త్యాగరాజుగారి కుమార్తె సీతామహాలక్ష్మికి కుప్పుసామయ్యతో వివాహం అయింది. విందు తరువాత ఆ సాయంత్రం చిన్న సంగీత గోష్ఠి ఏర్పాటు చేసారు. కేరళనుంచి వడివేలు అని ఒక సంగీత విద్వాంసుడొచ్చాడు. శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వచ్చారు. శొంఠి వేంకట రమణయ్య కీర్తన చేసారు. తరువాత శ్యామశాస్త్రి చేసారు. గురువు శొంఠి వేంకట రమణయ్యగారు...‘‘త్యాగయ్యా! నీవు కూడా ఒక కీర్తన పాడవోయ్!’ అన్నారు. గురువుగారి సన్నిధిలో ఇంతమంది పెద్దలను చూసి త్యాగరాజు మనసులో ఏమనుకున్నారు...‘చాలు, నాకున్న ఒక్క బాధ్యత కూతురు పెళ్ళి. అది కూడా తీరిపోయింది. ఇంక నాకేం కావాలి తండ్రీ, ఎప్పటినుంచో నా జీవితంలో మిగిలిపోయింది ఏమిటో తెలుసా...‘‘నగుమోము కనలేని నాదు జాలీ తెలిసీ..’’ స్వామీ రామచంద్రా! నువ్వు ఆ సీతమ్మతో కలిసి నవ్వుతూ ఒక్కసారొచ్చి దర్శనమివ్వవా! నీ పాదారవిందాలకు నమస్కరించే అదృష్టాన్ని ప్రసాదించవా, కూతురు పెళ్ళయిపోయిందంటే... నా జీవితం కూడా అయిపోయింది. పెద్దవాడినైపోతున్నా...’’.మనమయితే ఇంట్లో పిల్ల పెళ్ళయిపోయిందనగానే ... నెలరోజుల నుంచి నిద్రలేదు. హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాం. కానీ వాగ్గేయకారుల ఆర్తి చూడండి. వారికి ఆక్రోశం వచ్చినా, బాధ కలిగినా... అగ్నికి పుటం పెట్టిన బంగారం లాంటి కీర్తన వస్తుంది. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా..!!!’ అన్నారు రామదాసుగారు.
అలాగే త్యాగయ్య ఎంత రసస్ఫోరకమైన పదబంధాలతో ఆర్తిగా పిలుస్తున్నారో తన రాముడిని... భగవంతునిలో మనసు నిలిపి రమిస్తూ, మనసు అంతరాంతరాల్లోంచి సత్యస్ఫురణంగా దొర్లిన అదెంత గొప్ప కీర్తనో ...‘నగుమోము కనలేని నాదు జాలి తెలిసీ... నను బ్రోవరాదా, శ్రీరఘువర(నీ నగుమోము): నగరాజధర నీదు పరివారులెల్ల: ఒగి బోధనజేసే వారలు కారే యటులుండుదురే: ఖగరాజు నీయానతి విని వేగ చన లేడో –గగనానికిలకు బహుదూరంబని నాడో– జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు –వగజూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ (నగుమోము)’’ పాంచభౌతికమైన శరీరంతో రావలసిన అవసరం లేని పరమాత్మను... ‘‘స్వామీ, ఇలా నిన్ను చూడలేకపోతే ఉండలేం’ అని ఆర్తితో ఎలుగెత్తి కీర్తించిన సాధుపుంగవులకోసం ఆయన పాంచభౌతిక శరీరాన్ని తీసుకుని ఈ నేత్రంతో చూడడానికి వీలుగా వచ్చినవాడు. ‘‘తండ్రీ, రక్షణయే నీ ప్రథమ కర్తవ్యం కదా! అపారమైన కరుణామూర్తివే! ఈవేళ నేనెంత అలమటించి పోతున్నానో...’’ అంటూ త్యాగయ్య తాదాత్మ్యం చెందాడు. ఆ తాదాత్మ్యతలో వాగ్గేయకారుల హృదయాల్లోంచి ఎలాటి అద్భుతమైన భావాలు పలుకుతాయో... ఒకనాడు నీవు కొండ భరించావు, ఒకనాడు కొండను ధరించావు. ఎవరు? రఘువరా..! పిలిచిందెవరిని? త్యాగరాజుకి ఆరాధ్యదైవం రామచంద్రమూర్తిని. ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని కొండ భరించినవాడిగా, కొండ ధరించినవాడిగా కీర్తిస్తున్నారు. కొండను భరించింది కూర్మావతారం. కొండను ధరించింది కృష్ణావతారం. త్యాగయ్య పిలుస్తున్నదేమో.. రామచంద్రమూర్తిని. ఈ ముగ్గురికీ భేదం లేదా???
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
అగ్నికి పుటం పెట్టినట్టే...
Published Sun, Feb 24 2019 1:40 AM | Last Updated on Sun, Feb 24 2019 1:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment