Mydhukur
-
దర్శనం కోసం వెళ్లారు.. వంకలో చిక్కుకుపోయారు
సాక్షి, మైదుకూరు: వైఎస్సార్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని భైరవకోన క్షేత్రానికి జీపులు, ట్రాక్టర్లలో వెళ్లిన భక్తులు ఆదివారం వర్షాల కారణంగా మోట్లకట్ట వంక వద్ద చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న మైదుకూరు డీఎస్పీ విజయకుమార్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 30 ట్రాక్టర్లు, 2 జీపుల్లో ఉన్నవారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చీకటిపడి సహాయక చర్యలకు ఆటంకం కలగడంతో మరో 3 జీపులు, 2 ట్రాక్టర్లలో భక్తులు వంక ఆవలవైపు ఉండిపోయారు. -
మైదుకూరు ప్రచార సభలో వైఎస్ జగన్
-
దళారీలకు నాయకుడు.. సీఎంగా అవసరమా?
సాక్షి, వైఎస్సార్: ఐదేళ్ల పాలనలో పేదలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు మరోసారి దోచుకోవడానికి వస్తున్నాడని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి మనకు సీఎంగా మళ్లీ అవసరమా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయమని ఐదేళ్లు చంద్రబాబుకు అవకాశం ఇచ్చామని, కానీ పేదలను దోచుకున్నారని వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళారీ వ్యవస్థను అడ్డుకోవాల్సిన సీఎంయే.. వారికి నాయకుడిగా వ్యవరిస్తూ.. రైతులను నిలువునా దోపిడికి గురిచేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తి మనకు సీఎంగా అవసరమా? అని ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించి ఉంటే ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేవని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కడప జిల్లా మైదుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మైదుకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘నా సుధీర్ఘ పాదయాత్రలో ప్రతి ఒక్కరి కష్టాలను నేను చూశాను. వారందరికీ నేను హామీ ఇస్తున్నా... మీ అందరికి అండగా నేను ఉన్నాను. రైతులకు గిట్టుబాటు ధర లేక, సాగునీరు లేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు పాదయాత్రలో అనేకం చూశాను. ఫీజు రీయింబర్స్ మెంట్, ఉద్యోగాలు రాక, చదవుకోవడానికి డబ్బులు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా పాదయాత్రలో చేశాను. 108 అంబులెన్స్ అందుబాటులో లేక, ఆరోగ్యశ్రీ లేక, మందులకు వేల రూపాయలు ఖర్చుచేయలేక మరణించిన వారిని కూడా చూశాను. ఈ విధంగా టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురైయ్యారు. స్థానికంగా రైతులను ఆదుకోవడానికి బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు 17 టీఎంసీలతో వైఎస్సార్ పునాది వేశారు. 14 టీఎంసీల నీటిని నిలువ ఉంచి అప్పుడే రైతులకు ఇచ్చారు. కానీ చంద్రబాబు పాలనలో కనీసం రెండు టీఎంసీలు కూడా ఇవ్వలేదు. కరువు ప్రాంతానికి మేలు చేయడం కోసం 2008లో అనేక ప్రాజెక్టులకు వైఎస్సార్ పునాది వేశారు. చంద్రబాబు ఇప్పటి వరకూ కూడా వాటిని పూర్తిచేయలేకపోయారు. చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు చంద్రబాబు నాయుడి పాలనలో రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. పంటలకు గిట్టుబాటు ధరలేదు, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో మాత్రం అత్యధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు వెయ్యకుండా బిల్లులు తీసుకుంటున్నారు. యనమల రామకృష్ణుడి వియ్యంకుడే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలోనే దోపీడి జరుగుతోంది. కడప కోపరేటీవ్ షుగర్స్ కోసం రైతులు ధర్నాలు చేస్తున్నా.. వారి బాధలు వినిపించుకోరు. చెరుకు రైతులు నెల్లూరు వెళ్లి ప్రైవేటు కంపెనీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఆశగా ఎదురుచూశారు. ఉద్యోగాలు వస్తాయని, మన బతుకులు మారుతాయని ఎంతో ఆశపడ్డం. కానీ ఇంతవరకు దాని ఊసేలేదు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి.. ఇప్పటి వరకు మొత్తం రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయదు. ఐదేళ్ల కాలంలో ఆయన చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు, అబద్ధంలేదు, చూపని సినిమా లేదు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మరోసారి కుట్ర చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. అక్రమంగా గెలవడానికి మూటల మూటల డబ్బు పంపుతా ఉన్నాడు. వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తాం ఓటుకు మూడు వేల రూపాయలు పంచుతున్నాడు. మరోసారి దోచుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి మోస పోవద్దు. వచ్చేది మన ప్రభుత్వమే. అందరినీ ఆదుకుంటా.. పిల్లల్ని బడికి పంపితే చాలు ఏడాదికి 12వేలు చేతిలో పెడతాం. పేద పిల్లల్ని ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పెద్దపెద్ద చదువులను చదవిస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పొదుపు రుణాలను మాఫీ చేస్తాం. మళ్లీ రాజన్న రాజ్యం వచ్చే విధంగా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తాం. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి 75వేలు చేతిలో పెడతాం. పెట్టుబడి కోసం ప్రతి రైతుకు ఏడాదికి 15వేలు ఇస్తాం. రైతులకు గిట్టుబాటు ధరను కూడా కల్పిస్తాం. పెన్షన్లు పెంచుతాం. పేదలకు ఇళ్లు కట్టిస్తాం. నవరత్నాల ద్వార పేదల బతుకుల్లో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ దుర్మరణం
మైదుకూరు టౌన్ : మైదుకూరు మండల పరిధిలోని తువ్వపల్లె మూడుమాళ్ల వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మైదుకూరు హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ ఆకుల చంద్రశేఖర్(46) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రశేఖర్ బుధవారం స్థానిక బద్వేలు రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించి వాటిని ఆన్లైన్లో జియోటాగింగ్ చేశారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు తన కార్యాలయంలో విధులు నిర్వర్తించి తాను నివాసముంటున్న బద్వేలుకు ద్విచక్రవాహనంలో బయలు దేరాడు. మార్గ మధ్యంలో శుభకార్యానికి హాజరై బద్వేలుకు వెళుతుండగా అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో తువ్వపల్లె కూడలి వద్దకు రాగానే ముందు వెళుతున్న లారీని వెనుక భాగంలో ఢీ కొనడంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు ద్విచక్రవాహనం లారీ వెనుక టైరులో ఇరుక్కొని దాదాపు కిలోమీటర్ వరకు రోడ్డు వెంబడి ఈడ్చుకెళ్లింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో ఎలాంటి వాహనం లేదు. దీంతో సీఐ ఆ దారి వెంబడి గాలించగా ఖాజీపేటకు వెళ్లే మార్గంలో లారీ నిలబడి ఉండటాన్ని గమనించి లారీని పోలీసు స్టేషన్‌కు తరలించారు. చంద్రశేఖర్ వాడుతున్న మొబైల్, డైరీ ప్రమాద స్థలంలో లభించాయి. వాటి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడు చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మృతితో మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. -
9 మంది ఎర్ర కూలీలు అరెస్ట్
-
9 మంది ఎర్ర కూలీలు అరెస్ట్
ఖాజీపేట: దువ్వూరు మండలం సీతానగరం పైభాగంలో ఉన్న కన్నెల వాగు చెరువు సమీపంలో 9 మంది ఎర్రచందనం కూలీలసు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 9 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం తెలిపారు. ఖాజీపేట పోలీస్ స్టేషలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం తమకు అందిన సమాచారం మేరకు సీతానగరం పై భాగాన ఉన్న కన్నెలవాగు చెరువు సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో ఖాజీపేట యస్ఐ రంగారావు, దువ్వురు యస్ఐ విద్యాసాగర్, ఖాజీపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారన్నారు. అప్పటికే మొద్దులు తీసుకుని వస్తున్న వారు తమపై రాళ్లతో దాడి చేశారన్నారు. అయినా గట్టిగా ప్రతిఘటించి 9 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి 9 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 314 కేజీల బరువు గల ఈ దుంగల విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందన్నారు. తాము అరెస్టు చేసిన వారంతా తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. గత కొంత కాలంగా ముమ్మరంగా అడవుల్లో కూంబింగ్ నిర్వహించడం వల్ల ఇప్పటివరకు మైదుకూరులో ఏడుగురు, ఖాజీపేటలో ఏడుగురు, దువ్వురూ లో స్థానిక స్మగ్లర్లు ఏడుగురు, ఇప్పడు 9 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఇప్పటికి అడవుల్లో కూంబింగ్ జరుగుతూనే ఉందన్నారు. -
14 ఎర్రచందనం దుంగల స్వాధీనం
ఖాజీపేట: 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఐ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగపట్నం పైభాగాన ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌లో తమిళ కూలీలు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్ఐ రంగారావు, సిబ్బంది దాడులు నిర్వహించారు. దుంగలను తీసుకెళ్తున్న 20 మంది తమిళ కూలీలు పరారయ్యారు. వారితోపాటు ఉన్న మిట్టా ఆదినారాయణరెడ్డి, మునగాల సుబ్రమణ్యం (సర్వర్‌ఖాన్‌పేట)ను అదుపులోకి తీసుకున్నారు. 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వారిని విచారణ చేయగా, నాలుగు రోజుల క్రితం తమిళ కూలీలు కలిశారని తెలిపారు. దారి చూపితే డబ్బు ఇస్తామని చెప్పారన్నారు. తమిళ కూలీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని సీఐ తెలిపారు. -
కారు, బైక్ ఢీకొని ఒకరి మృతి
బ్రహ్మంగారిమఠం: మండలంలోని మల్లేపల్లె పంచాయతీలో ఉన్న శ్రీరాంనగర్ దగ్గర శుక్రవారం రాత్రి కారు– మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న బి.మఠం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. మల్లేపల్లెకు చెందిన ముత్తులూరు నాగప్రశాంత్ (20) పోరుమామిళ్లలో వెల్డింగ్ పని చేస్తుండే వాడు. పని నిమిత్తమై పోరుమామిళ్లకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మోటార్‌బైక్‌పై వస్తుండగా శ్రీరామ్‌నగర్ వద్ద మైదుకూరు నుంచి వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌కు రెండు కాళ్లు విరగడమేగాకుండా నోటి నుంచి రక్తం పడింది. మరో యువకునికి కాలు విరిగింది. వీరిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. ప్రశాంత్ రిమ్స్‌కు తరలించేలోపే దారిలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.