మోదీ విదేశాలకు, కేసీఆర్ సొంత పనులకు..
ఆదిలాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అటు ప్రధాని మోదీకి, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రైతుల బాధలు పట్టడంలేదన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీని అమలు చేసి వుంటే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగేవి కావని దిగ్విజయ్ అన్నారు.
సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకే పరిమితం అయ్యారని, ఇక కేసీఆర్కు రైతుల గురించి పట్టించుకునే తీరిక లేదని ఎద్దేవా చేశారు. దేశంలో రైతులు, కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్ సందేశ్ యాత్రలో దిగ్విజయ్ పాల్గొన్నారు.