My philosophy
-
మా ఇల్లు ఒక మినీ అసెంబ్లీ!
మై ఫిలాసఫీ ‘స్ట్రగుల్ పీరియడ్’ను దాటి వచ్చాను అని చెబుతుంటారు. నిజానికి స్ట్రగుల్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒకటి దాటిన తరువాత ఇంకొకటి సిద్ధంగా ఉంటుంది. ఒక సవాలును అధిగమించగానే దాని గురించి మరచిపోయి కొత్త సవాలు గురించి ఆలోచిస్తుంటాను. నా వరకు, ఒక రోజు అంటే... ఒక పాఠం. అలా సంవత్సరం పొడవునా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. చర్చ ఎప్పుడూ మంచిదే. ఒకరి నుంచి ఒకరు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మార్చుకోవల్సిన అభిప్రాయాలు ఉంటే మార్చుకోవచ్చు. సినిమాలకు సంబంధించి మా ఇల్లు మినీ అసెంబ్లీ. ఎన్నో సార్లు ఎన్నో సినిమాల మీద చర్చలు జరిగేవి. అలా చర్చించే క్రమంలో అభిప్రాయ వ్యక్తీకరణ బలపడేది. కొత్త విషయాలు తెలిసేవి. వాస్తవాలతో సంబంధం లేకుండా కొన్ని అభిప్రాయాలు స్థిరపడిపోతాయి. ఉదా: సన్నగా, మెరుపు తీగలా ఉన్న హీరోయిన్లే రాణిస్తారు అని. దీన్ని నేను నమ్మను. అందుకే బరువు తగ్గి బాగా సన్నబడాలి అనే ఆలోచన చేయలేదు. లావు, సన్నం అనేవి నటనకు ప్రమాణాలవుతాయని నేను అనుకోను. ఒక సినిమా బాగా ఆడుతుందా లేదా అనేది నటుల చేతిలో లేదు. కానీ, ఒక పాత్రకు న్యాయం చేయడం అనేది పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటుంది. ఈ స్పృహతోనే నా పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. రేపు నాకు అంతా మంచే జరుగుతుంది...అని ఎప్పటికప్పుడు అనుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలూ లేకుండా సుఖంగా ఉండొచ్చు. ‘ఏదో ఒక రోజు ఊపిరిసలపనంత బిజీగా ఉంటాను’ అనుకునేదాన్ని. అది ఇవాళ నిజమైంది. మనస్ఫూర్తిగా కోరుకున్నవి ఫలిస్తాయని నా నమ్మకం. - హుమా ఖురేషి, హీరోయిన్ -
తప్పులను తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటాను!
మై ఫిలాసఫీ జీవితం చాలామందికి పూలబాట కాకపోవచ్చు. పూలబాట అయినవాళ్లకు...అది శాశ్వతం కాకపోవచ్చు. ఈ ఎరుక మనలో ఉంటే కష్టాల్లోనైనా, సుఖాల్లోనైనా స్థిరచిత్తంతో ఉండే గుణం అలవడుతుంది. ‘నా శక్తి ఇది’ అని గొప్పగా చెప్పుకునే వాళ్లకు ‘నా బలహీనత ఇది’ అని చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే లెక్క కుదురుతుంది! మిగతా విషయాలను గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా... నా తప్పులను మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. కొన్ని సమయాల్లో ‘అహం’ వాస్తవాలను చూడడానికి నిరాకరిస్తుంది. అహాన్ని పక్కన పెడితే వాస్తవం చేరువవుతుంది. అహాన్ని వదులుకోవడం అంటే ఒక మెట్టు కిందకి దిగడం కాదు... రెండు మెట్లు పైకి ఎక్కడం. ఉత్తినే సలహాల కోసం సలహాలు ఇచ్చే వారి దగ్గర సలహాలు తీసుకోవడం కంటే, తీసుకోకపోవడం వల్లే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాత్రలు నచ్చకపోయినా ‘నటించాలి’ అనే నియమమేదీ పెట్టుకోలేదు. ‘ఇంటర్నేషనల్ రిలేషన్స్’లో డిగ్రీ ఉంది. సిటీబ్యాంకులో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. చెప్పొచ్చేదేమిటంటే సినిమాలు నచ్చనప్పుడు హాయిగా ఉద్యోగం చేసుకోగలను. ఈ చిన్న జీవితంలో మనం చేయడానికి ఎంతో ఉందని నమ్ముతాను. కష్టాలు, నష్టాల గురించి ఆలోచించడం వృథా. ఇంత పెద్ద జీవితంలో ఆలోచించడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆలోచనా శక్తిని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. బాగా సంపాదించాలి, బాగా కీర్తి గడించాలి... ఇలాంటి కోరికలు ఏమీ లేవు. సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతాను. ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటాను. - సోహా అలీ ఖాన్, హీరోయిన్ -
విజయానికి అతి దగ్గర దారి...
మై ఫిలాసఫీ విజయానికి దగ్గరి దారులు ఎన్నో ఉండవచ్చు. అతి దగ్గరి దారి మాత్రం... అంకితభావం, అమితంగా కష్టపడడం. ‘చాలా పోటీ ఉంది. ఇలాంటి ఎత్తులు వేస్తే మనం నిలదొక్కుకుంటాం’ అని కొందరు సలహాలు ఇస్తుంటారు. మనం నిలదొక్కుకోవడానికి కావల్సింది ‘పని’ తప్ప ‘ఎత్తుగడ’ కాదు. ఎత్తుగడల ద్వారా నిలదొక్కుకున్నా... ఆ పునాది బలహీనంగా ఉంటుంది. రెండో ప్రయత్నం అనేది ఎప్పుడూ మంచిదే. చిన్నప్పుడు లెక్కల టీచర్ అనేవారు ‘‘ఒక్కసారి కాకుంటే వందసార్లు ప్రయత్నించు’’ అని! దీన్ని జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. ఓటమి బరువు... బాధ్యతను పెంచుతుంది. బాధ్యత విజయాన్ని ప్రేరేపిస్తుంది. విజయం మరిన్ని విజయాలకు చుక్కాని అవుతుంది. కష్టపడే తత్వాన్ని పెంపొందిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిదే కానీ, భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తే... వర్తమానంలో మనం చేసే పని దెబ్బతింటుంది. ఫలితం గురించి దీర్ఘంగా ఆలోచించకుండా...నిర్ణయం గురించి లోతుగా ఆలోచిస్తాను. దీని వల్ల నిర్ణయం తీసుకోవడం కాస్త ఆలస్యమైనా అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రొఫెషన్ డిమాండ్ చేసినట్లు మనం ఉండాలిగానీ, మనం డిమాండ్ చేసినట్లు ప్రొఫెషన్ ఉండదు. ఇది తెలుసుకుంటే ఏ వృత్తిలో అయినా మన ప్రయాణం సజావుగా సాగుతుంది. క్షమించడం, మరచిపోవడం అనేవి నా వరకు అత్యున్నత లక్షణాలు. ఎవరో మనకు ఏదో అపకారం చేశారని కక్ష పెట్టుకుంటే మనసు పాడై పోతుంది. కాబట్టి క్షమించడమే కరెక్ట్. ఎప్పుడో ఏదో జరిగిందని దాన్ని తలుచుకొని కుమిలి పోతే కొత్తగా ఏమీ చేయలేం. కాబట్టి ఆ దుఃఖాన్ని మరిచిపోవడమే మంచిది. - జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హీరోయిన్