మోదీకి గోల్డ్‌మెడల్ ఇవ్వొచ్చు: దిగ్విజయ్
పరిగి(రంగారెడ్డి):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీలాంటి అబద్ధాలు చెప్పే నేతను తన జీవితంలో చూడలేదని తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. అబద్ధాల విషయంలో మోదీకి గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం పరిగిలో కాంగ్రెస్ నిర్వహించిన జనావేదన సభలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేర్లు మార్చి మోదీ అమలు చేస్తున్నారని చెప్పారు. రిజర్వ్ బ్యాంకు నుంచి గుజరాత్ లోని అమిత్ షా బ్యాంకుకు కొత్త కరెన్సీ తరలిందని ఆరోపించారు.
ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి వచ్చిన కమీషన్లను కేసీఆర్ కుటుంబం పంచుకుంటోందని ధ్వజమెత్తారు. మంత్రులు కుర్చీలకే పరిమితం అయ్యారు...వారికి ఎలాంటి అధికారం ఇవ్వటంలేదని మండిపడ్డారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. బంగారు తెలంగాణ అంటూ బోగస్ మాటలు చెబుతూ రాష్ట్ర మంత్రులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వాటర్ గ్రిడ్ లో భారీ అవినీతి జరుగుతోందన్నారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి రంగారెడ్డి ప్రజలకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం అంటూ కేసీఆర్ ఇంట్లో మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దగుల్బాజీ పాలన నడుస్తోందని తెలిపారు. ఉద్యోగాలఫై అందరం కలిసి గల్లా పట్టి అడుగుదామని పిలుపునిచ్చారు. ఎక్కడ కార్యకర్తకు అన్యాయం జరిగినా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమను ఇబ్బందులు పెడుతున్న అధికారులు, తెరాస నేతలు భవిష్యత్ లో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.