NAD
-
కేంద్ర కేబినెట్ లో ఏపీకి 4 లేదా 5 మంత్రి పదవులు
-
అవసరమైతే మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తాం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఆర్కె బీచ్ నుంచి భోగాపురం వరకు ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆయన సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఎన్ఏడీ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బోత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..ఫ్లై ఓవర్ బ్యూటిఫికేషన్ వర్క్స్ పూర్తి చేశాకే ప్రారంభిస్తామని, అవసరమైతే మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేశామని గుర్తుచేశారు. విశాఖలో మరిన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం, డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రుషికొండ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఆస్తి పన్ను విషయంలో 15శాతానికి మించి పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 350గజాలు ఉన్నవారికి రూ. 50 మాత్రమే పెరుగుతుందని తెలిపారు. బ్యాంకులుపై చెత్త వేసిన ఘటనపై కమిటీ వేశామని, దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివారస్‌రావు మాట్లాడుతూ.. విశాఖలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, విశాఖ పరిపాలన రాజధాని, టూరిజం హబ్‌గా మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. -
టీడీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసులపై దౌర్జన్యం
సాక్షి, విశాఖపట్నం: పట్టణంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్ కుమార్‌లు గురువారం ఉదయం ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించవ్దదంటూ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పోలీసులతో గొడవకు దిగారు. ర్యాలీకి అనుమతులేందుకంటూ పోలీసులపై దాడి చేశారు. జంక్షన్ వద్ద ఉన్న బారికేడ్స్‌ను తోసేసి ర్యాలీగా వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పర్యటన సందర్భంగా విశాఖ నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. టీడీపీ నాయకులు, కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో నగర పౌరులు ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వచ్చింది. పోలీసులతో వాగ్వివాదాలకు దిగుతూ తెలుగు తమ్ముళ్లు ఓవరాక్షన్ చేయడంతో రద్దీ రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. అత్యుత్సాహం ప్రదర్శించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు వారించకపోవడం గమనార్హం. -
నిర్మాణ వేళ ట్రాఫిక్ ఇలా
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): నగరంలోనే అత్యంత రద్దీ అయిన ఎన్ఏడీ కూడలిలో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఆటంకాలెన్నో అధిగమించి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు గురువారం భూమిపూజ కూడా జరిగింది. ఫ్లైఓవర్ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు చాలావరకు తీరినట్లే.. అయితే అసలు సమస్య నిర్మాణ సమయంలోనే.. జిల్లాలోని 43 మండలాల్లో విశాఖ రూరల్, భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం మండలాలు మినహా మిగిలిన 39 మండలాలకు ఇదే ప్రధానమార్గం. మరి ఏళ్ల తరబడి సాగే నిర్మాణవేళ ట్రాఫిక్ మళ్లింపు అధికారులకు ఓ సవాల్ వంటిదనే చెప్పవచ్చు. దీనిపై ఉన్నతాధికారులు పలుమార్లు ఎన్ఏడీలో పర్యటించారు. ప్రత్యామ్నాయాలపై దృష్టినీ సారించారు. అయితే స్థానికులు కూడా కొన్ని మార్గాలను చెబుతున్నారు. వాటిపైనా అధికారులు ఓ మారు ఆలోచిస్తే కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తీరవచ్చు అంటున్నారు. ఆ వివరాలివి.. గాజువాక నుంచి వచ్చే వారికి .. ♦ గాజువాక నుంచి నగరంలోకి వెళ్లేవారు షీలానగర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ మీదుగా నగరంలోకి చేరుకోవచ్చు. ♦ గాజువాక నుంచి పెందుర్తి వెళ్లేవారు షీలానగర్ నుంచి నరవ మీదుగా గోపాలపట్నం, పెందుర్తి చేరుకునే రహదారి ఉంది. ♦ కాకానినగర్ వరకు వచ్చినట్లయితే ఎన్ఏడీ రాకుండా సాకేతపురం నుంచి దుర్గాపురం, అశోకా పార్క్ మీదుగా 104 ఏరియాకు చేరుకునే అవకాశం ఉంది. ♦ విమాన్‌నగర్ నుంచి యల్లపువాని పాలెం, చంద్రనగర్ మీదుగా గోపాలపట్నం చేరుకోవచ్చు. అయితే ఈ మార్గంలో ద్విచక్రవాహనాలు మినహా ఇతర వాహనాల రాకపోకలు కష్టం. ♦ విమాన్‌నగర్ మీదుగా వెళ్లేందుకు పరిశీలనలో ఉన్న ఈ మార్గంలో వెళ్లాలంటే సుమారు 13 రైల్ ట్రాక్‌లు దాటాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గం బాజీ జంక్షన్‌ను పాత గోపాలపట్నానికి కలుపుతుంది. (ఇది ప్రయోజనం లేని రహదారి) నగరం నుంచి గోపాలపట్నం రావాలంటే ♦ నగరం నుంచి గోపాలపట్నం రావాలంటే ఎన్ఎస్టీఎల్ గోడ తొలగించి రహదారి నిర్మాణం చేపట్టాలి. ♦ లేదంటే ఎన్ఎస్టీఎల్ అధికారుల అనుమతితో వారి ప్రధాన గేట్లలో నుంచి రాకపోకలకు అనుమతి పొందాలి. ♦ సింహాచలం దేవస్థానం పెట్రోలింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న కచ్చా రహదారిని ప్రయాణాలకు అనుగుణంగా తయారు చేస్తే మరో ప్రత్యమ్నాయ మార్గం అవుతుంది. ♦ మర్రిపాలెం, కరాస ప్రాంతాల నుంచి గోపాలపట్నం, పెందుర్తి రావాలన్నా ఎన్ఎస్టీఎల్ రహదారిపై ఆధార పడాల్సిందే. పెందుర్తి, గోపాలపట్నం ప్రాంతాల వారికి.. పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరైన మార్గం లేదు. వీరు వేపగుంట మీదుగా సింహాచలం, జైలు రోడ్డు గుండా హనుమంతవాక మీదుగా నగరానికి చేరుకోవాలి. లేదంటే ఎన్ఎస్టీఎల్ 80అడుగుల రోడ్డు వస్తే సులువవుతుంది. ఎన్ఎస్టీఎల్ గోడ తొలగించిరోడ్డు నిర్మించాలి ఎన్ఏడీ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో ట్రాఫిక్ మళ్లించడం కష్టమే. అందులో ప్రధానమైనది ఎన్ఎస్టీఎల్ గోడ తొలగించి 80అడుగుల రహదారి నిర్మించడమే. ఈ రోడ్డు నిర్మాణంపై నాయకులు, అధికారులు చర్యలు ముమ్మరం చేయాలి. – రాజు, కరాసా -
ప్రాణాలర్పించైనా ఎన్ఏడీని అడ్డుకుంటాం..
నేవల్ ఆర్మ్డ్ డిపో వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు సుమల గోవింద్ దత్తిరాజేరు : ప్రాణాలర్పించైనా ఎన్ఏడీని అడ్డుకుంటామని పాచలవలస మాజీ సర్పంచ్, ఎన్ఏడీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు సుమల వెంకట అప్పలనాయుడు (గోవింద్) స్పష్టం చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట వామపక్ష నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, సీహెచ్ కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఎనిమిది బాధిత గ్రామాల ప్రజలతో ఆందోళన చేపట్టారు. నేవల్ ఆర్మ్డ్ డిపో ఏర్పాటు చేయవద్దని కోరుతూ తహశీల్దార్ పేడాడ జనార్దనరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో గోవింద్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వ భూములుండగా, దత్తిరాజేరులో ఎందుకు ఎన్ఏడీ ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మండలంలో ఎక్కువ మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, అటువంటి వారి కడుపు కొట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సీపీఎం నాయకుడు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ, పచ్చటి పొలాల్లో ఎన్ఏడీ ఏర్పాటు చస్తే ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఇటువంటి ప్రమాదకరమైన నిర్మాణాలను వెంటనే ఆపకపోతే తిరుగుబాటు తప్పదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ కామేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్ఏడీ వల్ల మండలానికే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కడుబండి రమేష్‌నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మంత్రి అప్పలనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ రౌతు జయప్రసాద్నాయుడు మాట్లాడుతూ, ఎన్ఏడీ వల్ల ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వి. కృష్ణాపురం, వింద్యవాసి సర్పంచ్‌లు మర్పిన తిరుపతి, కోలా సత్తిబాబు, గుషిడి జగన్నాథం, మార్పిన సత్యనారాయణ, రొంగలి వెంకన్న, ఆదినారాయణ, కర్రి అప్పలనాయుడు, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.