జయహో.. తెలంగాణ
నల్లగొండ, న్యూస్‌లైన్ :అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కల సాక్షాత్కారమైంది. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు బలికాగా...మలి దశ ఉద్యమంలో సమస్త ప్రజానీకం ఐక్యంగా ఉద్యమించింది. ఈ ఉద్యమంలో జిల్లాకు చెందిన శ్రీకాంతాచారి మొదలుకుని వందలాది మంది విద్యార్థులు అమరత్వం పొందారు. ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, కర్షకులు, కార్మికులు కలిసికట్టుగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సంద ర్భంగా ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో ఎన్‌కాలేజీ మైదానంలో నిర్వహించిన సంబురాలు ఆకాశమే హద్దుగా అన్నట్లు వీక్షకులను మురిపించాయి. అర్ధరాత్రి 12 గంటలు దాటా కా మైదానంలో బాణ సంచా కాలుస్తూ కొత్త రాష్ట్రానికి స్వాగతం పలికారు. చీకటిని చీల్చుకుంటూ తారాజువ్వలు ఆకాశంలో వెలుగులు విరజిమ్మాయి. జిల్లా వ్యాప్తంగా పట్టణ, పల్లె ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి పటాకులు కాల్చారు. ఒకరినొకరు అప్యాయంగా కౌగిలించుకుని తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అంగరంగ వైభవంగా..
జిల్లా యంత్రాంగం ఐదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ సంబురాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు నేతృత్వంలో ‘నల్లగొండ జిల్లా తెలంగాణ సంబురాలు’ పేరిట వేడుకలు నిర్వహించారు. సోమవారం మండలాలు, పట్టణ కేంద్రాల్లో నిర్వహించే ర్యాలీలు, మానవహారాలతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఐదు రోజుల పాటు మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన సాంస్కృతిక, సాహిత్య, వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తెలంగాణ సంప్రదాయాలను గుర్తుచేస్తూ మండల, డివిజ న్స్థాయిల్లో నిర్వహించిన బతుకమ్మ ఆటలు, ముగ్గుల పోటీలు, క్రీడా పోటీలకు విశేష స్పందన లభించింది.
మిన్నంటిన సంబురాలు..
జిల్లా కేంద్రంలోని ఎన్‌కాలేజీ మైదానంలో మూడు రోజులు పాటు నిర్వహించిన తెలంగాణ సంబురాలను విజయవంతం చేసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్య, కళాకారులను ఆహ్వానించారు. జానపదం, తెలంగాణ నాటకాలు, ఉద్యమాల పాటలు, సాహిత్యం, ఆటాపాట, డప్పు నృత్యాలు, ఒగ్గు కళాకారుల బృందం, లంబాడా నృత్యాలు, బోనాలు వంటి కార్యక్రమాలు వీక్షక్షులను అలరించాయి. చేనేత వస్త్రాలు, తెలంగాణ వంటకాలు, తెలంగాణ కట్టుబొట్టుకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సత్కారాలు...సన్మానాలు..
వివిధ ప్రాంతాల్లో ఆయా రంగాల్లో పనిచేస్తున్న జిల్లాకు చెందిన అధికారులు, సినీ నటులు, కవులు, కళాకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను ఈ వేడుకులకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాలకు జిల్లా రాజకీయ ప్రముఖలు, ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు.
నేడు ఆవిర్భావ వేడుకలు..
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం 8.45 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదనాంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. దీంతో పాటు అదే సమయానికి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ , ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గ్రామ పంచాయతీల వరకు ఈ వేడుకలను కన్నుల పండవగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంగా ఈ వేడుకలను వారం రోజుల పాటు నిర్వహించనుంది.
కొత్త రాష్ట్రంలో ప్రత్యేక ఆఫర్..
తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా సోమవారం జిల్లాలోని పట్టణ ప్రాంతాల వస్త్ర వ్యాపారులు, రెడీమేడ్ వస్త్ర వ్యాపారులు, చెప్పుల దుకాణదారులు 20 శాతం ప్రత్యేక డిస్కౌంట్‌తో త మ వస్తువులను విక్రయించడానికి అం గీరించినట్లు కలెక్టర్ తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.