విమానాల్లో వచ్చి చోరీ.. ఆ కిక్కే వేరబ్బా!
బైకుపై వచ్చి గొలుసు దొంగతనాలు, మామూలుగా పిల్లిలా వచ్చి ఇళ్లలో దొంగతనాలు చేయడం మనకు తెలుసు. కానీ విమానాల్లో వచ్చి దొంగతనం చేసి మళ్లీ అంతే వేగంగా విమానాల్లో చెక్కేసే దొంగను ఎక్కడైనా చూశారా? అలాంటి దొంగను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ చోర కళా కోవిదుడు చెప్పిన వివరాలు విన్న పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. దొంగతనాలు చేయడానికి ఒక ఊరి నుంచి మరో ఊరికి విమానాల్లో వెళ్లడం అతగాడి స్పెషాలిటీ. ఏదో పనిమీద విమానంలో వెళ్లి, పనిలో పనిగా దొంగతనాలు చేయడం కాదు.. కేవలం చోరీల కోసమే విమాన ప్రయాణాలు చేస్తాడు మనోడు!!
హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు చదువులో మహా చురుకు. ఎంబీబీఎస్‌లో సీటు కూడా సంపాదించాడు. రేపో మాపో వైద్య వృత్తిలో ప్రవేశించాల్సిన అతడు.. జీవితంలో కొత్తదనాన్ని కోరుకున్నాడు. పుస్తకాలు పక్కన పెట్టి చోరమార్గం ఎంచుకున్నాడు. ఇళ్లలో దొంగతనాలు చేస్తుండగా అందులోనూ 'కిక్' కావాలనుకున్నాడు. అలా వైద్యుడి (నకిలీ) అవతారం ఎత్తాడు. కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు కారులో వెళ్లి ...రోగులతో మీ ఆరోగ్యం తర్వలో కుదుటపడుతుందని మీకేం పర్వాలేదు నేనున్నాను అంటూ వారికి, వారి బంధువులకు సాంత్వన కల్పిస్తూనే నగలు, నగదు క్షణాలలో మాయం చేసేవాడు.
అతగాడి దెబ్బకు బెంగళూరు, కోయంబత్తూరులోని ఆస్ప్తత్రులలో పలువురు రోగులు, వారి బంధువులు బాధితులుగా మారి... పోలీసులను ఆశ్రయించారు. దాంతో ఈ కొత్త రకం చోరీలేంటిరా బాబూ అంటూ పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత సదరు నకిలీ వైద్యుడు విజయవాడలోని పలు ఆసుపత్రులలో కూడా ప్రదర్శించాడు. దాంతో బాధితులు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటక, తమిళనాడు పోలీసుల సమన్వయంతో ఎట్టకేలకు ఛేదించారు. నకిలీ వైద్యుడ్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతడ్ని విచారించగా.... విమానాలలో వెళ్లి మరీ దొంగతనాలు చేసేవాడినని చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు.