్రం చిన్న సంగీత గోష్ఠి ఏర్పాటు చేసారు. కేరళనుంచి వడివేలు అని ఒక సంగీత విద్వాంసుడొచ్చాడు. శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వచ్చారు. శొంఠి వేంకట రమణయ్య కీర్తన చేసారు. తరువాత శ్యామశాస్త్రి చేసారు. గురువు శొంఠి వేంకట రమణయ్యగారు...‘‘త్యాగయ్యా! నీవు కూడా ఒక కీర్తన పాడవోయ్!’ అన్నారు. గురువుగారి సన్నిధిలో ఇంతమంది పెద్దలను చూసి త్యాగరాజు మనసులో ఏమనుకున్నారు...‘చాలు, నాకున్న ఒక్క బాధ్యత కూతురు పెళ్ళి. అది కూడా తీరిపోయింది. ఇంక నాకేం కావాలి తండ్రీ, ఎప్పటినుంచో నా జీవితంలో మిగిలిపోయింది ఏమిటో తెలుసా...‘‘నగుమోము కనలేని నాదు జాలీ తెలిసీ..’’ స్వామీ రామచంద్రా! నువ్వు ఆ సీతమ్మతో కలిసి నవ్వుతూ ఒక్కసారొచ్చి దర్శనమివ్వవా! నీ పాదారవిందాలకు నమస్కరించే అదృష్టాన్ని ప్రసాదించవా, కూతురు పెళ్ళయిపోయిందంటే... నా జీవితం కూడా అయిపోయింది. పెద్దవాడినైపోతున్నా...’’.మనమయితే ఇంట్లో పిల్ల పెళ్ళయిపోయిందనగానే ... నెలరోజుల నుంచి నిద్రలేదు. హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాం. కానీ వాగ్గేయకారుల ఆర్తి చూడండి. వారికి ఆక్రోశం వచ్చినా, బాధ కలిగినా... అగ్నికి పుటం పెట్టిన బంగారం లాంటి కీర్తన వస్తుంది. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా..!!!’ అన్నారు రామదాసుగారు. అలాగే త్యాగయ్య ఎంత రసస్ఫోరకమైన పదబంధాలతో ఆర్తిగా పిలుస్తున్నారో తన రాముడిని... భగవంతునిలో మనసు నిలిపి రమిస్తూ, మనసు అంతరాంతరాల్లోంచి సత్యస్ఫురణంగా దొర్లిన అదెంత గొప్ప కీర్తనో ...‘నగుమోము కనలేని నాదు జాలి తెలిసీ... నను బ్రోవరాదా, శ్రీరఘువర(నీ నగుమోము): నగరాజధర నీదు పరివారులెల్ల: ఒగి బోధనజేసే వారలు కారే యటులుండుదురే: ఖగరాజు నీయానతి విని వేగ చన లేడో –గగనానికిలకు బహుదూరంబని నాడో– జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు –వగజూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ (నగుమోము)’’ పాంచభౌతికమైన శరీరంతో రావలసిన అవసరం లేని పరమాత్మను... ‘‘స్వామీ, ఇలా నిన్ను చూడలేకపోతే ఉండలేం’ అని ఆర్తితో ఎలుగెత్తి కీర్తించిన సాధుపుంగవులకోసం ఆయన పాంచభౌతిక శరీరాన్ని తీసుకుని ఈ నేత్రంతో చూడడానికి వీలుగా వచ్చినవాడు. ‘‘తండ్రీ, రక్షణయే నీ ప్రథమ కర్తవ్యం కదా! అపారమైన కరుణామూర్తివే! ఈవేళ నేనెంత అలమటించి పోతున్నానో...’’ అంటూ త్యాగయ్య తాదాత్మ్యం చెందాడు. ఆ తాదాత్మ్యతలో వాగ్గేయకారుల హృదయాల్లోంచి ఎలాటి అద్భుతమైన భావాలు పలుకుతాయో... ఒకనాడు నీవు కొండ భరించావు, ఒకనాడు కొండను ధరించావు. ఎవరు? రఘువరా..! పిలిచిందెవరిని? త్యాగరాజుకి ఆరాధ్యదైవం రామచంద్రమూర్తిని. ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని కొండ భరించినవాడిగా, కొండ ధరించినవాడిగా కీర్తిస్తున్నారు. కొండను భరించింది కూర్మావతారం. కొండను ధరించింది కృష్ణావతారం. త్యాగయ్య పిలుస్తున్నదేమో.. రామచంద్రమూర్తిని. ఈ ముగ్గురికీ భేదం లేదా??? - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు
మా స్వగ్రామం విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామం. మా తాతగారైన కీ.శే. చిర్రావూరి దక్షిణామూర్తిగారు నా చిన్ననాటి నుంచే నాకు రామాయణం, మహాభారతం వంటివి నేర్పించారు. మా ఊళ్లో మైక్ సెట్ అద్దెకిచ్చే వారింట్లోనే మేమున్నాం. రామాయణంతోపాటు, ‘అడవిరాముడు’ సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు... అనే పాట నా చేత పాడించి అందరూ ముచ్చటపడేవారు. సాకీ నుండి చివరి పంక్తి దాకా ఆగకుండా, ఆపకుండా సంగీత సాహిత్యాలు పోటీపడుతూ మనలో ఒక ఆరోగ్యకరమైన పోటీ పటిమను, లక్ష్యసాధనను, అఖండ దీక్షను రగిలించే విధంగా ఈ పాట నడక సాగే తీరు నన్ను ప్రభావితం చేసింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని నేను ఇలా రచయితగా మారటానికి గల కారణం వేటూరిగారు రాసిన ఈ పాటేనని చెప్పాలి ‘అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి’ అనే వాక్యంలో... మన జీవితాల్లో ఎక్కువమంది ముందు వాల్మీకిలాగే బతుకువేట సాగిస్తారు. ‘పాలపిట్టల జంట వలపు తేనెల పంట/ పండించుకుని పరవశించి పోయేవేళ/ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు/ఒక పక్షిని నేలకూల్చాడు... వాక్యంలో, జీవితంలో చాలామందికి సంతోషం, దుఃఖం పక్కపక్కనే వచ్చి వెక్కిరిస్తూంటాయి. ఈ పాటలో మొత్తం సంగీతం అలాగే నెమ్మదైన, మృదువైన కరుణ, వెంటనే గంభీరమైన రౌద్రం ఆవేశంతో మనల్ని సమ్మోహనపరుస్తూ ఉంటుంది. మనకిష్టమైన తల్లో, చెల్లో, ప్రియుడో, ప్రియురాలో ఊహించని విధంగా మనసు నుండి దూరమై బాధ కలిగించడం జగమెరిగిన సత్యం. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ/ తన కంటిలో పొంగ మనసు కరగంగ/ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే... అక్కడ వచ్చే వయొలిన్ బిట్ మనసున్న ప్రతి మనిషి హృదయాన్ని కలచి వేస్తుంది. ప్రపంచంలో ఎందరో గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాల్లో ఇలాంటి ఏదో ఒక బలమైన సంఘటన, గాయం రేపిన శోకం శ్లోకంగా మారి, చీకటి ఎదలో దీపం వెలుగుల్ని నింపడం చూస్తూనే ఉంటాం. కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా/మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు... తెరపై ఈ చరణంలో వాల్మీకి నుండి కాళిదాసు, తులసీదాసు, భక్తకన్నప్ప, యోగివేమన, రామకృష్ణ పరమహంస, షిర్డీసాయిబాబా, మహాత్మాగాంధీ, మదర్ థెరిసా వంటి ఎందరో మహానుభావులు కనిపిస్తారు. మామూలు మనుషులుగా పుట్టి, ఈ పుణ్యభూమిలో మహర్షులై ఎదిగి ఎన్నో కోట్లమంది వ్యక్తులను ఉత్తేజపరిచి తీర్చిదిద్దడానికి కృషిచేశారు ఆ మహానుభావులు. నవరసభరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం/ ఆ వాల్మీకి మీ వాడు.. మీలోనే ఉన్నాడు/ అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు... తెలుగు సినీ సాహిత్య ఏకైక సవ్యసాచి, నవ్యసాచి కీ.శే. వేటూరి వారి కలం నుండి గళం విప్పిన జీవిత నిత్య నృత్య, సత్య వాక్యాలు ఇవి. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం/ తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం... అనే చరణంలో... పుస్తకాలు, బడి, గురువు ఏవీ లేకున్నా... గురువు ఆకృతిలో ఉన్న మట్టిబొమ్మనే నిజ గురువుగా భావించి వినయంతో పూజించి, విశ్రమించని ప్రయత్నంతో ఆచరణ, ఆకాంక్ష, కృషితో విలువిద్యలో అగ్రగామిగా ఎదిగి, తన కుడి చేతి బొటన వేలునే పక్షపాత బుద్ధి వున్న గురువుకి సైతం దక్షిణ ఇచ్చిన వీరుడు ఏకలవ్యుడు. ‘ఎరుకలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు/ వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇల వెలిగాడు... దీన్ని మనం సిరికలవాడు అవకపోతేనేమి గురికలవాడే మొనగాడు అని అన్వయించుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ప్రస్తుత పోటీ ప్రపంచంలో అట్టడుగు స్థాయి నుండి అడుగులేస్తూ అత్యున్నత స్థాయికి చేరుకుని మనలో నిద్రాణమై వున్న ఉద్రేకాన్ని నిద్రలేపుతూనే ఉన్నారు. ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి/ జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరీనాటికీ/ అడవిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు/ నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు... భరతుడు పరిపాలించబట్టే మనది భారతదేశం అయ్యింది. ఆయన, ఆయన తల్లి సైతం అడవిలోనే పుట్టి పేరుకెక్కారు. ఆ వాక్యాలు నేటికీ అక్షర, అక్షయ సత్యాలు. నేడు ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో ఎంతోమంది ఆడపడుచులు వివిధ రంగాలలో అగ్రగామిగా, ఉన్నత విజయాలు సాధిస్తూ, మనదేశ కీర్తి పతాకం విశ్వవేదికపై సగర్వంగా రెపరెపలాడేలా ఉత్సాహపరుస్తుంది ఈ పాట. ముఖ్యంగా విద్య, క్రీడ, వ్యాపార, విజ్ఞాన, వాణిజ్య, ఆర్థిక, అభ్యుదయ, ఆధ్యాత్మిక రంగాలలో కలకాలం భారతనారి తరిగిపోని పేరు ప్రతిష్ఠలను సంపాదించాలనే ఆశయంతో ఆవేశభరితంగా ఆలోచనా భరితంగా నడుస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ పాట చివరిలో ఒక గొంతు రెండు గొంతులై వందల వేల గొంతులై ‘అందుకే... కృషి ఉంటే మనుషులు ఋషులౌతారూ...’ అనే విధంగా ముక్తాయింపు ఇచ్చినా... నేటికీ ఏనాటికీ అనేక కోట్ల తెలుగు గొంతుల్లో గంతులేస్తూ, గుండెల్లో నరనరాల్లో తరతరాలకీ... విన్న, తలచుకొన్న ప్రతిసారీ చెరగని తరగని అలుపెరుగని అంతులేని శక్తిని నింపే ఈ పాట నాలాంటి ఎందరో వ్యక్తుల జీవితాల్లో చెరగని ముద్ర వేస్తూ ఉంటుంది. - సంభాషణ: నాగేష్