తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ల పెంపు బిల్లుతో ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు.
మోదీ, కేసీఆర్ మధ్య రహస్య స్నేహం: దిగ్విజయ్ సింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ల పెంపు బిల్లుతో ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా పార్టీ నిర్మాణంపై ముఖ్య నేతలతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, గిరిజనులకు కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశముందని పేర్కొన్నారు. అయినా ముస్లిం రిజర్వేషన్ బిల్లుతో కలిపి, గిరిజనుల రిజర్వేషన్లు బిల్లు పెట్టడం వల్ల రెండు వర్గాలకు నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రస్తుత బిల్లుతో ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లకు ప్రమాదముందని హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మతాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ కల్పించిందని, మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు అబద్ధాలు, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, మోదీల మధ్య రహస్య స్నేహం కొనసాగుతున్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల పేరుతో ఇరువర్గాలను రెచ్చగొట్టి బీజేపీ, టీఆర్‌ఎస్ రాజకీయ లద్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ స్థాయికి మించి, కృతజ్ఞత మరిచి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గలీజు పార్టీ ఎలా అయిందో కేటీఆర్ చెప్పాలన్నారు.