సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మంచిర్యాల రాజకీయం రసకందాయంలో పడింది. మంచిర్యాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరవిందరెడ్డి బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నా రు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని గట్టివాదనను వినిపించిన అరవిందరెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరుతానని నెల రోజుల క్రితమే ప్రకటించారు. ఇటీవల తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఉన్న సమయంలో కూడా అరవిందరెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటన చేశారు. అనుకున్నట్లుగానే బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
టిక్కెట్టు కోసం పెరిగిన పోటీ
అరవిందరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో నియోజకవర్గంలో టిక్కెట్టు కోసం మధ్య పోటీ పెరిగింది. తూర్పు జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన మంచిర్యాల స్థానం జనరల్‌గా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతల కన్ను ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఈ టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే తమ అనుచరులను, ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఈ నియోజకవర్గంలోని పలు మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల విషయంలో ఈ ఇద్దరి నేతల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రాహుల్‌గాంధీ దూత మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ఇరువురు నేతలు ఆయన ముందు బలప్రదర్శనకు దిగారు.
ఇప్పుడు తాజాగా అరవిందరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడంతో ఇక్కడ టిక్కెట్టు ఆశించే ముఖ్య నేతల మధ్య పోటీ పెరిగింది. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ అరవిందరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. టిక్కెట్టు విషయంలో అరవిందరెడ్డికి స్పష్టమైన హామీ లభించిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. దివాకర్‌రావుకు స్థానికంగా పట్టుంది. గతంలో సీఎం కిరణ్‌తో ఉన్న సంబంధాలతో ప్రేంసాగర్‌రావు పలు మార్కెట్ కమిటీ చైర్మన్లను తన అనుచరులకు ఇప్పించుకో గలిగారు. దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయి చేరాయి.
టీఆర్‌ఎస్ విలీనం, పొత్తులతో..
మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం లేదా పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ విలీనం అయిన పక్షంలో ఈ సీటు కోసం పోటీ పడే నేతల సంఖ్య పెరుగుతుంది. టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న మున్సిపల్ మాజీ చైర్మన్ కృష్ణారావు మంచిర్యాల నుంచి పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు పెద్దపల్లి ఎంపీ వివేక్ తన సతీమణిని ఇక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనమైతే ఈ టిక్కెట్టు కోసం పోటీ పడే ముఖ్యనేతల సంఖ్య ఏకంగా ఐదుకు చేరనుంది. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఎవరికి టిక్కెట్టు దక్కుతుందో తెలియక తికమక పడుతున్నారు.
కాంగ్రెస్‌లో కలకలం
Published Thu, Feb 27 2014 4:55 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement
Advertisement