బలప్రదర్శన
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మంచిర్యాల ఆర్అండ్బీ కాంగ్రెస్ నేతల బలప్రదర్శనకు వేదికైంది. సాక్షాత్తు రాహుల్ దూత ఎదుట మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఇరువ ర్గాలు తోపులాటకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాబోయో ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడానికి శుక్రవారం రాహుల్ దూత, మహారాష్ట్రలోని చిమ్మూర్ శాసనసభ్యుడు విజయ్వడెట్టివార్, పీసీసీ పరిశీలకుడు బండి నర్సాగౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మంచిర్యాలకు వచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలైన మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు.
నాయకుల రంగప్రవేశం
మొదట దివాకర్‌రావు వర్గీయులు ఐబీకి చేరుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పరిశీలకుడిని కలిసి దివాకర్‌రావు టికెట్ ఇవ్వాలని కోరారు. కొద్ది సేపటి తర్వాత ప్రేంసాగర్‌రావు రంగప్రవేశం చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల కార్యకర్తలు జిందాబాద్ అంటూ పరస్పర నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నినాదాలతో ఒకరిపై ఒకరు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.
కార్యకర్తలను రెండు వర్గాలుగా వేర్వేరుగా చేశారు. పోలీసులు మధ్యలో నిల్చుని కార్యకర్తలను అదుపు చేయడానికి తంటాలు పడ్డారు. పరిశీలకున్ని మండలం, పట్టణాలవారీగా కలవడానికి అనుమతిచ్చారు. రెండు వర్గాల కార్యకర్తలు లోపలికి దూసుకు వెళ్లడంతో అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు.
అభిప్రాయాల సేకరణ
రెండు గంటలపాటు కార్యకర్తల నినాదాలతో ఐబీ ప్రాంగణం ప్రతిధ్వనించింది. కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కులాలవారీగా అభిప్రాయాలను పరిశీలకుడు కోరారు. మూడు నియోజకవర్గాలకు పది దరఖాస్తులు వచ్చాయి. తన వర్గీయులను దూరంగా నెట్టి వేస్తూ ప్రేంసాగర్‌రావు వర్గీయులను ఏమి అనడం లేదని ఆరోపిస్తు పోలీసులతో దివాకర్‌రావు, ఆయన తనయుడు విజిత్‌రావు పోలీసులతో వాదనకు దిగారు. కాగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో మంచిర్యాల సీఐలు రవీంద్రారెడ్డి, కరుణాకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, శ్రీలత, పోలీసులు ఉన్నారు.
తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు.. : పరిశీలకుడు విజయ్ వాడెట్టివార్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఏ శక్తులు అడ్డుకోలేని రాష్ట్ర పరిశీలకుడు విజయ్ వడెట్టివార్ అన్నారు. ఐబీలో కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన తెలంగాణను ఆపలేరని స్పష్టం చేశారు.
సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం సీడబ్ల్యుసీలో తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశం అనంతరం రాష్ట్రం విభజన జరుగుతోందని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగుర వేయాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు.
సందెట్లో సడేమియా
సందెట్లో సడెమియాలా జేబుదొంగలు తమ హస్తలాఘవానికి పని చెప్పారు. కాంగ్రెస్‌లో రెండు వర్గాల నేతలు కయ్యానికి కాలు దూస్తున్న సమయంలో ఆదమరిచి ఉండడాన్ని జేబుదొంగలు అనుకూలంగా మలచుకున్నారు. ఓ వ్యక్తి నుంచి రూ.14 వేలు, మరోవ్యక్తి జేబు నుంచి సెల్ ఫోన్, రూ.20వేలు నగదు తస్కరించారు.