
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): నగరంలోనే అత్యంత రద్దీ అయిన ఎన్‌ఏడీ కూడలిలో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఆటంకాలెన్నో అధిగమించి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు గురువారం భూమిపూజ కూడా జరిగింది. ఫ్లైఓవర్ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు చాలావరకు తీరినట్లే.. అయితే అసలు సమస్య నిర్మాణ సమయంలోనే.. జిల్లాలోని 43 మండలాల్లో విశాఖ రూరల్, భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం మండలాలు మినహా మిగిలిన 39 మండలాలకు ఇదే ప్రధానమార్గం. మరి ఏళ్ల తరబడి సాగే నిర్మాణవేళ ట్రాఫిక్ మళ్లింపు అధికారులకు ఓ సవాల్ వంటిదనే చెప్పవచ్చు. దీనిపై ఉన్నతాధికారులు పలుమార్లు ఎన్‌ఏడీలో పర్యటించారు. ప్రత్యామ్నాయాలపై దృష్టినీ సారించారు. అయితే స్థానికులు కూడా కొన్ని మార్గాలను చెబుతున్నారు. వాటిపైనా అధికారులు ఓ మారు ఆలోచిస్తే కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తీరవచ్చు అంటున్నారు. ఆ వివరాలివి..
గాజువాక నుంచి వచ్చే వారికి ..
♦ గాజువాక నుంచి నగరంలోకి వెళ్లేవారు షీలానగర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ మీదుగా నగరంలోకి చేరుకోవచ్చు.
♦ గాజువాక నుంచి పెందుర్తి వెళ్లేవారు షీలానగర్ నుంచి నరవ మీదుగా గోపాలపట్నం, పెందుర్తి చేరుకునే రహదారి ఉంది.
♦ కాకానినగర్ వరకు వచ్చినట్లయితే ఎన్‌ఏడీ రాకుండా సాకేతపురం నుంచి దుర్గాపురం, అశోకా పార్క్ మీదుగా 104 ఏరియాకు చేరుకునే అవకాశం ఉంది.
♦ విమాన్‌నగర్ నుంచి యల్లపువాని పాలెం, చంద్రనగర్ మీదుగా గోపాలపట్నం చేరుకోవచ్చు. అయితే ఈ మార్గంలో ద్విచక్రవాహనాలు మినహా ఇతర వాహనాల రాకపోకలు కష్టం.
♦ విమాన్‌నగర్ మీదుగా వెళ్లేందుకు పరిశీలనలో ఉన్న ఈ మార్గంలో వెళ్లాలంటే సుమారు 13 రైల్ ట్రాక్‌లు దాటాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గం బాజీ జంక్షన్‌ను పాత గోపాలపట్నానికి కలుపుతుంది. (ఇది ప్రయోజనం లేని రహదారి)
నగరం నుంచి గోపాలపట్నం రావాలంటే
♦ నగరం నుంచి గోపాలపట్నం రావాలంటే ఎన్‌ఎస్టీఎల్ గోడ తొలగించి రహదారి నిర్మాణం చేపట్టాలి.
♦ లేదంటే ఎన్‌ఎస్టీఎల్ అధికారుల అనుమతితో వారి ప్రధాన గేట్లలో నుంచి రాకపోకలకు అనుమతి పొందాలి.
♦ సింహాచలం దేవస్థానం పెట్రోలింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న కచ్చా రహదారిని ప్రయాణాలకు అనుగుణంగా తయారు చేస్తే మరో ప్రత్యమ్నాయ మార్గం అవుతుంది.
♦ మర్రిపాలెం, కరాస ప్రాంతాల నుంచి గోపాలపట్నం, పెందుర్తి రావాలన్నా ఎన్‌ఎస్టీఎల్ రహదారిపై ఆధార పడాల్సిందే.
పెందుర్తి, గోపాలపట్నం ప్రాంతాల వారికి..
పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరైన మార్గం లేదు. వీరు వేపగుంట మీదుగా సింహాచలం, జైలు రోడ్డు గుండా హనుమంతవాక మీదుగా నగరానికి చేరుకోవాలి. లేదంటే ఎన్‌ఎస్టీఎల్ 80అడుగుల రోడ్డు వస్తే సులువవుతుంది.
ఎన్‌ఎస్టీఎల్ గోడ తొలగించిరోడ్డు నిర్మించాలి
ఎన్‌ఏడీ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో ట్రాఫిక్ మళ్లించడం కష్టమే. అందులో ప్రధానమైనది ఎన్‌ఎస్టీఎల్ గోడ తొలగించి 80అడుగుల రహదారి నిర్మించడమే. ఈ రోడ్డు నిర్మాణంపై నాయకులు, అధికారులు చర్యలు ముమ్మరం చేయాలి. – రాజు, కరాసా
Comments
Please login to add a commentAdd a comment