అడవిలో పక్షుల కిలకిలరావాలు, సుందర ప్రదేశాలు, జలపాతాలు, పచ్చదనంతో పాటు క్రూర మృగాలు, విష సర్పాలు, పైకి నేలలా కనిపించి అడుగువేయగానే ముంచేసే ఊబిలు కూడా ఉంటాయని తెలిసిందే. అలాంటి అడవిలో ఓ వ్యక్తి జీవించాలనుకున్నాడు. అతనికి గజరాజు అదేనండీ.. ఏనుగు తోడుగా నిలిచింది. ఏనుగుతో అతనికి ఎలా సహవాసం కుదిరింది? అతనికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అన్న అంశాల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘హాథీ మేరీ సాథీ’. రానా హీరోగా తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందిస్తున్నారు. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో బందేవ్ పాత్రలో రానా కనిపించనున్నారు.
1971లో రాజేశ్ ఖన్నా హీరోగా వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ సినిమాకు ఇది రీమేక్ అని సమాచారం. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రానా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ‘‘కొత్తవైన మంచి కథలను చెప్పడానికి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ‘హాథీ మేరే సాథీ’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు రానా. బందేవ్ పాత్రలో రానా భళా అనిపించేలా ఉన్నారని అభిమానులు అంటున్నారు. హిందీలో ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అడవి రాముడు’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమా కాకుండా ‘1945’, ‘అనిళమ్ తిరునాళ్ మార్తాండ వర్మ’ సినిమాల్లో రానా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment