కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు
మా స్వగ్రామం విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామం. మా తాతగారైన కీ.శే. చిర్రావూరి దక్షిణామూర్తిగారు నా చిన్ననాటి నుంచే నాకు రామాయణం, మహాభారతం వంటివి నేర్పించారు. మా ఊళ్లో మైక్ సెట్ అద్దెకిచ్చే వారింట్లోనే మేమున్నాం. రామాయణంతోపాటు, ‘అడవిరాముడు’ సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు... అనే పాట నా చేత పాడించి అందరూ ముచ్చటపడేవారు.
సాకీ నుండి చివరి పంక్తి దాకా ఆగకుండా, ఆపకుండా సంగీత సాహిత్యాలు పోటీపడుతూ మనలో ఒక ఆరోగ్యకరమైన పోటీ పటిమను, లక్ష్యసాధనను, అఖండ దీక్షను రగిలించే విధంగా ఈ పాట నడక సాగే తీరు నన్ను ప్రభావితం చేసింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని నేను ఇలా రచయితగా మారటానికి గల కారణం వేటూరిగారు రాసిన ఈ పాటేనని చెప్పాలి ‘అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి’ అనే వాక్యంలో... మన జీవితాల్లో ఎక్కువమంది ముందు వాల్మీకిలాగే బతుకువేట సాగిస్తారు. ‘పాలపిట్టల జంట వలపు తేనెల పంట/ పండించుకుని పరవశించి పోయేవేళ/ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు/ఒక పక్షిని నేలకూల్చాడు... వాక్యంలో, జీవితంలో చాలామందికి సంతోషం, దుఃఖం పక్కపక్కనే వచ్చి వెక్కిరిస్తూంటాయి. ఈ పాటలో మొత్తం సంగీతం అలాగే నెమ్మదైన, మృదువైన కరుణ, వెంటనే గంభీరమైన రౌద్రం ఆవేశంతో మనల్ని సమ్మోహనపరుస్తూ ఉంటుంది. మనకిష్టమైన తల్లో, చెల్లో, ప్రియుడో, ప్రియురాలో ఊహించని విధంగా మనసు నుండి దూరమై బాధ కలిగించడం జగమెరిగిన సత్యం.
జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ/ తన కంటిలో పొంగ మనసు కరగంగ/ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే... అక్కడ వచ్చే వయొలిన్ బిట్ మనసున్న ప్రతి మనిషి హృదయాన్ని కలచి వేస్తుంది. ప్రపంచంలో ఎందరో గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాల్లో ఇలాంటి ఏదో ఒక బలమైన సంఘటన, గాయం రేపిన శోకం శ్లోకంగా మారి, చీకటి ఎదలో దీపం వెలుగుల్ని నింపడం చూస్తూనే ఉంటాం.
కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా/మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు... తెరపై ఈ చరణంలో వాల్మీకి నుండి కాళిదాసు, తులసీదాసు, భక్తకన్నప్ప, యోగివేమన, రామకృష్ణ పరమహంస, షిర్డీసాయిబాబా, మహాత్మాగాంధీ, మదర్ థెరిసా వంటి ఎందరో మహానుభావులు కనిపిస్తారు.
మామూలు మనుషులుగా పుట్టి, ఈ పుణ్యభూమిలో మహర్షులై ఎదిగి ఎన్నో కోట్లమంది వ్యక్తులను ఉత్తేజపరిచి తీర్చిదిద్దడానికి కృషిచేశారు ఆ మహానుభావులు.
నవరసభరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం/ ఆ వాల్మీకి మీ వాడు.. మీలోనే ఉన్నాడు/ అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు... తెలుగు సినీ సాహిత్య ఏకైక సవ్యసాచి, నవ్యసాచి కీ.శే. వేటూరి వారి కలం నుండి గళం విప్పిన జీవిత నిత్య నృత్య, సత్య వాక్యాలు ఇవి.
ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం/ తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం... అనే చరణంలో... పుస్తకాలు, బడి, గురువు ఏవీ లేకున్నా... గురువు ఆకృతిలో ఉన్న మట్టిబొమ్మనే నిజ గురువుగా భావించి వినయంతో పూజించి, విశ్రమించని ప్రయత్నంతో ఆచరణ, ఆకాంక్ష, కృషితో విలువిద్యలో అగ్రగామిగా ఎదిగి, తన కుడి చేతి బొటన వేలునే పక్షపాత బుద్ధి వున్న గురువుకి సైతం దక్షిణ ఇచ్చిన వీరుడు ఏకలవ్యుడు. ‘ఎరుకలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు/ వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇల వెలిగాడు... దీన్ని మనం సిరికలవాడు అవకపోతేనేమి గురికలవాడే మొనగాడు అని అన్వయించుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ప్రస్తుత పోటీ ప్రపంచంలో అట్టడుగు స్థాయి నుండి అడుగులేస్తూ అత్యున్నత స్థాయికి చేరుకుని మనలో నిద్రాణమై వున్న ఉద్రేకాన్ని నిద్రలేపుతూనే ఉన్నారు.
ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి/ జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరీనాటికీ/ అడవిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు/ నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు... భరతుడు పరిపాలించబట్టే మనది భారతదేశం అయ్యింది. ఆయన, ఆయన తల్లి సైతం అడవిలోనే పుట్టి పేరుకెక్కారు. ఆ వాక్యాలు నేటికీ అక్షర, అక్షయ సత్యాలు.
నేడు ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో ఎంతోమంది ఆడపడుచులు వివిధ రంగాలలో అగ్రగామిగా, ఉన్నత విజయాలు సాధిస్తూ, మనదేశ కీర్తి పతాకం విశ్వవేదికపై సగర్వంగా రెపరెపలాడేలా ఉత్సాహపరుస్తుంది ఈ పాట. ముఖ్యంగా విద్య, క్రీడ, వ్యాపార, విజ్ఞాన, వాణిజ్య, ఆర్థిక, అభ్యుదయ, ఆధ్యాత్మిక రంగాలలో కలకాలం భారతనారి తరిగిపోని పేరు ప్రతిష్ఠలను సంపాదించాలనే ఆశయంతో ఆవేశభరితంగా ఆలోచనా భరితంగా నడుస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటుంది.
ఈ పాట చివరిలో ఒక గొంతు రెండు గొంతులై వందల వేల గొంతులై ‘అందుకే... కృషి ఉంటే మనుషులు ఋషులౌతారూ...’ అనే విధంగా ముక్తాయింపు ఇచ్చినా... నేటికీ ఏనాటికీ అనేక కోట్ల తెలుగు గొంతుల్లో గంతులేస్తూ, గుండెల్లో నరనరాల్లో తరతరాలకీ... విన్న, తలచుకొన్న ప్రతిసారీ చెరగని తరగని అలుపెరుగని అంతులేని శక్తిని నింపే ఈ పాట నాలాంటి ఎందరో వ్యక్తుల జీవితాల్లో చెరగని ముద్ర వేస్తూ ఉంటుంది.
- సంభాషణ: నాగేష్